పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన నగదు మార్పిడి లావాదేవీల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుందని రిజర్వు బ్యాంక్ గుర్తించింది. అనుమానం ఉన్న ప్రాంతాలు, వాటి బ్యాంక్ శాఖలను గుర్తించి లీడ్ బ్యాంక్‌లను అప్రమత్తం చేసింది. నగదు మార్పిడికి సంబంధించి నవంబర్ 10-15 మధ్య జరిగిన లావాదేవీలకు చెందిన అన్ని రకాల డాక్యుమెంట్లు, సీసీ కెమెరాల ఫుటేజీలను తెప్పించుకోవాలని సంబంధిత బ్యాంకుల ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ముంబైలోని రిజర్వు బ్యాంక్ విజిలెన్‌స విభాగం పర్యవేక్షించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదలుకుని ఏపీలోని అనేక ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో నగదు మార్పిడి పేరుతో భారీగా కొత్త రూ.2 వేల నోట్లను, రూ.100 నోట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలను సమర్పించింది.