కూరలు చేయ పువ్వు తెచ్చాను
పెరటిలోన అరటంట...ఫలములెన్నో ఇచ్చునంట...పండు అరటి..కూర అరటి....మరి పువ్వు?దానితో కూడా కూర చేయవచ్చునట...పోపు వేసి రుచి చూడవచ్చునట...పువ్వు ఒకటేనట.... పదార్థం పదునారు రకాలట.పూజలు చేయడానికి తెచ్చే పూలు వేరు. కూరలు చేయడానికి ఈ పువ్వు తెండి. సుష్టుగా తినండి.
అరటి పువ్వు– పెసర పప్పు కూర
కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); పెసర పప్పు – పావు కప్పు (రెండు గంటలు నానబెట్టాలి); పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మెంతులు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 3; అల్లం – చిన్న ముక్క (సన్నగా తరగాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; మిరప కారం – పావు టీ స్పూను; నూనె – 5 టీ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా.
తయారీ: ∙అరటి పువ్వును ముందుగా శుభ్రం చేసుకోవాలి ∙పైన ఉన్న డిప్పలు తీసి, లోపల ఉన్న వాటిలో నుంచి మద్యభాగంలో ఉండే కేసరం తీసేయాలి ∙శుభ్రం చేసిన అరటిపువ్వును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసుకోవాలి ∙ఒక గిన్నెలో నీళ్లు, తగినంత పసుపు వేసి బాగా కలిపి, కచ్చాపచ్చాగా చేసుకున్న అరటిపువ్వును అందులో వేసి రెండుమూడు సార్లు బాగా కడగాలి ∙ఒక గిన్నెలో అరటి పువ్వుకు తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి కొద్దిసేపు ఉడికించి, చల్లారాక, గట్టిగా పిండి నీళ్లు తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి బాగా వేయించాక పసుపు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి ∙కరివేపాకు, ఇంగువ జత చేసి మరోమారు కలపాలి ∙అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాక, ఉడికించిన అరటి పువ్వు మిశ్రమం, నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలిపి, చివరగా కొద్దిగా ఉప్పు వేసి కలిపి, మరో ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి.
అరటి పువ్వు పికిల్
కావలసినవి: అరటి పువ్వు – 1; ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 10; వెల్లుల్లి – 6 రెబ్బలు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు.
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె కాగాక ఎండు మిర్చి వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు వేయించి, దింపేసి చల్లారనివ్వాలి ∙వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఎండు మిర్చి, వేయించిన ధనియాల మిశ్రమం వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక అరటి పువ్వు వేసి పచ్చి వాసన పోయేవరకు సుమారు పది నిమిషాలు వేయించాలి ∙పసుపు జత చేసి మరోమారు కలిపి, ఎండు మిర్చి మిశ్రమంలో వేసి, తగినంత ఉప్పు జత చేయాలి ∙ఉడికించి ఉంచుకున్న చింతపండు రసం కూడా వేసి బాగా కలిపి, మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, సెనగ పప్పు, మినప్పప్పు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న అరటిపువ్వు మిశ్రమం వేసి పచ్చి వాసన పోయేవరకు బాగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి.
అరటిపువ్వు – పులిహోర కూర
కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); పచ్చి మిర్చి – 3; సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – నాలుగు రెమ్మలు; ఎండు మిర్చి – 2; పసుపు – అర టీ స్పూను; చింతపండు పులుసు – అర కప్పు; ఉప్పు – తగినంత; పోపు సామాను – ఒక టేబుల్ స్పూను; ఆవ పొడి – ఒక టీ స్పూను;
తయారీ: ∙అరటి పువ్వును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసి బయటకు తీసి, పసుపు నీళ్లతో రెండు మూడు సార్లు కడగాలి (ఇలా చేయడం వల్ల వగరు పోతుంది) ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, పచ్చి మిర్చి తరుగు, సెనగ పప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙పసుపు, చింతపండు పులుసు, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙కచ్చాపచ్చాగా చేసిన అరటి పువ్వు జత చేసి బాగా కలిపి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ∙ఆవ పొడి జత చేసి బాగా కలిపి దింపేసి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి.
అరటి పువ్వు వడ
కావలసినవి: అరటి పువ్వు – 1; పసుపు – ఒక టేబుల్ స్పూను; పెరుగు – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; సోంపు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4; సెనగ పప్పు – ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర – ఒక కప్పు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ :అరటి పువ్వును శుభ్రం చేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ∙ఒక గిన్నెలో అరటి పువ్వు తరుగు, తగినన్ని నీళ్లు, కొద్దిగా పసుపు, రెండు టీ స్పూన్ల పెరుగు జత చేసి మూత పెట్టి సుమారు మూడు గంటలసేపు పక్కన ఉంచాలి ∙ఒక గిన్నెలో సెనగ పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి గంట సేపు నాన»ñ ట్టి, నీళ్లు ఒంపేయాలి ∙మిక్సీలో... సెనగ పప్పు, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి మెత్తగా చేసి, గిన్నెలోకి తీసుకోవాలి ∙తగినంత ఉప్పు జత చేసి కలియబెట్టాలి ∙అరటి పువ్వుకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙చల్లారాక నీళ్లు గట్టిగా పిండి తీసేయాలి.∙∙ఒక గిన్నెలో ఉడికించిన అరటి పువ్వును వేసి చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి ∙మెత్తగా చేసుకున్న సెనగ పప్పు మిశ్రమం, ఉల్లి తరుగు, కొత్తిమీర జత చేసి అన్నీ కలిసేవరకు కలపాలి ∙ కొద్దికొద్దిగా మిశ్రమం చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒత్తి ఉంచుకున్న వడలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙వేడివేడిగా అందించాలి.
అరటి పువ్వు కొబ్బరి పచ్చడి
కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); కొబ్బరి తురుము – ఒక కప్పు; పచ్చి మిర్చి – 4; ఎండు మిర్చి – 10; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో; తాలింపు – ఒక టే బుల్ స్పూను.
తయారీ: ముందుగా అరటి పువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసి పసుపు కలిపిన చన్నీళ్లతో మూడునాలుగు సార్లు బాగా కడగాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇంగువ, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి చల్లారనివ్వాలి ∙ వేయించిన పోపును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙ అరటి పువ్వు వేసి మరోమారు తిప్పాలి ∙కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి ∙వేయించిన తాలింపు గింజలు జత చేసి కలిపి, వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.
అరటి పువ్వు పులుసు కూర
కావలసినవి: అరటి పువ్వు – ఒక కప్పు; ఆవ పొడి – ఒక టీ స్పూను; నువ్వుల పొడి – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో ముక్కలు – అర కప్పు; చింతపండు – తగినంత; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (సన్నగా పొడవుగా తరగాలి); ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); మిరప కారం – తగినంత; వెల్లుల్లి రెబ్బలు – 4; నూనె – 4 టేబుల్ స్పూన్లు; పోపు దినుసులు – ఒక టీ స్పూను; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత;
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి వేయించాలి ∙ఎండు మిర్చి వేసి వేగాక, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు జత చేసి మరోమారు వేయించాలి ∙టొమాటో ముక్కలు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాక, తగినంత ఉప్పు జత చేసి కలపాలి ∙పసుపు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన అరటి పువ్వును జత చేయాలి ∙మిరపకారం వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి ఐదు నిమిషాలు ఉడికించాలి ∙చింతపండు రసం వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి ∙ఆవ పొడి వేసి కలియబెట్టాలి ∙తగినంత నువ్వుల పొడి వేసి మరోమారు కలపాలి ∙కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి ∙ఈ కూర చూడటానికి గ్రేవీ మాదిరిగా వస్తుంది.
అరటి పువ్వు కందిపప్పు కూర
కావలసినవి: అరటి పువ్వు – 1; కంది పప్పు – ఒక కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 3; వెల్లుల్లి రెబ్బలు – 5; జీలకర్ర – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ: ∙కంది పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లోఉంచి ఉడికించాలి (మరీ ముద్దగా చేయకూడదు) ∙అరటి పువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి, కచ్చాపచ్చాగా చేసి, పసుపు నీళ్లలో రెండు మూడుసార్లు కడిగి, గట్టిగా పిండి నీరు తీసేయాలి ∙ఉడికిన పప్పులో వేసి బాగా కలపాలి ∙తగినంత ఉప్పు, పసుపు జత చేసి కలపాలి ∙మిరప కారం జత చేసి మరోమారు కలిపి, తడిపోయే వరకు ఉడికించాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ∙జీలకర్ర, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙ఎండు మిర్చి జత చేసి కలిపి, ఉడికించిన కందిపప్పు అరటి పువ్వు కూరలో వేసి కలిపి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి.
కదంబం
శాకంభరీ పూజల సందర్భంగా అమ్మవారికి నివేదన చేసే ‘కదంబం’
కావలసినవి: బియ్యం – 1 కప్పు; కంది పప్పు – ఒక కప్పు; చింతపండు రసం – 1 టేబుల్ స్పూను; బెండకాయలు – 4; క్యారట్ – 1; చిలగడ దుంప – 1; బంగాళదుంప – 1; వంకాయలు – 2; క్యాప్సికమ్ – 1; బఠాణీ – పావు కప్పు; తీపి గుమ్మడి కాయ ముక్క – చిన్నది; చిక్కుడుకాయ ముక్కలు – పావు కప్పు; సాంబారు పొడి – 1 టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – 1 టీ స్పూను; కొత్తిమీర – చిన్న కట్ట; కరివేపాకు రెమ్మలు – 2
తయారీ: కూరగాయలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి, తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙కందిపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా ఉడికించాలి ∙బియ్యం శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి ∙ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసి మరోమారు వేయించాలి ∙సాంబారు పొడి, ఉప్పు, చింతపండు రసం వేసి బాగా కలిపాక, ఉడికించి ఉంచుకున్న కందిపప్పు, కొద్దిగా నీళ్లు వేసి మరోమారు కలపాలి ∙కొద్దిగా ఉyì కిన తరవాత అన్నం, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి.
కదళీ కుసుమం కాంతివర్ధకం
భారతీయ సనాతన ఆచారాలలోనూ, తెలుగు సంస్కృత కవీశ్వరుల కలాలలోనూ, ప్రాచీన ఆయుర్వేద వైద్యశాస్త్ర ఔషధ కోశాగారంలోనూ... ఈ మూడు చోట్లా ఆశ్రయం పొంది మిసమిసలాడిన ముద్దుగుమ్మ మన ‘రంభ’. అదే జగద్విదితమైన అరటికి మరోపేరు.
పర్యాయ పదాలు...
కదళీ (రీ), సుఫలా, మోచా, వారణ, వనలక్ష్మీ, ఊరుస్తంభా గుచ్ఛఫలా, సత్పత్రీ మొదలైనవి.హైందవ శుభకార్యాల పందిళ్లలో కనిపించేది అర టిచెట్టు, ఆహారం వడ్డించే విస్తరాకు అరటి ఆకు, ఆకులోని అమోఘమైన ఫలం అరటిపండు, నదీ జలాలలో తళతళలాడే కార్తీక దీపాలను నిలబెట్టేది అరటికాండపు ముక్క. మృదుమధురంగా సునాయాసంగా అర్థమయ్యే కవితారసాన్ని కదళీపాకం అంటారు.
కవులు తమ వర్ణనలలో, కోమలత్వాన్ని సూచించే ఉపమాన ద్రవ్యం కదళీకాండం. ఆయుర్వేదంలో అరటి యొక్క పంచాంగాలనూ (ఫలం, పత్రం, పుష్పం, మూలం, కాండం) రకరకాల వ్యాధులలో ఔషధ ద్రవ్యంగా ప్రయోగిస్తారు.అరటికాయకి తియ్యదనంతో పాటు కొంచెం వగరు కూడా ఉంటుంది. చలవ చేస్తుంది. మల బంధకం. పరిపూర్ణంగా పక్వమైతే (పండు) దానికి తియ్యదనం పెరిగి వగరు తగ్గుతుంది. బక్కచిక్కిన వారికి బరువు పెరగడానికి ఉపయోగకరం. అరుచిని పోగొడుతుంది. ప్రమేహాన్ని కూడా పోగొడుతుంది. శీతలం, శుక్రకరం. ఆకలిదప్పికలను తగ్గిస్తుంది.
అరటి పువ్వు:ఇది అరటికాయ గెలలకు క్రింది భాగంలో చాలా సుందరంగా వ్రేలాడుతుంటుంది. పైన కనపడే ఎరుపునలుపుల వెడల్పైన రేకలను తొలగిస్తుంటే లోపల అగ్గిపుల్లల మాదిరి కనబడే పువ్వుల గుత్తులు కనబడతాయి. ప్రతి నాళిక పైన స్వచ్ఛమైన ఉల్లిపొరలాంటిది ఉంటుంది. దాన్ని తొలగిస్తే తినదగిన పుష్పనాళికల మధ్య ఒక ముదురు కేసరం కనిపిస్తుంది. ఇది తినడానికి పనికిరాదు. తినదగిన ఈ పువ్వులు వాతావరణానికి సోకితే క్రమేపీ నల్లబడిపోతాయి. నీటిలో నానబెట్టి ఉంచితే నల్లబడదు.
