Bank managers
-
మోసాల్లో బ్యాం‘కింగ్స్’!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును రుణాల రూపంలో ఆర్థిక నేరగాళ్లకు దోచిపెట్టడంలో కొందరు బ్యాంకు అధికారుల వ్యవహారం సంచలనం రేపుతోంది. బ్యాంకుల్లో మేనేజర్లుగా, ఆపై స్థాయిలో పనిచేసే కొందరు అధికారుల అవినీతి ఎంతటి స్థాయిలో ఉందంటే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రాష్ట్ర నేర పరిశోధన శాఖ (సీఐడీ) నమోదు చేసిన బ్యాంకు మోసాల కేసుల్లో 75 శాతం వారి ప్రమేయం ఉన్నవే ఉండటం గమనార్హం. లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు.. చేప పిల్లల పెంపకం, అమ్మకాల వ్యాపారం పేరుతో ఓ సంస్థ రూ. 6 కోట్లకుపైగా కొల్లగొట్టిన అభియోగాలపై కంపెనీ యజమాని, డైరెక్టర్లు సహా యూనియన్ బ్యాంక్ మేనేజర్‌పై సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది. కంపెనీ సమర్పించిన నకిలీ పత్రాలపై రూ. 6 కోట్లు లోన్ మంజూరు చేసి కమిషన్ తీసుకున్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. చేప పిల్లలు కాదు కదా.. కనీసం అక్కడ చేపల పెంపకానికి సంబంధించి చెరువు కూడా లేకపోవడం సంచలనం రేపింది. ఏకంగా రూ. 200 కోట్లు... హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ ఫైనాన్స్ లిమిటెడ్, వరుణ్ ఫైనాన్స్ బాధ్యులు ఫోర్జరీ పత్రాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 200 కోట్ల రుణం పొందారు. ఈ వ్యవహారంలోనూ బ్యాంక్ అధికారుల పాత్రపై సీఐడీ విచారణ సాగిస్తోంది. కంపెనీ సమర్పించిన పత్రాలు అసలైనవా కాదా అని ధ్రువీకరించుకోకుండా లోన్లు జారీ చేసిన బ్యాంకు అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్బీఐ పరిశ్రమ భవన్‌లోనూ.. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఎస్బీఐ పరిశ్రమ భవన్ బ్రాంచీ మేనేజర్ నవీన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకు రూ. 4 కోట్ల మేర రుణం మంజూరు చేశారు. సంస్థ సమర్పించిన బ్యాలెన్స్‌షీట్, కోలాటరల్ ఆస్తుల వివరాలను సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ధ్రువీకరించుకోకుండానే మేనేజర్ ఈ రుణం ఇచ్చారు. ఎస్బీఐ అంతర్గత ఆడిటింగ్‌లో కుట్ర బయటపడటంతో బ్యాంకు అధికా రులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. కాగా, తాజాగా తెలుగు అకాడమీకి చెందిన రూ. 64 కోట్లకుపైగా ఫిక్స్డ్ డిపాజిట్లను కొట్టేసిన నిందితులకు పలువురు బ్యాంక్ మేనేజర్లే సహకరించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ విభాగాల్లో 75 శాతం కేసులు అవే... ఇప్పటివరకు సీఐడీ దగ్గర నమోదై దర్యాప్తు దశలో ఉన్న 107 కేసుల్లో 68 కేసులు బ్యాంకు మోసాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సీబీ ఐ నమోదు చేసిన 17 ఎఫ్ఐఆర్లలో 9 కేసులు బ్యాంక్ చీటింగ్ కేసులే. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా సీసీఎస్ పో లీసులు ఈ తరహా మోసాలపై నమోదు చేసిన కేసులు వందల్లోనే ఉన్నాయి. ఇలా ఏ ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల మేర సొమ్మును బ్యాంక్ అధికారుల అవినీతి వల్ల దోచేసినట్టు సీఐడీ అంచనా వ్యక్తం చేసింది. కనిపించని సైబర్ నేరాల్లో రూ. కోట్లు పోగొట్టుకోవడం ఒక ఎత్తయితే... కళ్ల ముందు జరుగుతున్న ఆర్థిక నేరాల నియంత్రణలో కొందరు బ్యాంకు అధికారులే సూత్రధారులు కావడం ఆందోళన రేకేత్తిస్తోంది. -
మహిళ.. మనీ.. మేనేజ్మెంట్!
(సాక్షి, బిజినెస్ విభాగం) : మగవారితో పోలిస్తే దేశంలో ఆర్థిక విషయాల గురించి పట్టించుకునే మహిళలు తక్కువ. ముఖ్యంగా వివాహం తరవాత కుటుంబంలో ఆర్థిక అంశాలు, ప్రణాళికలన్నీ పురుషులే చూస్తుంటారు. తక్కువ శాతం ఇళ్లలోనే మహిళలు ఆ పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి కుటుంబానికి ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు ఏంటన్నదానిపై మహిళలకు మంచి అవగాహనే ఉంటుంది. కాకపోతే ఆర్థిక అంశాలు, పెట్టుబడుల విషయం మనకెందుకులే అని దూరంగా ఉండిపోతారు. ఈ ధోరణే భవిష్యత్తులో వారు ఒంటరిగా, తమ కాళ్లపై తాము జీవించాల్సి వస్తే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కారణాలేవైనప్పటికీ తాము ఒంటరిగా పిల్లలతో కలసి జీవించాల్సి వస్తే తమ అవసరాలకు, లక్ష్యాలకు, ఆర్థిక భద్రతకు ఏం చేయాలన్న అంశాల గురించి తెలియకపోవటం సమస్యలకు దారితీస్తుందంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్లు. తమకెందుకులేనన్న ధోరణి తప్పు! ‘‘ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొనే మహిళల్లో అధిక శాతం భారీ నగదు నిర్వహణ తెలియని వారే ఉంటారు. నగదు నిర్వహణ వ్యవహారం తమ ఉద్యోగం కాదులేనన్న ధోరణి చాలా మంది మహిళల్లో, కుటుంబాల్లో ఉండటమే దీనికి కారణం. కనీసం సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు తెలియని వివాహిత మహిళలు కూడా చాలా మందే ఉంటారు. ఈ విధమైన సందర్భాలు ఎదురైనప్పుడు వారు అచేతనంగా కొన్నాళ్ల పాటు ఏమీ చేయకుండా అలానే ఉండిపోతారు. లేదంటే ఆ నిధుల్ని తప్పుగా ఇన్వెస్ట్ చేస్తారు. పైపెచ్చు ఇలాంటి సందర్భాల్లో వారు విశ్వసనీయత లేని సన్నిహితులు, స్నేహితులపై ఆధారపడతారే గానీ ఫైనాన్షియల్ ప్లానర్ల సాయం తీసుకునేందుకు ముందుకు రారు. ఫైనాన్షియల్ ప్లానర్ల గురించి తెలియకపోవడం కూడా ఓ కారణం’’ అని హమ్‌ఫౌజి ఇనీషియేటివ్స్ సీఈవో సంజీవ్ గోవిల చెప్పారు. సమాన బాధ్యత ఉండాలి... ఒంటరి మహిళలు ముఖ్యమైన అన్ని ఆర్థిక లక్ష్యాల పట్ల సమాన బాధ్యత వహించాలని ఉమంత్ర సహ వ్యవస్థాపకురాలు మ్రిణ్ అగర్వాల్ సూచించారు. ఎక్కువగా పిల్లల విద్యకే ప్రాధాన్యమిస్తుంటారని, అదే సమయంలో తమ రిటైర్మెంట్ అవసరాల గురించి నిర్లక్ష్యం వహించడం లేదా పూర్తిగా మర్చిపోతారని ఆమె చెప్పారు. వ్యక్తిగత బీమా రక్షణకు టర్మ్ ప్లాన్, కుటుంబం కోసం ఆరోగ్య బీమా అన్నవి ఒంటరి మహిళలకు అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యాలని ఆమె సూచించారు. పలు సమస్యలుంటాయి... భర్తకు దూరమైన ప్రతి మహిళకు సాధారణంగా పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. జీవనం ఎలా, తన భర్త ఏవిధంగా సంపాదించేవారు, తను ఏ విధంగా ఇన్వెస్ట్ చేసేవారు అనేవి ఎక్కువగా ఎదురయ్యేవని జైపూర్‌కు చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ వినితా బరయా తెలియజేశారు. ‘‘ఒకవేళ తన భర్త మరణంతో బీమా పరిహారం అందితే గనుక దాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు పెట్టుబడులు, ఆర్థిక అంశాల గురించి నేర్చుకోవాలి. ఆదాయం, ఖర్చులు, పొదుపు, మదుపు, బాధ్యతల గురించి స్పష్టత వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాలి’’ అని సూచించారు. పెట్టుబడులు ప్రారంభించాలి ► ఒంటరి మహిళలు భర్తకు దూరమైనప్పుడు తమ నిధుల నిర్వహణను బంధువులకు ఇవ్వకూడదు. ► ఆర్థికాంశాల గురించి పెట్టుబడుల గురించి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఉన్న నిధుల్ని బ్యాంకులో ఎఫ్డీ చేయడమే బెటర్. ► ఆ తర్వాత పెట్టుబడులు, రాబడుల గురించి కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి. ► ఆర్థిక ప్రణాళిక గురించి తెలుసుకోవాలి. అవసరం అనుకుంటే ఫైనాన్షియల్ ప్లానర్లను ఆశ్రయించాలి. ► ఒకసారి ఆర్థికాంశాలు, పెట్టుబడుల గురించి అవగాహన వచ్చాక క్రమంగా దాన్ని ఆచరణలో పెట్టాలి. బ్యాంకు ఎఫ్డీలో నుంచి కొంత మొత్తంతో పెట్టుబడులు ప్రారంభించాలి. మరింత అవగాహన, విషయ పరిజ్ఞానం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ప్రణాళికను అమల్లో పెట్టాలి. ఫైనాన్షియల్ ప్లానర్ ఎంపికలో.. ► సంబంధిత వృత్తిలో కొన్నేళ్లయినా అనుభవం కలిగి ఉండాలి. ► ఫీజులు, చార్జీల గురించి ముందే విచారించాలి. కమిషన్‌పై సలహాలిస్తారా లేక వార్షిక ఫీజు తీసుకుంటారా? లేక ప్రతీసారి నిర్ణీత ఫీజు తీసుకుని సూచనలిస్తారా అన్నది తెలుసుకోవాలి. ► కేవలం ఏం చేయాలన్నది సూచిస్తారా లేక మన తరఫున వారే లావాదేవీలు నిర్వహిస్తారా? ► ఆర్థిక అంశాల గురించి సంపూర్ణంగా తెలియజేస్తారా... లేదా అన్నది కనుక్కోవాలి. – మ్రిణ్ అగర్వాల్, ఉమంత్ర సహ వ్యవస్థాపకురాలు దీర్ఘకాలం పాటు పెట్టుబడులకు కావాల్సినవి... ► పొదుపు, మదుపులకు క్రమశిక్షణ తప్పనిసరి. ► ఆర్థిక లక్ష్యాల పట్ల స్పష్టత అవసరం. ఉదాహరణకు పిల్ల ఉన్నత విద్య, పదవీ విరమణ అనంతరం అవసరాలు ఈ విధమైన లక్ష్యాలకు సంబంధించి చేయాల్సిన పెట్టుబడుల్లో స్పష్టత ఉండాలి. ► మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నేళ్ల సమయం ఉందన్నది కీలకం. ► పెట్టుబడుల్లో మార్కెట్ స్వల్పకాల ఆటుపోట్లను పట్టించుకోవద్దు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ► మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిప్పై విశ్వాసం ఉంచాలి. దీనివల్ల కొనుగోలు వ్యయాలు సగటుగా మారి, ప్రతికూల రిస్క్‌లు పరిమితం అవుతాయి. – వినితా బరాయా, వెల్త్ మేనేజర్ వ్యవధిని బట్టి పెట్టుబడి.. ► పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. మీరు భరించే రిస్క్‌కు అనువైన సాధనంలో ఆర్థిక లక్ష్యాలకు అవసరమైన మేర ఇన్వెస్ట్ చేయాలి. ► వచ్చే రెండు, మూడేళ్ల కాల అవసరాల కోసం అయితే సురక్షితమైన డెట్ సాధనాల్లో పెట్టాలి. ► చాలా ఏళ్ల తర్వాతే అవసరం అనుకుంటే ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ► కేవలం సురక్షిత సాధనాలనే ఆశ్రయిస్తే భవిష్యత్తు అవసరాలకు గండిపడినట్టే. ► బంగారం అయినా, రియల్ ఎస్టేట్ అయినా మీకు అవసరం అయితేనే కొనుగోలు చేయాలి. ► బీమా అన్నది పెట్టుబడి సాధనం కాదు. జరగరానిది జరిగితే రక్షణ కల్పించేది. – సంజీవ్గోవిల, హమ్‌ఫౌజి ఇనీషియేటివ్స్ సీఈవో -
బ్యాంకు మేనేజర్లపై సీబీ'ఐ'
-
బ్యాంకు మేనేజర్లపై సీబీ'ఐ'
కొత్త నోట్లతో కమీషన్ దందా నడిపిన వారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ తెలంగాణ, ఏపీల్లో వెయ్యికి పైగా బ్యాంక్ శాఖల్లో నగదు మార్పిడి స్కామ్ అనుమానంతో ఆరా తీసిన ఆర్బీఐ అక్రమాలు నిజమేనని నిర్ధారణ నగదు మార్పిడికి వచ్చిన వారి ఐడీలను జిరాక్స్ తీసిన బ్యాంకు మేనేజర్లు వాటినే మూడు నుంచి ఐదుసార్లు వాడి డబ్బులు విత్‌డ్రా ఆ మొత్తం కమీషన్‌పై నల్లకుబేరులకు అందజేత సీబీఐకి ఫిర్యాదు చేసిన రిజర్వు బ్యాంక్ ఉన్నతాధికారి సాక్షి, హైదరాబాద్ పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన నగదు మార్పిడి లావాదేవీల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుందని రిజర్వు బ్యాంక్ గుర్తించింది. అనుమానం ఉన్న ప్రాంతాలు, వాటి బ్యాంక్ శాఖలను గుర్తించి లీడ్ బ్యాంక్‌లను అప్రమత్తం చేసింది. నగదు మార్పిడికి సంబంధించి నవంబర్ 10-15 మధ్య జరిగిన లావాదేవీలకు చెందిన అన్ని రకాల డాక్యుమెంట్లు, సీసీ కెమెరాల ఫుటేజీలను తెప్పించుకోవాలని సంబంధిత బ్యాంకుల ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ముంబైలోని రిజర్వు బ్యాంక్ విజిలెన్స విభాగం పర్యవేక్షించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదలుకుని ఏపీలోని అనేక ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో నగదు మార్పిడి పేరుతో భారీగా కొత్త రూ.2 వేల నోట్లను, రూ.100 నోట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలను సమర్పించింది. నవంబర్ 10-15 మధ్య బ్యాంకుకు ఒకరోజు నగదు మార్పిడికి వచ్చిన వారే వరుసగా మూడు రోజుల పాటు వచ్చి నగదు మార్చుకున్నట్లు ఆ బ్యాంక్‌ల నుంచి తెప్పించిన డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమైంది. ఉదాహరణకు మొదటి రోజున రెండు వేల మంది నగదు మార్పిడి చేసుకుంటే వారిలో 1,000 మందికి సంబంధించిన ఐడీలను జిరాక్స్ తీసి, మళ్లీ వాటినే సమర్పించి బ్యాంక్ మేనేజర్లు నగదును విత్‌డ్రా చేశారు. నల్లకుబేరులు తెచ్చిన పాత నోట్లు తీసుకుని విత్‌డ్రా చేసిన ఈ కొత్త నగదును సమర్పించారు. ఇందుకుగాను నల్లకుబేరుల నుంచి సంబంధిత బ్యాంక్ సిబ్బందికి 20 నుంచి గరిష్టంగా 35 శాతం వరకు కమీషన్ లభించింది. వెయ్యికి పైగా శాఖల్లో స్కాం విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని వెయ్యికి పైగా వివిధ బ్యాంక్ శాఖల్లో నగదు మార్పిడి కుంభకోణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించిన ఆర్బీఐ విజిలెన్స విభాగం చెన్నైలోని సీబీఐ కార్యాలయానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. సీబీఐ విచారణ కోసం అవసరమైన డాక్యుమెంట్లను కూడా అందజేసింది. ఆయా బ్యాంక్‌ల నుంచి నగదు మార్పిడి చేసుకున్న ఆధార్ ఇతర ఐడీ కార్డు హోల్డర్ల వివరాలు, వారి ఫోన్ నెంబర్లను కూడా సమర్పించింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. మచ్చుకు నగదు మార్పిడి చేసుకున్న కొందరు గుర్తింపు కార్డుదారులకు ఫోన్లు చేసి వారి నుంచి సమాధానాలు రాబట్టింది. జిరాక్స్‌లతో జిమ్మిక్కులు.. నగదు మార్పిడికి వెళ్తే అందుకు సమర్పించే గుర్తింపు కార్డు పత్రం ఏదైనా దాని జిరాక్స్‌పై తకం ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అదే సంతకంతో కూడిన జిరాక్స్ పత్రం ఇస్తే బ్యాంక్‌లు తిరస్కరించాలి. వారికి నగదు మార్పిడి చేయకూడదు. కానీ దేశవ్యాప్తంగా జరిగినట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అక్రమ తతంగం చోటు చేసుకుంది. మొదటి మూడు రోజులు వచ్చిన గుర్తింపు కార్డులనే జిరాక్స్ తీసి కొందరు బ్రాంచ్ మేనేజర్లు కొత్త రూ.2 వేల నోట్లు, రూ.100 నోట్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. బ్యాంకుల నుంచి రూ.10 వేలు నగదు తీసుకోవడమే గగనమైన పరిస్థితుల్లో లక్షలకు లక్షలు కొత్త ధనం కమీషన్ ప్రాతిపదికన సమరూరుస్తామంటూ అనేక మంది పుట్టుకొచ్చారు. కొన్నిచోట్ల రూ.2 వేల నోట్లు లక్షల్లో పోలీసులకు పట్టుబడ్డాయి. ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో రూ.50 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు కనిపించాయి. హైదరాబాద్ రిజర్వుబ్యాంక్లోని కొందరు అధికారులకు కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉంది. ఏటీఎంలకు తరలించేందుకు ఉద్దేశించిన నగదును బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఓ సీనియర్ అధికారిని ఇప్పటికే విధుల నుంచి తప్పించారు. స్కాం విలువ ఎంత? దాదాపు వెయ్యికి పైగా బ్యాంక్ శాఖల్లో ఈ కుంభకోణం చోటుచేసుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మొత్తం సొమ్ము ఎంత ఉంటుందన్నది తెలియడం లేదు. రూ.2 వేల నోట్ల విషయంలో రిజర్వుబ్యాంక్ వద్ద కచ్చితమైన లెక్కలున్నా.. అప్పటికే బ్యాంక్‌ల వద్ద ఉన్న రూ.100 నోట్లపై స్పష్టత లేదు. మొత్తం రికార్డులు పరిశీలించి వాటిలో వాస్తవంగా ప్రజలు చేసుకున్న నగదు మార్పిడి ఎంత అన్నది ధృవీకరిస్తే గానీ ఈ స్కామ్ లోతు చెప్పలేమని అత్యున్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, గుంటూరు జిల్లా నర్సారావుపేటలోని రెండు బ్యాంక్ శాఖల్లో జరిగిన లావాదేవీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని బ్యాంక్ శాఖల్లో కూడా ఇదే జరిగింది. దీంతో రిజర్వుబ్యాంక్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బ్యాంక్ యాజమాన్యాలకు లేఖలు రాసినట్లు తెలిసింది. అన్నీ ఒక కొలిక్కి వస్తే అక్రమార్కులను గుర్తించి వారు ఎవరికి నగదు సమకూర్చారనే వివరాలు రాబట్టాలన్నది కేంద్ర ఆర్థిక శాఖ వ్యూహంగా ఉంది. నగదు మార్పిడి అక్రమాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేరుగా సీబీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘‘ఇప్పటికిప్పుడే ఈ కేసు కొలిక్కి వస్తుందనుకోవడం లేదు. నెల లేదా మూడు మాసాలు పట్టొచ్చు.. కానీ ఏ ఒక్కరూ దీని నుంచి తప్పించుకోలేరు’’ అని సీబీఐ సీనియర్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం విచారణ అత్యంత గోప్యంగా ఉంటుందని, వివరాలు బయటకు వెల్లడించబోమని ఆయన పేర్కొన్నారు. సార్.. మీరు ఎన్నిసార్లు నోట్లు మార్చుకున్నారు? నల్లగొండలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు జూలకంటి శ్రీనివాసరెడ్డి.. పెద్ద నోట్లు రద్దు తర్వాత పదో తేదీన తన వద్ద ఉన్న కొద్ది మొత్తంలోంచి రూ.4 వేలు మార్చుకునేందుకు ఓ ప్రభుత్వరంగ బ్యాంక్‌కు వెళ్లారు. భారీ క్యూలో నిలబడ్డ ఆయనకు నాలుగు గంటల తర్వాత రెండు రూ.2 వేల నోట్లు లభించాయి. మిగిలిన మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అకస్మాత్తుగా గత సోమవారం ఆయనకు చెన్నై నుంచి ఓ ఫోన్ వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారూ.. మీరు ఫలానా బ్యాంక్‌కు వెళ్లి పెద్దనోట్లు ఎన్ని సార్లు మార్చుకున్నారని అడిగేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. తాను ఒక్కసారే వెళ్లానని భయం భయంగా చెప్పాడు. మొదటి రోజు సమర్పించిన పత్రాన్ని జీరాక్స్ తీసి మరుసటి రోజు బ్యాంక్‌కు వెళ్లి ఇవ్వ లేదా? అని అడగ్గా.. లేదని సమాధానం చెప్పాడు. ‘థ్యాంక్స్ అండీ..’ అని అవతలి నుంచి ఫోన్ కట్ అయింది. ఇలా జిరాక్స్ పత్రాలు సమర్పించి నగదు పొందిన అనేక మందిని అధికారులు ఇలా ఫోన్ల ద్వారా విచారిస్తున్నారు. తదుపరి సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తారు. వారు ఏ రోజున బ్యాంక్‌కు వచ్చిందీ రానిదీ ఆ ఫుటేజ్‌లో ఉంటుంది. ఇక ఎక్కడ ఎంత మొత్తంలో అక్రమార్కులకు చేరిందన్న దానిపై రిజర్వుబ్యాంక్ నగరాలు, పట్టణాల వారీగా వర్గీకరణ చేసింది. రూ.3 కోట్లు అంతకంటే ఎక్కువ బ్లాక్ మార్కెట్‌కు చేరిన వాటిలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. రూ.2 కోట్ల మొత్తం బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లిన జాబితాలో వరంగల్, కరీంనగర్, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, తిరుపతి, శ్రీకాకుళం, కడప, భీమవరం వంటి పట్టణాలు ఉన్నాయి. రూ.కోటి అంతకంటే తక్కువ కాజేసిన జాబితాలో రాజమండ్రి, ఒంగోలు, నల్లగొండ, నంద్యాల, మంచిర్యాల, ఖమ్మం వంటివి ఉన్నారుు. -
