ఏపీ సర్కారు పనితీరుపై కేంద్రం ప్రశంస | Central Government appreciated the performance of Andhra Pradesh Government | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కారు పనితీరుపై కేంద్రం ప్రశంస

Published Tue, Oct 31 2023 5:32 AM | Last Updated on Tue, Oct 31 2023 5:32 AM

Central Government appreciated the performance of Andhra Pradesh Government - Sakshi

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కాకాని గోవర్థన్‌ రెడ్డి తదితరులు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరడంలో మెరుగ్గా ఉందనే విషయాన్ని గుర్తించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కృష్ణారావ్‌ కరాద్‌ ఏపీ సర్కారు తీరును మెచ్చుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి బుగ్గన అధ్యక్షతన 224వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సోమవారం జరిగింది.

ఈ సందర్భంగా బుగ్గన మాట్లడుతూ.. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.1.68 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా బ్యాంకర్లను ప్రత్యేకంగా బుగ్గన అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రుణ ప్రణాళిక లక్ష్యం గతేడాది (రూ.1.40 లక్షల కోట్లు) కన్నా 20 శాతం ఎక్కువగా అంటే.. రూ.1.68 లక్షల కోట్లు నమోదు చేయడం శుభపరిణామమన్నారు. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్‌ఎంఈలకు విరివిగా రుణాలివ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. పీఎం ముద్ర, స్టాండప్‌ ఇండియా తదితర పథకాలకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని కోరారు.

వీధి, చిరు వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వండి
ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు, ఆత్మనిర్భర్‌ నిధి, పీఎం ఎఫ్‌ఎమ్‌ఈ పథకాల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలిచ్చేందుకు మరింత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విజ్ఞప్తి చేశారు. ఆయా పథకాల అమలులో ఎక్కువ జాప్యం లేకుండా దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకానికి 8వ తరగతి అర్హత, ఒక జిల్లా ఒక వస్తువు వంటివి తొలగించడం వంటి అంశాలను సరళతరం చేసిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ రుణ సదుపాయం కల్పించడంలో వేగం పెంచాలన్నారు. ప్రైవేట్‌ బ్యాంకులు కూడా ఇందులో పాలుపంచు­కోవాలన్నారు.

కౌలు రైతులకు మరింత సహకారం
జూన్‌ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 67,422 మంది కౌలు రైతులకు రూ.517.86 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగనన్న నగర్‌లలో గృహ నిర్మాణం చేసుకునే వారికి రుణ సదుపాయం కల్పించే లక్ష్యం రూ.2,464.72 కోట్లు (60 శాతం) చేరామన్నారు. సిబిల్‌ స్కోర్, వయసు తదితర కారణాలతో ఎక్కువ దరఖాస్తులు పక్కన పెడుతున్నారని.. బ్యాంకర్లు పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యం చేరడంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

రైతులకు మరిన్ని రుణాలివ్వాలి
వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులకు మరిన్ని రుణాలందించడం ద్వారా చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న పాలవెల్లువ పథకంలో పాడి రైతులకు తోడ్పాటు ఇవ్వాలన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామ సుబ్రమ­ణియన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను విజయవంతగా అమలు చేస్తోందని కొనియాడారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ మాట్లాడుతూ.. కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు మరింత తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు మరింత సహకరించాలని కోరారు. జగనన్న గృహ నిర్మాణ కాలనీలకు రానున్న నాలుగైదు నెలల్లో  నూరు శాతం రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జీఎం ఎం.రవీంద్రబాబు, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్, ఆర్‌బీఐ జీఎం ఆర్కే మహానా, నాబార్డు సీజీఎం ఎంఆర్‌ గోపాల్, యూబీఐ జీఎం గుణానంద్‌ గామి, ఏసీఎం రాజుబాబు పాల్గొన్నారు. 

మహిళా సంఘాల రుణాలపై వడ్డీ తగ్గించండి
స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకూ రూ.4,286 కోట్లను రుణాలుగా ఇచ్చినట్టు మంత్రి బుగ్గన చెప్పారు. దీనిని మరింత పెంచాలని కోరారు. రూ.3 లక్షల వరకూ డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ తగ్గించే అంశంపై  నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ కార్యక్రమాల ద్వారా పేద మహిళలకు వడ్డీ భారం తగ్గించే అంశంపైనా చొరవ చూపాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement