bale manchi roju
-
మనోళ్లకి భలే మంచి వెరైటీ
చిత్రం : 'భలే మంచి రోజు' తారాగణం : సుధీర్‌బాబు,వామిక,పోసాని సంగీతం : సన్నీ' కెమేరా : శామ్‌దత్ ఎడిటింగ్ : ఎం.ఆర్.వర్మ నిర్మాతలు : విజయ్ - శశి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : టి. శ్రీరామ్ ఆదిత్య కొత్త రక్తంతో కొత్త ఆలోచనలు, ధోరణులొస్తాయి. అది ఏ రంగంలోనైనా సహజం. సినీరంగం విషయానికే వస్తే - డిజిటల్ ఉపకరణాలు, వేదికలు పెరిగిపోయాక సాంకేతిక నిపుణుడిగా ఎంట్రీ సంపాదించడం కొంత సులభ మైంది. అలా వస్తున్న కొత్త రక్తం కొత్త తరం సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రయత్నం చేస్తోంది. అలా డిజిటల్ మీడియా, లఘు చిత్రాల సాక్షిగా వచ్చిన కొత్త దర్శకుడు - శ్రీరామ్ ఆదిత్య. షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలై ఫీచర్ ఫిల్మ్స్‌కి ఎదిగిన అతని తాజా వెండితెర ప్రయత్నం - ‘భలే మంచి రోజు’. ఒక సగటు కారు షెడ్ మెకానిక్ దంపతుల (పరుచూరి గోపాలకృష్ణ, ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మి) కొడుకు రామ్ (సుధీర్ బాబు). బెంజ్ కార్లు నడిపే అతణ్ణి చూసి, డబ్బున్నవాడనుకొని మాయ (ధన్యా బాలకృష్ణ) ప్రేమిస్తుంది. తీరా అసలు సంగతి తెలిసి, వేరొక అబ్బాయి (చైతన్య కృష్ణ)తో పెళ్ళికి సిద్ధమవుతుంది. ఆమెను ఏదైనా చేయాలని హీరో బయ ల్దేరి, కిడ్నాపైన ఒక పెళ్ళికూతురిని యాదృచ్ఛికంగా కాపాడతాడు. కానీ, కాబోయే బావ (ప్రవీణ్)ను రౌడీ శక్తి (సాయికుమార్) బారి నుంచి కాపాడడానికి మళ్ళీ తానే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి సిద్ధమవుతాడు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఇతరులూ ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ ఆ అమ్మాయెవరు? ఎందుకు ఇంతమంది కిడ్నాపింగ్‌కు ప్రయత్నిస్తున్నారన్నది ఆసక్తికరమైన రకరకాల పాత్రలతో ఒక్కో ఎపిసోడ్‌గా బయటకొచ్చే మిగతా సినిమా కథ. నటీనటులందరూ యథాశక్తి నటించినా ఇది ప్రధానంగా దర్శకుడి సినిమా. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఒకే రోజులో జరిగే కథ ఇది. గతంలో ఇలాంటి ‘టైమ్’లీ స్క్రిప్టులొచ్చినా, దీన్ని ఎలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారో చూడాలనిపిస్తుంది. వెరైటీగా అనేక ఫ్లాష్ బ్యాక్‌లతో స్క్రీన్‌ప్లే అల్లుకున్నారు దర్శకుడు. అలాగే, ఒక మెయిన్ ప్లాట్‌కు ఎన్నో సబ్-ప్లాట్లు, ఒక మెయిన్ క్యారెక్టర్ కథలో మరెన్నో ఇతర పాత్రలు తారస పడుతూ వచ్చి, చివరకు వాటన్నిటినీ ఒక తాటి మీదకు తెచ్చారు. అది నిజంగా మంచి పద్ధతే. పాత్రలు - వాటి తాలూకు కథలు - అన్నీ తెలియకుండానే ఒకదానికొకటి ముడిపడి ఉండడం ఇంట్రెస్టింగే. కానీ, కథలో తుపాకీ కనపడిందంటే - అది ఎక్కడో ఒకచోట పేలాల్సిందే అన్న సూత్రాన్ని అతిగా అనుసరించినా కష్టమేనని ఆలస్యంగా, ఆనక చాలా కష్టంగా తెలుస్తుంది. అందుకోసం కొన్నిచోట్ల రాజీ పడాల్సీ వచ్చింది. అయితే, ఈ చిత్రానికి శామ్‌దత్ కెమేరా వర్క్ మూలస్తంభం. సినిమా మొదలైనప్పుడు వచ్చే ఏరియల్ షాట్స్ మొదలుకొని, ఛేజ్‌లు, యాక్షన్ సన్నివేశాల దాకా చాలావాటిలో శామ్ పనితనం అర్థమైపోతుంటుంది. హీరోకు లక్కీ అయిన ఎల్లో కలర్ స్కీమ్ ను తెలివిగా వాడారు. అయితే, సంగీతం కొంత డ్రాబ్యాక్ అయింది. తెర మీది సన్నివేశాన్నీ, సందర్భాన్నీ మించిపోతూ, సన్నీ చేసిన