బీమా పథకాలపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ రఘునందన్‌రావు సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మండల ఐకేపీ, ఈజీఎస్ సిబ్బంది, బ్యాంకు మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన పథకాలన్నీ తక్కువ మొత్తంతో ఎక్కువ లబ్ధి కలిగించేవిగా ఉన్నాయన్నారు. ఈ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రెండు పథకాల కింద జిల్లాలో కనిష్టంగా 10 లక్షల మంది నుంచి ప్రీమియం కట్టించేలా చూడాలని పేర్కొన్నారు. ఇందుకుగాను గ్రామాల్లో ప్రత్యేకంగా సభలు నిర్వహించి ప్రచారం చేయాలని, ప్రతి ఒక్కరికీ ఈ పథకాలపై వివరించాలన్నారు. ఈ నెల 25లోగా అర్హులంతా బ్యాంకుల్లో బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత ప్రీమియం చెల్లించేవారు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రుణమాఫీ’పై మరో కొత్త విన్యాసం..
-
‘రుణమాఫీ’పై మరో కొత్త విన్యాసం..
* సర్కార్ సర్కస్ ఫీట్లు * తాజా సర్క్యులర్‌తో బ్యాంకుల్లో గందరగోళం * నేడు బ్యాంకర్లతో ఆర్థిక శాఖ సమావేశం * రుణమాఫీ అయిందో లేదో తెలియక రైతుల్లో ఆందోళన * పేరు ప్రకటించి మాఫీలేదంటే.. రైతులు కొడతారంటున్న బ్యాంకర్లు సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పథకం విన్యాసాలతో రాష్ట్రంలో రైతులను అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకర్లను కూడా ఇబ్బందులు పెడుతోంది. సర్కారు తీరుతో ఒకవైపు రైతులు విలవిల్లాడుతుండగా మరోవైపు బ్యాంకర్లు గగ్గోలు పెడుతున్నారు. రుణ మాఫీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బ్యాంకులకు జారీ చేసిన సర్క్యులర్‌తో మేనేజర్లు తలపట్టుకుంటున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా తమ పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఒక రైతు ఒక సర్వే నంబర్‌పై సహకార బ్యాంకులో పట్టాదారు పుస్తకం పెట్టి రుణం తీసుకుని, ఆ రుణం సరిపోక అదే పట్టాదారు పాసుపుస్తకం ద్వారా వాణిజ్య బ్యాంకులో బంగారం తనఖా పెట్టి మరో రుణం తీసుకుంటే... తొలుత తీసుకున్న రుణం ఒకటే మాఫీ కింద పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత బ్యాంకు మేనేజర్ నుంచి రికవరీ చేస్తామని పేర్కొన్నారు. దీనిపై బ్యాంకు మేనేజర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతుల రుణ విముక్తి’ తొలి జాబితాలో ఒక బ్యాంకులో కన్నా ఎక్కువ బ్యాంకుల్లో రుణం తీసుకున్న వారి పేర్లనూ ప్రకటించారని ప్రభుత్వం భావిస్తోంది. కానీ సర్క్యు లర్‌లో మాత్రం ఒక సర్వే నంబర్‌పై ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని రుణాలు తీసుకున్నా తొలుత తీసుకున్న రుణం మాత్రమే మాఫీ పరిధిలోకి తీసుకోవాలనే నిబంధనను ఇప్పుడు కొత్తగా విధించారు. ఒకే సర్వే నంబర్‌పై ఒక రైతు ఎన్ని బ్యాంకుల్లో ఎంత రుణం తీసుకున్నారనే వివరాలు బ్యాంకు సెర్చ్ కొడితే తెలిసిపోతాయని, దాని ప్రకారం బ్యాంకు మేనేజర్లు ఒక బ్యాం కులో రుణం మాత్రమే మాఫీకి వర్తింపచేయాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఒకసారి జాబితాలో పేరున్నట్లు రైతులు తెలుసుకున్నాక ఇప్పుడు రెండు బ్యాంకుల్లో తీసుకున్నందున మాఫీ వర్తించదని చెబితే బ్యాంకుల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ బ్యాంకులో రుణం మాఫీ చేయాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ధారించకుండా తమను బలి పశువులను చేయాలనుకుంటోం దని వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే తమకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముందుకు సాగని రుణమాఫీ పథకం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ నేపథ్యంలో ఎక్కడా కూడా రుణ మాఫీ పథకం అమలు ముందుకు సాగడం లేదు. రైతుల నుంచి ఎక్కడెక్కడ రుణాలు తీసుకున్నారనే వివరాలను ముందుగానే ప్రచురించిన అఫిడవిట్ ద్వారా బ్యాంకులు సేకరిస్తున్నాయి. అలాగే సర్వే నెంబర్ గల ఒరిజినల్ పట్టాదారు పాసుపుస్తకం తేవాలని కోరుతున్నాయి. అయితే బ్యాంకు మేనేజర్లు వ్యక్తం చేస్తున్న సందేహాలతోపాటు మళ్లీమళ్లీ అడుగుతున్న వివరాలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గ్రామాల్లోని రైతులు తమ పొలంపై సహకార సంఘాల నుంచి పట్టాదారు పాసుపుస్తకంపై రుణం తీసుకున్నారు. ఆ రుణం వ్యవసాయ పెట్టుబడికి సరిపోకవడంతో అదే సర్వే నెంబర్ భూమిని చూపెట్టడంతో పాటు వాణిజ్య బ్యాంకులో బంగారం కుదువపెట్టి వ్యవసాయానికి రుణం తీసుకున్నారు. రుణమాఫీ జాబితాలో రెండు బ్యాంకుల్లో రుణం ఉన్నట్లు రైతుల పేర్లను సర్కారు ప్రకటించింది. కానీ తాజా సర్క్యులర్‌లో తొలుత తీసుకున్న రుణం మాత్రమే మాఫీ చేయాలని పేర్కొంది. లేదంటే అందుకు సంబంధిత బ్యాంకు మేనేజర్‌నే బాధ్యుడిని చేస్తామని, ఆ మొత్తాన్ని మేనేజర్ నుంచి రికవరీ చేస్తామని స్పష్టంచేసింది. ఈ అంశంపై బ్యాంకర్లు పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించినా స్పందన రాకపోగా... బ్యాంకులే కచ్చితంగా ఈ విషయాన్ని రైతులకు చెప్పాలంటున్నారు. ఈ నేపథ్యంలో రుణ విముక్తికి అర్హులంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబితాలోని రైతుల ఖాతాలకు ఇంకా ప్రభుత్వ నిధులను బ్యాంకులు జమ చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకైతే తొలి జాబితాలోని రైతుల ఖాతాలకు రుణ విముక్తి సొమ్ము ఈ నెల 12వ తేదీలోగా సర్దుబాటు కావాల్సి ఉంది. అయితే డిసెంబర్ నెలాఖరు వస్తున్నా చాలా బ్యాంకుల్లో రైతుల రుణ ఖాతాలకు ప్రభుత్వం తొలుత ఇచ్చిన సొమ్ము ఇంకా సర్దుబాటు కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు శనివారం ప్రధానమైన బ్యాంకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.