శ్రీకాళహస్తి-నడికుడి మార్గంతో..పారిశ్రామికాభివృద్ధి వీచిక !
రాజధానిపై నియమించిన డాక్టర్ శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పిన వైనం
{పధానమైన రైలుమార్గానికి అత్తెసరు నిధులే కేటాయిస్తున్నారంటూ ఆక్షేపణ
బెంగళూరు-కడప రైలుమార్గంతో దక్షిణాంధ్ర ప్రగతికి నాంది అన్న కమిటీ
తిరుపతి విమానాశ్రయం అభివృద్ధికి రూ.1200 కోట్లు అవసరమని నివేదన
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం వెన్నెముకగా నిలుస్తుందని రాజధానిపై నియమించిన డాక్టర్ శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పింది. అత్యంత కీలకమైన ఆ రైలుమార్గానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడాన్ని ఆక్షేపించింది. రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రగతికి బెంగళూరు-కడప రైలుమార్గం నాంది పలుకుతుందని అభిప్రాయపడింది. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించడానికి కనీసం రూ.1200 కోట్ల వ్యయం చేయాలని అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి సమర్పించిన నివేదికలో శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. ఆ కమిటీ చేసిన సూచనలను అమలుచేస్తే జిల్లా సమగ్రాభివృద్ధి సుసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని ఎంపికపై డాక్టర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్రం నియమించిన విషయం విదితమే. ఆ కమిటీ జూలై 9న తిరుపతిలో పర్యటించి.. ప్రజల అభిప్రాయాలు స్వీకరించింది. ఈ-మెయిల్స్, లేఖలు, వినతిపత్రాల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించింది. గత నెల 30న కేంద్రానికి కమిటీ నివేదిక అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజధానిపై వచ్చిన 4,728 విజ్ఞప్తుల్లో తిరుపతిని రాజధానిగా చేయాలని కోరుతూ 113 మంది వినతిపత్రాలు సమర్పించినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించాలంటే విశాఖపట్నం, గుంటూరు-విజయవాడతో పాటు తిరుపతిని కూడా మెగా సిటీగా అభివృద్ధి చేయాలని సూచించింది. 2051 నాటికి తిరుపతి జనాభా 14 లక్షలకు చేరుకుంటుంది.. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెగా సిటీగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడింది. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి పారిశ్రామికాభివృద్ధి ఒక్కటే శరణ్యమని విశ్లేషించింది.
తెరపైకి శ్రీకాళహస్తి స్పైన్..
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే రైలుమార్గాలు అత్యంత ఆవశ్యకమని తేల్చింది. తరచుగా వచ్చే తుఫాన్లు, సముద్ర అలల తాకిడి వంటి ప్రతికూల పరిస్థితులు విశాఖ-చెన్నై రహదారిలో రవాణాకు అడ్డంకిగా మారుతాయని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. పైగా ఆ మార్గంలో రవాణా ఖర్చులు సైతం అధికంగా ఉంటాయని అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి స్పైన్ను తెరపైకి తెచ్చింది. శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం నిర్మిస్తే.. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడింది. ఆ రైలు మార్గాన్ని కృష్ణపట్నం, దుగరాజపట్నం ఓడరేవులతో అనుసంధానం చేస్తే.. నవ్యాంధ్ర పారిశ్రామికాభివృద్ధికి చుక్కానిలా నిలుస్తుందని విశ్లేషించింది. శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకూ 308 కిమీల మేర రైలు మార్గం నిర్మాణానికి రూ.1500 కోట్లు అవసరమని తేల్చింది.
అత్యంత ప్రధానమైన ఆ రైలుమార్గానికి ఇప్పటిదాకా రూ.1.76 కోట్లే ఖర్చు చేశారని వివరించింది. 2013-14 బడ్జెట్లో రూ.కోటి.. 2014-15 బడ్జెట్లో రూ.ఐదు కోట్లను మాత్రమే శ్రీకాళహస్తి-నడికుడి మార్గానికి కేటాయించారని.. నిధుల కేటాయింపులో అలసత్వం పారిశ్రామికాభివృద్ధిపై పెను ప్రభావం చూపుతుందని తెలిపింది.
రవాణ సౌకర్యాలే అడ్డంకి..
సీమ పారిశ్రామికాభివృద్ధికి రవాణా మార్గాలు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా కమిటీ పేర్కొంది. కడప-మదనపల్లె-బెంగళూరు రైలుమార్గం పూర్తయితే సీమ పారిశ్రామికాభివృద్ధి సుసాధ్యమయ్యే అవకాశం ఉందని తెలిపింది. 225 కి.మీల పొడవున నిర్మించే ఈ రైలుమార్గం అంచనా వ్యయం రూ.2,250 కోట్లని పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.80 కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఆ రైలుమార్గాన్ని వేగంగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.
జాతీయ రహదారులు, రైలుమార్గాలతోపాటు వాయుమార్గాల(ఎయిర్ కనెక్టివిటి)ను కూడా అభివృద్ధి చేయాలని పేర్కొంది. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అభివృద్ధి చేయాలని సూచించింది. ఇందుకు రూ.1200 కోట్ల మేర వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైలు మార్గాలను పూర్తిచేసి.. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తే దక్షిణాంధ్ర(రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం) పారిశ్రామికాభివృద్ధి సాధించడం ఖాయమని పేర్కొంది. శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తే జిల్లా అభివృద్ధికి తిరుగుండదని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు.