
‘రుణమాఫీ’పై మరో కొత్త విన్యాసం..
* సర్కార్ సర్కస్ ఫీట్లు
* తాజా సర్క్యులర్‌తో బ్యాంకుల్లో గందరగోళం
* నేడు బ్యాంకర్లతో ఆర్థిక శాఖ సమావేశం
* రుణమాఫీ అయిందో లేదో తెలియక రైతుల్లో ఆందోళన
* పేరు ప్రకటించి మాఫీలేదంటే.. రైతులు కొడతారంటున్న బ్యాంకర్లు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పథకం విన్యాసాలతో రాష్ట్రంలో రైతులను అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకర్లను కూడా ఇబ్బందులు పెడుతోంది. సర్కారు తీరుతో ఒకవైపు రైతులు విలవిల్లాడుతుండగా మరోవైపు బ్యాంకర్లు గగ్గోలు పెడుతున్నారు. రుణ మాఫీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బ్యాంకులకు జారీ చేసిన సర్క్యులర్‌తో మేనేజర్లు తలపట్టుకుంటున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా తమ పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఒక రైతు ఒక సర్వే నంబర్‌పై సహకార బ్యాంకులో పట్టాదారు పుస్తకం పెట్టి రుణం తీసుకుని, ఆ రుణం సరిపోక అదే పట్టాదారు పాసుపుస్తకం ద్వారా వాణిజ్య బ్యాంకులో బంగారం తనఖా పెట్టి మరో రుణం తీసుకుంటే... తొలుత తీసుకున్న రుణం ఒకటే మాఫీ కింద పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత బ్యాంకు మేనేజర్ నుంచి రికవరీ చేస్తామని పేర్కొన్నారు. దీనిపై బ్యాంకు మేనేజర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతుల రుణ విముక్తి’ తొలి జాబితాలో ఒక బ్యాంకులో కన్నా ఎక్కువ బ్యాంకుల్లో రుణం తీసుకున్న వారి పేర్లనూ ప్రకటించారని ప్రభుత్వం భావిస్తోంది.
కానీ సర్క్యు లర్‌లో మాత్రం ఒక సర్వే నంబర్‌పై ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని రుణాలు తీసుకున్నా తొలుత తీసుకున్న రుణం మాత్రమే మాఫీ పరిధిలోకి తీసుకోవాలనే నిబంధనను ఇప్పుడు కొత్తగా విధించారు. ఒకే సర్వే నంబర్‌పై ఒక రైతు ఎన్ని బ్యాంకుల్లో ఎంత రుణం తీసుకున్నారనే వివరాలు బ్యాంకు సెర్చ్ కొడితే తెలిసిపోతాయని, దాని ప్రకారం బ్యాంకు మేనేజర్లు ఒక బ్యాం కులో రుణం మాత్రమే మాఫీకి వర్తింపచేయాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఒకసారి జాబితాలో పేరున్నట్లు రైతులు తెలుసుకున్నాక ఇప్పుడు రెండు బ్యాంకుల్లో తీసుకున్నందున మాఫీ వర్తించదని చెబితే బ్యాంకుల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ బ్యాంకులో రుణం మాఫీ చేయాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ధారించకుండా తమను బలి పశువులను చేయాలనుకుంటోం దని వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే తమకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ముందుకు సాగని రుణమాఫీ పథకం
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ నేపథ్యంలో ఎక్కడా కూడా రుణ మాఫీ పథకం అమలు ముందుకు సాగడం లేదు. రైతుల నుంచి ఎక్కడెక్కడ రుణాలు తీసుకున్నారనే వివరాలను ముందుగానే ప్రచురించిన అఫిడవిట్ ద్వారా బ్యాంకులు సేకరిస్తున్నాయి. అలాగే సర్వే నెంబర్ గల ఒరిజినల్ పట్టాదారు పాసుపుస్తకం తేవాలని కోరుతున్నాయి. అయితే బ్యాంకు మేనేజర్లు వ్యక్తం చేస్తున్న సందేహాలతోపాటు మళ్లీమళ్లీ అడుగుతున్న వివరాలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా గ్రామాల్లోని రైతులు తమ పొలంపై సహకార సంఘాల నుంచి పట్టాదారు పాసుపుస్తకంపై రుణం తీసుకున్నారు. ఆ రుణం వ్యవసాయ పెట్టుబడికి సరిపోకవడంతో అదే సర్వే నెంబర్ భూమిని చూపెట్టడంతో పాటు వాణిజ్య బ్యాంకులో బంగారం కుదువపెట్టి వ్యవసాయానికి రుణం తీసుకున్నారు. రుణమాఫీ జాబితాలో రెండు బ్యాంకుల్లో రుణం ఉన్నట్లు రైతుల పేర్లను సర్కారు ప్రకటించింది. కానీ తాజా సర్క్యులర్‌లో తొలుత తీసుకున్న రుణం మాత్రమే మాఫీ చేయాలని పేర్కొంది. లేదంటే అందుకు సంబంధిత బ్యాంకు మేనేజర్‌నే బాధ్యుడిని చేస్తామని, ఆ మొత్తాన్ని మేనేజర్ నుంచి రికవరీ చేస్తామని స్పష్టంచేసింది.
ఈ అంశంపై బ్యాంకర్లు పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించినా స్పందన రాకపోగా... బ్యాంకులే కచ్చితంగా ఈ విషయాన్ని రైతులకు చెప్పాలంటున్నారు. ఈ నేపథ్యంలో రుణ విముక్తికి అర్హులంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబితాలోని రైతుల ఖాతాలకు ఇంకా ప్రభుత్వ నిధులను బ్యాంకులు జమ చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకైతే తొలి జాబితాలోని రైతుల ఖాతాలకు రుణ విముక్తి సొమ్ము ఈ నెల 12వ తేదీలోగా సర్దుబాటు కావాల్సి ఉంది. అయితే డిసెంబర్ నెలాఖరు వస్తున్నా చాలా బ్యాంకుల్లో రైతుల రుణ ఖాతాలకు ప్రభుత్వం తొలుత ఇచ్చిన సొమ్ము ఇంకా సర్దుబాటు కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు శనివారం ప్రధానమైన బ్యాంకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.