విజయానికి గుర్తు
తొలి చిత్రం ‘బందూక్’తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న బందూక్ లక్ష్మణ్ తాజాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గులాల్’. సమన్వి క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ కొణతం నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘గులాల్ అంటే కేవలం ఒక రంగు మాత్రమే కాదు. విజయానికి గుర్తు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేసి, ఆయన ఆలోచనలకు ప్రతిరూపంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. ‘1956లో జరిగిన ఒక ఒప్పందం చారిత్రాత్మక తప్పైతే.. 2014లో జరిగిన ఒక ఒప్పందం చారిత్రాత్మకమయింది’ అనే విషయాలను చర్చిస్తున్నాం. తెలంగాణలో వాడుకలో ఉండీ లిపిలేని 18 తెలంగాణ భాషల రైతుల జీవితానికి కేసీఆర్‌గారు ఇస్తున్న భరోసాని ఉద్దేశిస్తూ ఈ చిత్రం కోసం గోరెటి వెంకన్నగారు రాసిన పాటను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, స్క్రీన్‌ప్లే సహకారం: హుస్సేన్ షా కిరణ్, కెమెరా: రాహుల్ మాచినేని, లైన్ ప్రొడ్యూసర్: రమేష్ మాదాసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయి.