అరటి కాయ, అరటి దూట, అరటి పువ్వు, అరటి పండు, అరటి ఆకు.. ఈ చెట్టంతా ఆహారానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు అందరి పెరట్లో ఉండే చెట్టు అరటి... ఇరుగుపొరుగుల మధ్య స్నేహం పెంచిన చెట్టు.. ఇంటి గుట్టును కాపాడిన చెట్టు.. ఆకలి లేకుండా చేసిన కల్ప వృక్షం.. పెరట్లో మొక్కే కదా అనుకోకూడదు.. అరటి పువ్వును ఇన్ని రకాలుగా వండి చూడండి.. వెంటనే ఇంట్లో ఒక అరటి చెట్టు నాటేసుకుందాం అనుకుంటారు...
అరటి పువ్వు కొబ్బరి పచ్చడి
కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); కొబ్బరి తురుము – ఒక కప్పు; పచ్చి మిర్చి – 4; ఎండు మిర్చి – 10; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో; తాలింపు – ఒక టే బుల్ స్పూను.
తయారీ: ∙ ముందుగా అరటి పువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసి పసుపు కలిపిన చన్నీళ్లతో మూడునాలుగు సార్లు బాగా కడగాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇంగువ, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి చల్లారనివ్వాలి ∙ వేయించిన పోపును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙ అరటి పువ్వు వేసి మరోమారు తిప్పాలి ∙కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి ∙వేయించిన తాలింపు గింజలు జత చేసి కలిపి, వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.
అరటి పువ్వు పికిల్
కావలసినవి: అరటి పువ్వు – 1; ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 10; వెల్లుల్లి – 6 రెబ్బలు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు.
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె కాగాక ఎండు మిర్చి వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు వేయించి, దింపేసి చల్లారనివ్వాలి ∙వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఎండు మిర్చి, వేయించిన ధనియాల మిశ్రమం వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక అరటి పువ్వు వేసి పచ్చి వాసన పోయేవరకు సుమారు పది నిమిషాలు వేయించాలి ∙పసుపు జత చేసి మరోమారు కలిపి, ఎండు మిర్చి మిశ్రమంలో వేసి, తగినంత ఉప్పు జత చేయాలి ∙ఉడికించి ఉంచుకున్న చింతపండు రసం కూడా వేసి బాగా కలిపి, మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, సెనగ పప్పు, మినప్పప్పు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న అరటిపువ్వు మిశ్రమం వేసి పచ్చి వాసన పోయేవరకు బాగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి.
అరటి పువ్వు వడ
కావలసినవి: అరటి పువ్వు – 1; పసుపు – ఒక టేబుల్ స్పూను; పెరుగు – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; సోంపు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4; సెనగ పప్పు – ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర – ఒక కప్పు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙అరటి పువ్వును శుభ్రం చేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ∙ఒక గిన్నెలో అరటి పువ్వు తరుగు, తగినన్ని నీళ్లు, కొద్దిగా పసుపు, రెండు టీ స్పూన్ల పెరుగు జత చేసి మూత పెట్టి సుమారు మూడు గంటలసేపు పక్కన ఉంచాలి ∙ఒక గిన్నెలో సెనగ పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి గంట సేపు నాన»ñ ట్టి, నీళ్లు ఒంపేయాలి lమిక్సీలో... సెనగ పప్పు, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి మెత్తగా చేసి, గిన్నెలోకి తీసుకోవాలి ∙తగినంత ఉప్పు జత చేసి కలియబెట్టాలి ∙అరటి పువ్వుకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙చల్లారాక నీళ్లు గట్టిగా పిండి తీసేయాలి.∙∙ఒక గిన్నెలో ఉడికించిన అరటి పువ్వును వేసి చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి ∙మెత్తగా చేసుకున్న సెనగ పప్పు మిశ్రమం, ఉల్లి తరుగు, కొత్తిమీర జత చేసి అన్నీ కలిసేవరకు కలపాలి ∙ కొద్దికొద్దిగా మిశ్రమం చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒత్తి ఉంచుకున్న వడలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్‌కిన్ మీదకు తీసుకోవాలి ∙వేడివేడిగా అందించాలి.
అరటిపువ్వు పులిహోర కూర
కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); పచ్చి మిర్చి – 3; సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – నాలుగు రెమ్మలు; ఎండు మిర్చి – 2; పసుపు – అర టీ స్పూను; చింతపండు పులుసు – అర కప్పు; ఉప్పు – తగినంత; పోపు సామాను – ఒక టేబుల్ స్పూను; ఆవ పొడి – ఒక టీ స్పూను;
తయారీ: ∙అరటి పువ్వును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసి బయటకు తీసి, పసుపు నీళ్లతో రెండు మూడు సార్లు కడగాలి (ఇలా చేయడం వల్ల వగరు పోతుంది) ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, పచ్చి మిర్చి తరుగు, సెనగ పప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙పసుపు, చింతపండు పులుసు, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙కచ్చాపచ్చాగా చేసిన అరటి పువ్వు జత చేసి బాగా కలిపి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ∙ఆవ పొడి జత చేసి బాగా కలిపి దింపేసి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి.
అరటి పువ్వు పులుసు కూర
కావలసినవి: అరటి పువ్వు – ఒక కప్పు; ఆవ పొడి – ఒక టీ స్పూను; నువ్వుల పొడి – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో ముక్కలు – అర కప్పు; చింతపండు – తగినంత; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (సన్నగా పొడవుగా తరగాలి); ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); మిరప కారం – తగినంత; వెల్లుల్లి రెబ్బలు – 4; నూనె – 4 టేబుల్ స్పూన్లు; పోపు దినుసులు – ఒక టీ స్పూను; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత;
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి వేయించాలి ∙ఎండు మిర్చి వేసి వేగాక, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు జత చేసి మరోమారు వేయించాలి ∙టొమాటో ముక్కలు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాక, తగినంత ఉప్పు జత చేసి కలపాలి ∙పసుపు జత చేసి మరోమారు కలియబెట్టాలి lకచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన అరటి పువ్వును జత చేయాలి ∙మిరపకారం వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి ఐదు నిమిషాలు ఉడికించాలి ∙చింతపండు రసం వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి ∙ఆవ పొడి వేసి కలియబెట్టాలి ∙తగినంత నువ్వుల పొడి వేసి మరోమారు కలపాలి lకొత్తిమీర వేసి కలిపి దింపేయాలి ∙ఈ కూర చూడటానికి గ్రేవీ మాదిరిగా వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment