నా పాత్రలన్నీ నా మనసుకు దగ్గరైనవే..
కాలంతో పాటు సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళాపురోవృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్న కాలం ఇది. మూఢ నమ్మకాలను, బూర్జువాభావాలను కట్ట కట్టి అటకెక్కించి పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారన్నది సంతోషకరమైన పరిణామం. ఇక సినిమా రంగంలోనూ యువ కథానాయికల రాక ఇంతకు ముందు కంటే అధికమమైందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకూ గ్లామర్‌కే పరిమితమైన చాలా మంది నటీమణులు ఇప్పుడు నటనపై దృష్టి సారించే ప్రయత్నం చేయడం ఆహ్వానించదగ్గ విషయం.
మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవలే కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన బహుభాషా నటి పార్వతి స్పందనను చూద్దాం. తమిళంలో పూ చిత్రం ద్వారా పరిచయం అయిన నటి పార్వతి. తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసుల్ని తట్టిందీమె. ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా తొందరపడి ఒప్పుకోకుండా తనకు నచ్చిన పాత్రలనే అంగీకరిస్తూ నటిగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
మలయాళంలో ఎన్ను నింటే మోయిదీన్, చార్లీ చిత్రాలలో తన ఉత్తమ నటనకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఒక నటిగా తన మనోభావాలను ఆమె మాటల్లోనే చూద్దాం.ఎన్ను నింటే మోయిదీన్ చిత్రంలోని కాంచనమాల , చార్లీ చిత్రంలోని ట్రెసా పాత్రలు ఒకదానికొకటి భిన్నమైనవి. అయినా ఆ రెండు పాత్రలు నా నిజ జీవితానికి పోలికలున్నవే. నేను ఇప్పటి వరకూ 17 చిత్రాలు చేశాను.
అందులోని నా పాత్రలన్నీ నా మనసుకు దగ్గరైనవే. అంతే కాదు ఆయా పాత్రలు నాలోని మానవతావాదాన్ని పెంపొందించాయనే చెప్పాలి. నేను అవార్డులు, విజయాల కంటే నన్ను వెతుక్కుంటూ వచ్చే పాత్రల్లో నటనకు ఎంత అవకాశం ఉందనే అంశం గురించే ఎక్కువగా ఆలోచిస్తాను అంటున్న పార్వతి ఇటీవల మలయాళంలో నటించిన బెంగళూర్ డేస్ చిత్రంలోని పాత్రనే దాని తమిళ రీమేక్‌లోనూ నటించారు. ఇందులోనూ ఒక వికలాంగురాలిగా ఇతర మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్రను పోషించారన్నది గమనార్హం.