సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే అంతర్జాతీయంగా ఖ్యాతి గడించగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై కేంద్రం దృష్టి సారించింది. తాజాగా సహకార రంగ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను దేశమంతా అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది.
ఏపీలో సహకార సంస్కరణలివీ..
ఏపీ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ (సీబీఎస్) నెట్‌వర్క్ పరిధిలోకి తెచ్చి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్) మైక్రో బ్యాంకులుగా తీర్చిదిద్దుతున్నారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ టీసీఎస్ సహకారంతో సహకార రంగాన్ని పూర్తిగా సీబీఎస్ పరిధిలోకి తీసుకొచ్చి పేమెంట్, డెలివరీ చానళ్లను ఆన్‌లైన్‌తో అనుసంధాన ప్రక్రియకు రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. ఆప్కాబ్‌తో పాటు 7 డీసీసీబీల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా మిగిలిన చోట్ల చివరి దశకు చేరుకుంది.
ఆప్కాబ్‌తో సహా కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి వచ్చిన డీసీసీబీల్లో ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ, ఐఎంపీఎస్, యూపీఐ, ఈ–కామర్స్, బీఈపీజీ, రూపే డెబిట్ కార్డులు (పేమెంట్ చానల్స్), ఏటీఎం/ మొబైల్ ఏటీఎం, పీఓఎస్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (డెలివరీ చానల్స్) లాంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. 2020–21 వరకు ఆడిటింగ్ పూర్తి చేశారు. కార్పొరేట్ ఇన్‌స్రూ?న్స్ ఏజెన్సీతో పాటు ఈ–స్టాఫింగ్, ఈ–ఆఫీస్ తెచ్చారు. సిబ్బంది కోసం ప్రత్యేకంగా కాబొనెట్ (మొబైల్ ద్వారా సేవల నిర్వహణ) సౌకర్యం తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా హెచ్‌ఆర్ పాలసీని ప్రవేశపెట్టారు. మండలానికో బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్బీకే స్థాయిలో మైక్రో ఏటీఎంలను నెలకొల్పుతున్నారు.
లాభాల బాటలో...
దేశంలోనే తొలిసారిగా పీఏసీఎస్‌ల డిజిటలైజేషన్‌కు రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. ఒక్కో పీఎసీఎస్‌కు రూ.5 లక్షలు వ్యయం కానుందని అంచనా. లాభాల్లో నడిచే సొసైటీలు సొంత నిధులతో కంప్యూటరీకరించుకోనుండగా మిగిలిన సొసైటీలకు డీసీసీబీ, ఆప్కాబ్‌ల ద్వారా ఆర్థిక చేయూతనివ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.120 కోట్ల అంచనా వ్యయంతో రెండేళ్ల క్రితం ఉత్తర్వులిచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా 35 పీఏసీఎస్‌ల్లో టీసీఎస్, 3 పీఏసీఎస్‌ల్లో వీ సాప్ట్ టెక్నాలజీ ద్వారా కంప్యూటరైజేషన్ పూర్తి చేసి డీసీసీబీలతో అనుసంధానం చేశారు. మిగిలిన పీఏసీఎస్‌ల్లో దశలవారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల ఫలితంగా డీసీసీబీలతో పాటు మెజార్టీ పీఏసీఎస్‌లు నష్టాలను పూర్తిగా అధిగమించి లాభాల బాట పట్టాయి. 31.82 శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తున్నాయి.
ఏపీ స్ఫూర్తితో కేంద్రం అడుగులు...
ఆంధ్రప్రదేశ్ తరహాలో దేశవ్యాప్తంగా పీఎసీఎస్‌లను కంప్యూటరీకరించాలని కేంద్రం సంకల్పించింది. దేశవ్యాప్తంగా 33 స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు(ఎస్‌సీబీ), 351 డీసీసీబీలు, 95 వేల పీఏసీఎస్‌లు ఉండగా ప్రస్తుతం 63 వేల పీఏసీఎస్‌లు మాత్రమే రైతులకు సేవలందిస్తున్నాయి. మెజార్టీ ఎస్‌సీబీలు, డీసీసీబీలు నాబార్డు సహకారంతో సీబీఎస్ పరిధిలోకి రాగా, పీఎసీఎస్‌ల్లో నేటికీ మాన్యువల్‌గానే లావాదేవీలు జరుగుతున్నాయి.
కంప్యూటరీకరణకు ఒక్కో పీఏసీఎస్‌కు రూ.3.91 లక్షలు చొప్పున రూ.2,516 కోట్లు వ్యయం కానుందని అంచనా. కేంద్రం రూ.1528 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.736 కోట్లు, నాబార్డు రూ.252 కోట్లు సమకూర్చనున్నాయి. నాబార్డు పర్యవేక్షణలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు (పీఎంయూ) ఏర్పాటు చేస్తారు. జాతీయ సంస్థల ద్వారా సిబ్బందికి శిక్షణనిస్తారు. జాతీయ స్థాయిలో గుర్తించిన సాప్ట్‌వేర్ వెండార్స్ (ఎన్‌ఎల్‌పీఎస్‌వీ) ద్వారా సాఫ్ట్‌వేర్‌ను, భారత్‌నెట్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తారు. 2022–23లో 13 వేలు, 2023–24లో 20 వేలు, 2024–25లో 30 వేల చొప్పున పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించనున్నారు.
మూడేళ్లుగా పలు సంస్కరణలు
సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు మూడేళ్లుగా పలు సంస్కరణలు తెచ్చాం. ఆప్కాబ్‌ను మైగ్రేటెడ్ చేశాం. డీసీసీబీలను కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకొచ్చాం. పీఏసీఎస్‌లను దశల వారీగా కంప్యూటరైజేషన్ చేస్తున్నాం. ఏపీ స్ఫూర్తితో జాతీయస్థాయిలో పీఎసీఎస్‌లను కంప్యూటరీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రాజెక్టు కింద తొలిదశలో రాష్ట్రంలోని పీఏసీఎస్‌లన్నీ కంప్యూటరీకరించేందుకు మార్గం సుగమమైంది.
–వై.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, సహకార, మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment