Banking loans
-
ఏపీ సర్కారు పనితీరుపై కేంద్రం ప్రశంస
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరడంలో మెరుగ్గా ఉందనే విషయాన్ని గుర్తించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావ్ కరాద్ ఏపీ సర్కారు తీరును మెచ్చుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి బుగ్గన అధ్యక్షతన 224వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లడుతూ.. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.1.68 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా బ్యాంకర్లను ప్రత్యేకంగా బుగ్గన అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ ప్రణాళిక లక్ష్యం గతేడాది (రూ.1.40 లక్షల కోట్లు) కన్నా 20 శాతం ఎక్కువగా అంటే.. రూ.1.68 లక్షల కోట్లు నమోదు చేయడం శుభపరిణామమన్నారు. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలకు విరివిగా రుణాలివ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. పీఎం ముద్ర, స్టాండప్ ఇండియా తదితర పథకాలకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని కోరారు. వీధి, చిరు వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు, ఆత్మనిర్భర్ నిధి, పీఎం ఎఫ్ఎమ్ఈ పథకాల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలిచ్చేందుకు మరింత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆయా పథకాల అమలులో ఎక్కువ జాప్యం లేకుండా దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకానికి 8వ తరగతి అర్హత, ఒక జిల్లా ఒక వస్తువు వంటివి తొలగించడం వంటి అంశాలను సరళతరం చేసిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ రుణ సదుపాయం కల్పించడంలో వేగం పెంచాలన్నారు. ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇందులో పాలుపంచుకోవాలన్నారు. కౌలు రైతులకు మరింత సహకారం జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 67,422 మంది కౌలు రైతులకు రూ.517.86 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగనన్న నగర్లలో గృహ నిర్మాణం చేసుకునే వారికి రుణ సదుపాయం కల్పించే లక్ష్యం రూ.2,464.72 కోట్లు (60 శాతం) చేరామన్నారు. సిబిల్ స్కోర్, వయసు తదితర కారణాలతో ఎక్కువ దరఖాస్తులు పక్కన పెడుతున్నారని.. బ్యాంకర్లు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యం చేరడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. రైతులకు మరిన్ని రుణాలివ్వాలి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులకు మరిన్ని రుణాలందించడం ద్వారా చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న పాలవెల్లువ పథకంలో పాడి రైతులకు తోడ్పాటు ఇవ్వాలన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను విజయవంతగా అమలు చేస్తోందని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ.. కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు మరింత తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు మరింత సహకరించాలని కోరారు. జగనన్న గృహ నిర్మాణ కాలనీలకు రానున్న నాలుగైదు నెలల్లో నూరు శాతం రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం ఎం.రవీంద్రబాబు, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, యూబీఐ జీఎం గుణానంద్ గామి, ఏసీఎం రాజుబాబు పాల్గొన్నారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ తగ్గించండి స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకూ రూ.4,286 కోట్లను రుణాలుగా ఇచ్చినట్టు మంత్రి బుగ్గన చెప్పారు. దీనిని మరింత పెంచాలని కోరారు. రూ.3 లక్షల వరకూ డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ కార్యక్రమాల ద్వారా పేద మహిళలకు వడ్డీ భారం తగ్గించే అంశంపైనా చొరవ చూపాలన్నారు. -
బ్యాంకింగ్ రుణ ఎగవేతదారులు పెరుగుతున్నారు: నిర్మలా
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారులు పెరుగుతున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 2019 మార్చి 31 నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 2,017 అని తెలిపారు. 2020 మార్చి 31 నాటికి ఈ సంఖ్య 2,208కి చేరినట్లు పేర్కొన్నారు. 2021 మార్చి 31నాటికి వీరి సంఖ్య మరింత పెరిగి 2,494కు చేరిందని తెలిపారు. ఎగవేతలకు సంబంధించి రుణ గ్రహీతలపైనే కాకుండా, గ్యారెంటార్లపై సైతం బ్యాంకింగ్ తగిన క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2019–20లో రూ.1,75,876 కోట్ల రుణాలను ప్రభుత్వ బ్యాంకింగ్ రద్దు చేస్తే, 2020–21లో ఈ విలువ రూ.1,31,894 కోట్లకు తగ్గిందన్నారు. ఇక మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏ) 2021 మార్చి 31 నాటికి 9.11 శాతానికి తగ్గినట్లు తెలిపారు. 2015 మార్చి 31న ఈ రేటు 11.97 శాతంగా తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు మొండిబకాయిల తీవ్రత తగ్గడానికి కారణమన్నారు. బ్యాంకింగ్‌లో మొండిబకాయిల (ఎన్పీఏ) భారం 2021 మార్చి చివరి నాటికి వార్షికంగా రూ.61,180 కోట్లు తగ్గి రూ.8.34 లక్షల కోట్లకు దిగివచ్చినట్లు వివరించారు. 2020 మార్చి ముగింపునకు ఎన్పీఏల భారం రూ.8.96 లక్షల కోట్లని తెలిపారు. -
ఇన్ఫ్రాకు రుణాలిక కష్టమే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేసిన నిబంధనావళి వల్ల దేశంలో మౌలిక రంగానికి బ్యాంకింగ్ రుణాలు... ప్రత్యేకించి దీర్ఘకాలిక ఫండింగ్ నెమ్మదిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొండిబకాయిలకు (ఎన్పీఏ) సంబంధించి కొత్త నిబంధనావళిని సడలించే సమస్యే లేదని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం, పరిశ్రమలు, బ్యాంకింగ్ నుంచి నిబంధనల సడలింపునకు సంబంధించి వస్తున్న విజ్ఞప్తులను మన్నించలేమని కూడా ఆర్బీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఎగవేతదారుల సత్వర గుర్తింపు, రుణ పునఃచెల్లింపుల్లో విఫలమైన కంపెనీలను (ఒక రోజు ఆలస్యం అయినా) దారిలో పెట్టడానికి అనుసరించాల్సిన సత్వర ప్రణాళిక రూపకల్పన విధివిధానాలు, ఆయా కంపెనీలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు రిఫర్ చేయడానికి 180 రోజుల కాలపరిమితుల విధింపు వంటి అంశాలు ఆర్బీఐ తాజా నిబంధనావళిలో ఉన్నాయి. ఈ కఠిన నిర్ణయాల నేపథ్యంలో విద్యుత్, రోడ్లు, నౌకాశ్రయాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో దీర్ఘకాలిక ఫండింగ్ తగ్గే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు ఒక బ్యాంకర్ తెలిపారు. నిజానికి దేశాభివృద్ధికి ఈ రంగాలకు రుణ లభ్యత అవసరమైనా, ఇలాంటి రుణాలను రాబట్టుకునే విషయంలో ఇబ్బంది సైతం తీవ్రంగా ఉందని పేర్కొన్న మరో బ్యాంకర్ అందువల్ల ఆయా రంగాలకు రుణ మంజూరులో బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. -
గృహ కొనుగోళ్లకు మరింత రుణం
►రూ.30 లక్షల విలువైన ఆస్తిపై ► 90 శాతం వరకూ బ్యాంకింగ్ రుణాలు ► ఇప్పటివరకూ రూ.20 లక్షల వరకే ఈ సౌలభ్యం ముంబై: గృహ కొనుగోలుదారులకు మరింత రుణ వెసులుబాటు కలగనుంది. రూ.30 లక్షలు ఆ లోపు ఆస్తికి సంబంధించి 90 శాతం వరకూ గృహ రుణ మంజూరు అవకాశాన్ని ఇకపై బ్యాంకులు కలుగజేయనున్నాయి. ఇప్పటి వరకూ రూ.20 లక్షల ఆస్తి విలువపై వరకూ మాత్రమే 90 శాతం రుణం వెసులుబాటు ఉంది. గృహ రుణాలపై పలు బ్యాంకింగ్ దిగ్గజాలు వడ్డీరేట్లు తగ్గించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు తాజా సర్క్యులర్ విడుదల చేసింది. దీని ప్రకారం... రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ లోన్ టూ వ్యాల్యూ నిష్పత్తి 80 శాతంగా ఉంటుంది. అటుపై మొత్తం విలువ గృహ కొనుగోలుకు ఈ నిష్పత్తి 75 శాతంగా ఉంటుంది. గృహ రుణాలకు సంబంధించి రిస్క్-వెయిటేజ్ ప్రొవిజనింగ్ నిబంధనలను సైతం ఆర్బీఐ మార్చింది. క్రెడాయ్ హర్షం... కాగా ఆర్బీఐ నిర్ణయం పట్ల రియల్టర్ల ఉన్నత మండలి క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. గత రెండుమూడేళ్లుగా సవాళ్లను ఎదుర్కొంటున్న రియల్టీ రంగ సెంటిమెంట్‌ను ఈ నిర్ణయం బలపరుస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో రూ.30 లక్షల లోపు గృహ అమ్మకాలు పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా మెట్రోల విషయంలో 90 శాతం వరకూ రుణ విలువను రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షల పెంచాలని సైతం ఆయన విజ్ఞప్తి చేశారు. 2013లో ఏడు ప్రధాన నగరాల్లో దాదాపు 2 లక్షల గృహాలు అమ్ముడయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. అయితే 2015లో ఈ సంఖ్య 1.75 లక్షలకు పడిపోయిందని సైతం పేర్కొంది. రేటు కోతను బ్యాంకులు పూర్తిగా బదలాయిస్తాయ్: ఆర్బీఐ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ నుంచి అందిన రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు పూర్తి స్థాయిలో బదలాయిస్తాయన్న విశ్వాసాన్ని డిప్యూ టీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ గురువారం వ్యక్తం చేశారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో (ప్రస్తుతం 6.75 శాతం). ఈ ఏడాది కాలంలో ఈ రేటును ఆర్బీఐ 1.25 శాతం తగ్గించింది. అయితే దీనితో దాదాపు సగం ప్రయోజనాన్నే బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాయి. దేశంలో అందరికీ బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించడంపై ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ‘రెపో ప్రయోజనం బదలాయింపు’ అంశాన్ని ఖాన్ ప్రస్తావించారు. దీనికి మరికొంత సమయం పడుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. చిన్న పొదుపులపై వడ్డీరేట్ల సమీక్ష గురించి ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్థిక కార్యదర్శి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రెపో బదలా యింపునకు జరుగుతున్న ఆలస్యంలో చిన్న పొదుపు రేట్లు కూడా ఒకటని ఆయన అన్నారు.