టైటిల్: మామా మశ్చీంద్ర
నటీనటులు: సుధీర్ బాబు, ఈషా రెబ్బా, హర్షవర్ధన్, మృణాళిని రవి, అజయ్ తదితరులు
నిర్మాత: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్
డైరెక్టర్: హర్షవర్ధన్
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్, ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: పి.జి. విందా
విడుదల తేదీ: అక్టోబర్ 06
నిడివి: 2h 29m
కథేంటి?
పరశురామ్(సుధీర్ బాబు)కి చాలా స్వార్థం. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపమని తన మనిషి దాసుకి చెప్తాడు. కానీ వాళ్ళు బతికిపోతారు. కట్ చేస్తే పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని రవి).. దుర్గ(సుధీర్ బాబు) డీజే (సుధీర్ బాబు) అనే కుర్రాళ్లతో లవ్ లో పడతారు. వీళ్ళిద్దరూ పరశురామ్ పోలికలతో ఉంటారు. వీళ్లు తన మేనల్లుడ్లే అని పరశురామ్‌కి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు పరశురామ్ ఏం తెలుసుకున్నాడు అనేది స్టోరీ.
ఎలా ఉంది?
సినిమా అంటే ఎవరెన్ని చెప్పినా వినోదం మాత్రమే. రెండు లేదా మూడు గంటలా అనేది ఇక్కడ మేటర్ కాదు. నవ్వించవా, థ్రిల్ చేశావా? ఇలాంటి అంశాలు మాత్రమే ఆడియెన్స్ చూస్తారు. ఈ విషయంలో మామ మశ్చీంద్ర పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే కామెడీ, థ్రిల్, డ్రామా.. ఇలా ఏ పార్ట్ లోనూ కనీసం అలరించ లేకపోయింది. ట్విస్టులు ఎక్కువ ఉంటే ప్రేక్షకులు థ్రిల్ అవుతారని డైరెక్టర్ అనుకున్నాడు. అవి రెండున్నర గంటలు బుర్ర గొక్కునేల చేశాయి!
ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. జాలి దయలేని తండ్రి వల్ల చిన్నప్పుడే పరశురామ్ తల్లి చనిపోవడం... తల్లికి దక్కాల్సిన ఆస్తిని మేనమామ లాగేసుకోవడం.. ఆ తర్వాత పక్క ప్లాన్ తో మేనమామకు కూతురు వరసైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అస్తినంతా దక్కించుకోవడం.. ఇక వయసు పెరిగిన తర్వాత పరశురామ్.. అతడు కూతురు విశాలాక్షీ.. పరశురామ్ దగ్గర పనిచేసే దాసు.. అతడు కూతురు మీనాక్షి.. వీళ్ళ లైఫ్ లోకి దుర్గ, డీజే అనే వ్యక్తులు రావడం.. అల ఈ పాత్రల మధ్య ఎలాంటి డ్రామా నడిచింది చివరకి ఏమైంది అనేదే తెలియాలంటే సినిమా చూడాలి..
స్టోరీ పరంగా స్వార్థం అనే మంచి పాయింట్ తీసుకున్నారు కానీ దాన్ని చెప్పడంలో ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో చూసే ప్రేక్షకుడికి కూడా అది ఎక్కలేదు. హీరో సుదీర్ బాబు.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రలు చేశాడు. డీజేగా రెగ్యులర్ లుక్ లో కనిపించాడు. ఇది ఓకే. కానీ మిగతా రెండు పాత్రలు డిజైన్ అస్సలు సెట్ కాలేదు. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ తో చాలా చిరాకు పెట్టించారు. పబ్ లో వచ్చే ఆర్జీవీ ఎపిసోడ్ అయితే అనవసరం. ఇక సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చుట్టేశారు. క్వాలిటీ విషయం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే.. క్లైమాక్స్ లో మనిషిలో స్వార్థం గురించి చెప్పే సీన్ మాత్రమే.
ఎవరెలా చేశారు?
మూడు పాత్రల్లో ఏదో ప్రయోగం చేద్దామని హీరో సుధీర్ బాబు ప్రయత్నించాడు గానీ అది అడ్డంగా బెడిసికొట్టింది. పరశురామ్ కారెక్టర్ ని అయిన మంచిగా రాసుకుని సినిమా తీసుంటే బాగుండేది. ఇక హీరోయిన్స్ గ చేసిన ఈషా రెబ్బ, మృణాళిని రవి ఓకే ఓకే. ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ హర్షవర్ధన్ ఇందులో దాసు పాత్ర చేశాడు అది పర్లేదు. మిగతా కారెక్టర్స్ చేసిన వాళ్ళు మామ అనిపించారు. అజయ్, హరితేజ, రాజీవ్ కనకాల లాంటి వాళ్లని సరిగా వాడుకొలేకపోయారు.
టెక్నికల్ విషయాల్లో ఈ సినిమాలోని పాటలు పెద్దగా గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు చాలా పూర్. రైటింగ్ కూడా అస్సలు ఎఫెక్టివ్‌గా లేదు. ఓవరాల్‌గా థియేటర్స్‌లో మామ మశ్చీంద నిలబడటం అంటే చాలా కష్టం.
- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment