
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను, నగదు పంపిణీని తాము వ్యతిరేకించడం లేదని సీపీఐ రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వానికి తాము వ్యతిరేకమనే భావన కల్పించేలా కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలను ఖండించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని మాత్రమే కోరుతున్నామన్నారు.
పార్టీ రాష్ట్ర నేతలు జల్లి విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, రావుల వెంకయ్యతో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ స్వతంత్రంగానే వ్యవహరిస్తుందని, నిర్దిష్టంగా ప్రతిపక్ష వైఖరి అవలంబించాలని పార్టీ కౌన్సిల్ సమావేశం తీర్మానించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయ, ఆర్థిక పరిపాలనా వైఫల్యాన్ని నిరసిస్తూ స్వతంత్రంగా పోరాటాలకు సమాయత్తమవుతున్నట్టు తెలిపారు.
మోదీ పాలనలో ఉన్నవి పోయావే తప్ప.. కొత్త ఉద్యోగాలు రాలేదని, 33% పరిశ్రమలు మూత పడ్డాయన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పథకాలు పేదలకు ఊరటనిచ్చాయన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. విశాఖ ఉద్యమాన్ని 13 జిల్లాలకు విస్తరింపజేయనున్నట్టు తెలిపారు. విశాఖలో 2 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని చెప్పారు.