రీరికార్డింగ్ కొన్ని మాటల్నీ మింగేసింది. కథలోనూ కొన్ని లోపాలు లేకపోలేదు. సాయికుమార్ పోషించిన శక్తి పాత్ర, ఐశ్వర్య చేసిన అతని భార్య పాత్ర కొంత వల్గారిటీ అనిపిస్తుంది. ఇటీవలి అనేక తెలుగు సినిమాల్లో లానే ఇందులోనూ క్రైస్తవ ఫాదరీలనూ, వారి మాట, ప్రవర్తనల్నీ వినోదానికి వాడుకున్నారు. చర్చి ఫాదర్ పాల్గా పోసాని హావభావాలు అలరిస్తాయి. సినిమా ఆఖరులో వచ్చే సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ మల్లెపుష్పం రామారావు పాత్ర హైలైట్. అతని మిమిక్రీ మాస్‌ని కట్టిపడేస్తుంది. వెరసి, కొన్ని లోటుపాట్లున్నా, రొటీన్ స్క్రిప్ట్‌లతో విసిగిపోయిన మల్టీప్లెక్స్ ఆడియన్సకు ఇది మంచి వెరైటీ అనుభవం. -
'భలే మంచి రోజు' మూవీ రివ్యూ
టైటిల్ : భలే మంచి రోజు జానర్ : క్రైం కామెడీ థ్రిల్లర్ తారాగణం : సుధీర్ బాబు, వామిక గబ్బి, ధన్యా సంగీతం : సన్నీ ఎం.ఆర్ దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య నిర్మాత : విజయ్, శశి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చి, చాలా రోజులుగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న నటుడు సుధీర్ బాబు, కమర్షియల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోకపోయినా, డిఫరెంట్ స్టోరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'భలే మంచి రోజు' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఒకే రోజు జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను ఎంత వరకు ఆకట్టుకుంది. ఆడియో రిలీజ్లో మహేష్ బాబు చెప్పినట్టుగా ఈ సినిమాతో సుధీర్ బాబు స్టార్ స్టేటస్ అందుకున్నాడా..? కథ : ప్రేమలో విఫలమైన రామ్ (సుధీర్ బాబు) తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటున్న ప్రియురాలి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరతాడు. అదే సమయంలో ఉండ్రాజవరంలో కాసేపట్లో పెళ్లి పీటలెక్కబోతుందనుకున్న సమయంలో పెళ్లి కొడుకు పారిపోవటంతో సీత(వామిక గబ్బి) పెళ్లి ఆగిపోతుంది. ఆ హడావిడిలో ఉండగానే శక్తి(సాయికుమార్) సీతను కిడ్నాప్ చేసి తీసుకెళతాడు. అలా వెళుతున్న శక్తి వెహికల్‌ను రామ్ గుద్దేస్తాడు. ఈ యాక్సిడెంట్లో శక్తి కిడ్నాప్ చేసిన సీత తప్పించుకునిపారిపోతుంది. దీంతో ఇందుకు కారణమైన రామే, సీతను తీసుకురావాలని రామ్ స్నేహితుడు ఆదిని (ప్రవీణ్) బంధిస్తారు శక్తి మనుషులు. స్నేహితుడిని కాపాడుకోవటం కోసం సీతను తీసుకురావడానికి బయలుదేరుతాడు రామ్, ఈ జర్నీలో ఈశు, ఆల్బర్ట్ అనే కిడ్నాపర్లను కలుస్తాడు. వారితో కలిసి రామ్ ప్రయాణం ఎలా సాగింది. చివరకు రామ్, సీతను పట్టుకున్నాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సక్సెస్ పరంగా ఆకట్టుకోలేక పోయినా, నటుడిగా ప్రతి సినిమాకు మెరుగవుతూ వస్తున్నాడు సుధీర్ బాబు. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో, ఈ సినిమాలో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ లోనూ మెప్పించాడు. చూడటానికి కాస్త బొద్దుగా ఉన్నా, వామిక గబ్బి హీరోయిన్గా మెప్పించింది. ముఖ్యంగా ఎనర్జీ, ఈజ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేకపోయిన మాట్లాడిన రెండు, మూడు సన్నివేశాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కామెడీ విలన్‌గా సాయికుమార్ అలరించాడు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే 30 ఇయర్స్ పృథ్వీ క్యారెక్టర్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ప్రవీణ్, శ్రీరామ్, విద్యుల్లేఖ, పోసాని కృష్ణమురళి, పరుచూరి గోపాలకృష్ణలు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లర్ కన్నా కామెడీ పాల్లే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రొటీన్ కామెడీ సన్నివేశాలు కాకుండా కథానుగుణంగా రాసిన కామెడీ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తాయి. తొలిభాగం విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేసిన దర్శకుడు రెండో భాగం విషయంలో మాత్రం అంత పట్టు చూపించలేకపోయాడు. స్లో నారేషన్తో ఆడియన్స్ సహనాన్ని పరీక్షించాడు. అయితే క్లైమాక్స్ 20 నిమిషాలతో ఆడియన్స్ అప్పటి వరకు పడ్డ కష్టమంతా మరిపోయేలా చేశాడు. సినిమాటోగ్రఫీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. డార్క్ కామెడీగా తెరకెక్కించిన ఈ సినిమాకు అలాంటి లైటింగ్, లోకేషన్స్‌నే వాడటం చాలా బాగా కుదిరింది. సన్నీ ఎంఆర్ మంచి సంగీతం అదించినప్పటికీ పాటలు అవసరం లేని సినిమాలో అనవసరంగా ఇరికించటంతో సినిమాకు ఇబ్బంది కలిగించాయి. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నేపథ్య సంగీతం బాగున్నా అక్కడక్కడా డైలాగ్స్ వినిపించకుండా డామినేట్ చేసింది. విజయ్, శశిల నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సుధీర్ బాబు, వామిక గబ్బి కామెడీ సినిమాటోగ్రఫి క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ సెకండాఫ్ పాటలు ఓవరాల్‌గా భలే మంచి రోజు మంచి కామెడీతో ఆకట్టుకునే డీసెంట్ అటెంప్ట్ -
మహేశ్, ప్రభాస్‌లకు థ్యాంక్స్!
ఇద్దరు స్టార్ హీరోలు ఓ సినిమాను ప్రమోట్ చేస్తే ఇంకేం కావాలి? కావల్సినంత పబ్లిసిటీ. ‘భలే మంచి రోజు’ విషయంలో ఇదే జరిగింది. సుధీర్‌బాబు హీరోగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శశిధర్‌రెడ్డి, విజయ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు, ప్రభాస్ చేసిన ప్రచారం చాలా ఉపయోగపడింది. ఈ విషయం గురించి నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం ఆడియో విడుదలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు మా ట్రైలర్‌ను మెచ్చుకున్నారు. అలాగే ప్రభాస్ అయితే మా సినిమాకు సంబంధించిన విశేషాలు స్వయంగా అడిగి తెలుసుకుని, మా ప్రయత్నాన్ని అభినందించారు. ఈ ఇద్దరూ ఇచ్చిన సపోర్ట్ మా సినిమా మీద అంచనాలను పెంచింది. అందుకే మహేశ్, ప్రభాస్‌లకు చాలా థ్యాంక్స్. ఈ చిత్రం అన్నివర్గాల వారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
ఒక్క రోజులో..!
అప్పటివరకూ ఆడుతూ పాడుతూ హాయిగా సాగిన ఆ కుర్రాడి జీవితం ఒక్క రోజులో ఘాట్రోడ్టులా మలుపులు తిరిగింది. ఆ రోజు ఏం జరిగింది? ఆ మలుపులు అతని ప్రయాణాన్ని ఎంత దాకా తీసుకెళ్లాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘భలే మంచి రోజు’. సుధీర్‌బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ‘‘ఈ సినిమాలో కొత్త సుధీర్‌ను చూస్తారు’’ అని దర్శకుడు అన్నారు. ‘‘డిఫరెంట్ జానర్లో సాగే కామెడీ కథాంశంతో తెరకెక్కించాం’’ అని సుధీర్‌బాబు అన్నారు. ‘ఉత్తమ విలన్’ కెమెరామన్ శ్యామ్‌దత్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.