తాబేళ్లను పెంచుకుంటున్న వ్యక్తిపై కేసు
హైదరాబాద్: తాబేళ్లను పెంచుకుంటున్న ఓ వ్యక్తి, వాటిని విక్రయిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటన ఇచ్చాడు. దీనికి గాను అతనిపై వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి నార్త్‌జోన్ ఫారెస్టు ఉప్పల్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కె.బాలయ్య, రేంజ్ ఆఫీసర్ విజయకుమార్ తెలిపిన వివరాలు.. పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్‌లో నివాసం ఉండే ఆర్.బాలకృష్ణారెడ్డి అనే రైతు ఆరు నెలలుగా రెండు తాబేళ్లను కొనుగోలు చేసి పెంచుకుంటున్నాడు. వాటిని విక్రయించడానికి ఓఎల్ఎక్స్ డాట్‌కాంలో ఇటీవల ప్రకటన ఇచ్చాడు.
ఆ ప్రకటనను సహయోగ్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రధాన కార్యదర్శి గిరిధర్ గోపాల్, వన్య ప్రాణుల నేర నిరోధక మాజీ స్పెషల్ ఆఫీసర్ మహేష్ అగర్వాల్ చూశారు. గురువారం వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఫారెస్టు అధికారులు బాలకృష్ణారెడ్డి ఇంటిపై దాడి చేసి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం తాబేళ్లు పెంచడం నేరమని, అందుకుగాను బాలకృష్ణారెడ్డిపై రూ. 50 వేలు జరిమానా విధించటంతోపాటు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఎవరైనా వన్య ప్రాణులను పెంచుతుంటే 9394005600, 9866243719 ఫోన్లకు సమాచారం అందించాలని కోరారు.
(బోడుప్పల్)