బ్యాంక్‌ల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడండి
- డీఎస్పీ రామక్రిష్ణయ్య
బద్వేలు అర్బన్: మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం బ్యాంక్‌లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఖాతాదారులు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఇందుకోసం బ్యాంక్‌ల వద్ద ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మైదుకూరు డీఎస్పీ ఎన్.రామకృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్బీఐ మెయిన్‌బ్రాంచ్‌లో పట్టణంలోని వివిధ బ్యాంక్‌ల మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ రద్దీ ఉండే బ్యాంక్‌ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు టోకన్ సిస్టం అమలు పరచాలని కోరారు. అలాగే క్యూలైన్లలో ఉన్నవారికి తాగునీటి వసతి కల్పించాలన్నారు. ప్రజలు కూడా సంయమనం పాటించి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. బ్యాంక్‌ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐ రామాంజినాయక్కు సూచించారు. కార్యక్రమంలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఇన్చార్జి మేనేజర్ కోటానాయక్, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ రాంనాయక్, ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ మేనేజర్ సుజితలతోపాటు వివిధ బ్యాంక్‌ల మేనేజర్లు , బద్వేలు , గోపవరం ఎస్ఐలు నూర్ అహ్మద్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.