మనోళ్లకి భలే మంచి వెరైటీ
చిత్రం : 'భలే మంచి రోజు'
తారాగణం : సుధీర్బాబు,వామిక,పోసాని
సంగీతం : సన్నీ'
కెమేరా : శామ్దత్
ఎడిటింగ్ : ఎం.ఆర్.వర్మ
నిర్మాతలు : విజయ్ - శశి
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : టి. శ్రీరామ్ ఆదిత్య
కొత్త రక్తంతో కొత్త ఆలోచనలు, ధోరణులొస్తాయి. అది ఏ రంగంలోనైనా సహజం. సినీరంగం విషయానికే వస్తే - డిజిటల్ ఉపకరణాలు, వేదికలు పెరిగిపోయాక సాంకేతిక నిపుణుడిగా ఎంట్రీ సంపాదించడం కొంత సులభ మైంది. అలా వస్తున్న కొత్త రక్తం కొత్త తరం సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రయత్నం చేస్తోంది. అలా డిజిటల్ మీడియా, లఘు చిత్రాల సాక్షిగా వచ్చిన కొత్త దర్శకుడు - శ్రీరామ్ ఆదిత్య. షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలై ఫీచర్ ఫిల్మ్స్‌కి ఎదిగిన అతని తాజా వెండితెర ప్రయత్నం - ‘భలే మంచి రోజు’.
ఒక సగటు కారు షెడ్ మెకానిక్ దంపతుల (పరుచూరి గోపాలకృష్ణ, ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మి) కొడుకు రామ్ (సుధీర్ బాబు). బెంజ్ కార్లు నడిపే అతణ్ణి చూసి, డబ్బున్నవాడనుకొని మాయ (ధన్యా బాలకృష్ణ) ప్రేమిస్తుంది. తీరా అసలు సంగతి తెలిసి, వేరొక అబ్బాయి (చైతన్య కృష్ణ)తో పెళ్ళికి సిద్ధమవుతుంది. ఆమెను ఏదైనా చేయాలని హీరో బయ ల్దేరి, కిడ్నాపైన ఒక పెళ్ళికూతురిని యాదృచ్ఛికంగా కాపాడతాడు. కానీ, కాబోయే బావ (ప్రవీణ్)ను రౌడీ శక్తి (సాయికుమార్) బారి నుంచి కాపాడడానికి మళ్ళీ తానే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి సిద్ధమవుతాడు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఇతరులూ ప్రయత్నిస్తుంటారు.
ఇంతకీ ఆ అమ్మాయెవరు? ఎందుకు ఇంతమంది కిడ్నాపింగ్‌కు ప్రయత్నిస్తున్నారన్నది ఆసక్తికరమైన రకరకాల పాత్రలతో ఒక్కో ఎపిసోడ్‌గా బయటకొచ్చే మిగతా సినిమా కథ. నటీనటులందరూ యథాశక్తి నటించినా ఇది ప్రధానంగా దర్శకుడి సినిమా. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఒకే రోజులో జరిగే కథ ఇది. గతంలో ఇలాంటి ‘టైమ్’లీ స్క్రిప్టులొచ్చినా, దీన్ని ఎలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారో చూడాలనిపిస్తుంది.
వెరైటీగా అనేక ఫ్లాష్ బ్యాక్‌లతో స్క్రీన్‌ప్లే అల్లుకున్నారు దర్శకుడు. అలాగే, ఒక మెయిన్ ప్లాట్‌కు ఎన్నో సబ్-ప్లాట్లు, ఒక మెయిన్ క్యారెక్టర్ కథలో మరెన్నో ఇతర పాత్రలు తారస పడుతూ వచ్చి, చివరకు వాటన్నిటినీ ఒక తాటి మీదకు తెచ్చారు. అది నిజంగా మంచి పద్ధతే. పాత్రలు - వాటి తాలూకు కథలు - అన్నీ తెలియకుండానే ఒకదానికొకటి ముడిపడి ఉండడం ఇంట్రెస్టింగే. కానీ, కథలో తుపాకీ కనపడిందంటే - అది ఎక్కడో ఒకచోట పేలాల్సిందే అన్న సూత్రాన్ని అతిగా అనుసరించినా కష్టమేనని ఆలస్యంగా, ఆనక చాలా కష్టంగా తెలుస్తుంది.
అందుకోసం కొన్నిచోట్ల రాజీ పడాల్సీ వచ్చింది. అయితే, ఈ చిత్రానికి శామ్‌దత్ కెమేరా వర్క్ మూలస్తంభం. సినిమా మొదలైనప్పుడు వచ్చే ఏరియల్ షాట్స్ మొదలుకొని, ఛేజ్‌లు, యాక్షన్ సన్నివేశాల దాకా చాలావాటిలో శామ్ పనితనం అర్థమైపోతుంటుంది. హీరోకు లక్కీ అయిన ఎల్లో కలర్ స్కీమ్ ను తెలివిగా వాడారు. అయితే, సంగీతం కొంత డ్రాబ్యాక్ అయింది. తెర మీది సన్నివేశాన్నీ, సందర్భాన్నీ మించిపోతూ, సన్నీ చేసిన రీరికార్డింగ్ కొన్ని మాటల్నీ మింగేసింది. కథలోనూ కొన్ని లోపాలు లేకపోలేదు.
సాయికుమార్ పోషించిన శక్తి పాత్ర, ఐశ్వర్య చేసిన అతని భార్య పాత్ర కొంత వల్గారిటీ అనిపిస్తుంది. ఇటీవలి అనేక తెలుగు సినిమాల్లో లానే ఇందులోనూ క్రైస్తవ ఫాదరీలనూ, వారి మాట, ప్రవర్తనల్నీ వినోదానికి వాడుకున్నారు. చర్చి ఫాదర్ పాల్‌గా పోసాని హావభావాలు అలరిస్తాయి. సినిమా ఆఖరులో వచ్చే సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ మల్లెపుష్పం రామారావు పాత్ర హైలైట్. అతని మిమిక్రీ మాస్‌ని కట్టిపడేస్తుంది. వెరసి, కొన్ని లోటుపాట్లున్నా, రొటీన్ స్క్రిప్ట్‌లతో విసిగిపోయిన మల్టీప్లెక్స్ ఆడియన్‌సకు ఇది మంచి వెరైటీ అనుభవం.