పువ్వులోని పోషక విలువలు – ఆరోగ్య ప్రయోజనాలు:
పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉంటుంది. నీటిలో కరిగిపోయే పీచు, కరగని పీచు ఈ రెండూ ఉంటాయి. కరగని పీచువల్ల రోజువారీ విరేచనం సాఫీగా అవుతుంది. కరిగే పీచు వల్ల అతిసారం (అధిక విరేచనాలు) తగ్గుతాయి. కనుక ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కి మంచి గుణకారి. అధిక బరువుని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫినాలిక్ ఆమ్లం, ఇతర రసాయనాల వల్ల మధుమేహాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. పిండి పదార్థాలు తగుమాత్రం ఉన్నా ‘శర్కర శాతం, సోడియం, కొలెస్టరాలు’ శూన్యం. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కనుక అధిక రక్తపోటుని తగ్గించి, కండరాలకు శక్తినిస్తుంది. ఐరన్, కాపర్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. రక్తహీనతను పోగొడుతుంది.‘మెగ్నీషియం, ప్రొటీన్లు తగినంత లభిస్తాయి. ఆందోళన, నరాల వ్యాధులను తగ్గిస్తాయి. అల్జీమర్సు, పార్కిన్సోనియం వంటి వ్యాధులలో గుణకారిగా చెప్పవచ్చు.ఎ, సి, ఇ విటమిన్లు దండిగా ఉంటాయి. చర్మకాంతికి మంచిది. స్త్రీలలో అధిక ఋతుస్రావాన్ని అరికడుతుంది. కంటి రోగాలకు మంచిది.
దీనిలో లభించే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల క్రిమిహర ంగాను, అకాల వార్ధక్యాన్ని తగ్గించేదిగాను ఉపకరిస్తుంది. క్యాన్సరు రోగులకు కూడా మంచిది.ప్రసూతులలో తల్లిపాలను సమృద్ధిగా కలిగేట్టు చేస్తుంది.
అరటిపువ్వు అంతా బలమే (ఆయుర్వేదం)ప్రాచీన ఆయుర్వేద వైద్య పుంగవులైన చరక సుశ్రుత వాగ్భటులందరూ అరటి ద్రవ్యాలను రకరకాలైన వ్యాధులను నయం చేయటానికి ప్రయోగించారు. ఇతర ఆయుర్వేద వైద్య గ్రంధాలలో కూడా దీని ఔషధ విలువలు ఉటంకించబడ్డాయి.రాజ నరహరి నామధేయుడైన నృసింహ పండితుడు రాజ నిఘంటువు గ్రంధ రచయిత. అందులోని శ్లోకం...రంభాఫలం కషాయ మధురం బల్యంచ శీతం తథా‘పిత్తం అస్రవిమర్దనం గురుతరం పథ్యం న మందానవే‘‘సత్యః శుక్రవివృద్ధిదం క్లమహరం తృష్ణాపహరం కాంతి దం‘దీప్తాగ్నౌ సుస్వదం కషాయకరం సంతర్పణం దుర్జరం‘‘బాలం ఫలం మధురం... పుష్పం తదపి అనుగుణం,క్రిమిహారి, కందం పర్ణంచ శూలశమకం కదలీ భవం స్యాత్
గమనిక: పైన చెప్పిన ఆధునిక శాస్త్రజ్ఞులు వివరించిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ ఈ శ్లోకంలో నిక్షిప్తమై ఉన్నాయి.
ఉదా: దుర్జరం : వార్ధక్యాన్ని నిలుపుతుంది
సద్యః క్లమహరం: తక్షణ శక్తినిస్తుంది.
సంతర్పణం : కృశత్వాన్ని పోగొట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్రిమిహారి: యాంటిసెప్టిక్ మరియు యాంటీ బయోటిక్ఉబ్బసానికి కూడా మంచిది.
ఎలా తినాలి?పువ్వు రేకల్ని నీళ్లల్లో నానబెట్టిన అనంతరం, ఇతర సలాడ్స్‌తో కలిపి పచ్చివి తినవచ్చు లేదా సూప్‌గా తయారుచేసుకోవచ్చు. పువ్వు పచ్చడి: శుభ్రపరచిన పువ్వుని చిన్న ముక్కలుగా తరిగి, కొంచెం ఆవాలు, నువ్వులపప్పు, మిరపకాయలు ముద్దగా చేసి, ఈ రెంటినీ కలపాలి. ఆ మిశ్రమానికి తగినంత ఉప్పు, చింతపండు/నిమ్మరసం జత చేసి, ఇంగువ పోపు పెట్టాలి. తినేటప్పుడు చిక్కటి పెరుగుని కూడా కలుపుకుని, అన్నంలోను, రొట్టెలలోను కూడా తినవచ్చు. మంచి వ్యంజనం.గుర్తుంచుకోవలసిన సారాంశంఇతర కుసుమ సౌరభములు ఎదకు హితముఅన్ని వ్యాధులు తగ్గించు అరటి పువ్వుసకల శక్తులు బలపర్చి శాంతిజేయురంభ శక్తిని గుర్తించి ప్రజ్వరిల్లు!
మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్.
mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి.
మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ,
సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,
హైదరాబాద్–34.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు