గృహ కొనుగోళ్లకు మరింత రుణం
►రూ.30 లక్షల విలువైన ఆస్తిపై
► 90 శాతం వరకూ బ్యాంకింగ్ రుణాలు
► ఇప్పటివరకూ రూ.20 లక్షల వరకే ఈ సౌలభ్యం
ముంబై: గృహ కొనుగోలుదారులకు మరింత రుణ వెసులుబాటు కలగనుంది. రూ.30 లక్షలు ఆ లోపు ఆస్తికి సంబంధించి 90 శాతం వరకూ గృహ రుణ మంజూరు అవకాశాన్ని ఇకపై బ్యాంకులు కలుగజేయనున్నాయి. ఇప్పటి వరకూ రూ.20 లక్షల ఆస్తి విలువపై వరకూ మాత్రమే 90 శాతం రుణం వెసులుబాటు ఉంది. గృహ రుణాలపై పలు బ్యాంకింగ్ దిగ్గజాలు వడ్డీరేట్లు తగ్గించిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ మేరకు తాజా సర్క్యులర్ విడుదల చేసింది. దీని ప్రకారం... రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ లోన్ టూ వ్యాల్యూ నిష్పత్తి 80 శాతంగా ఉంటుంది. అటుపై మొత్తం విలువ గృహ కొనుగోలుకు ఈ నిష్పత్తి 75 శాతంగా ఉంటుంది. గృహ రుణాలకు సంబంధించి రిస్క్-వెయిటేజ్ ప్రొవిజనింగ్ నిబంధనలను సైతం ఆర్‌బీఐ మార్చింది.
క్రెడాయ్ హర్షం...
కాగా ఆర్‌బీఐ నిర్ణయం పట్ల రియల్టర్ల ఉన్నత మండలి క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. గత రెండుమూడేళ్లుగా సవాళ్లను ఎదుర్కొంటున్న రియల్టీ రంగ సెంటిమెంట్‌ను ఈ నిర్ణయం బలపరుస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో రూ.30 లక్షల లోపు గృహ అమ్మకాలు పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా మెట్రోల విషయంలో 90 శాతం వరకూ రుణ విలువను రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షల పెంచాలని సైతం ఆయన విజ్ఞప్తి చేశారు. 2013లో ఏడు ప్రధాన నగరాల్లో దాదాపు 2 లక్షల గృహాలు అమ్ముడయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా పేర్కొంది. అయితే 2015లో ఈ సంఖ్య 1.75 లక్షలకు పడిపోయిందని సైతం పేర్కొంది.
రేటు కోతను బ్యాంకులు పూర్తిగా బదలాయిస్తాయ్: ఆర్‌బీఐ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ నుంచి అందిన రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు పూర్తి స్థాయిలో బదలాయిస్తాయన్న విశ్వాసాన్ని డిప్యూ టీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ గురువారం వ్యక్తం చేశారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో (ప్రస్తుతం 6.75 శాతం). ఈ ఏడాది కాలంలో ఈ రేటును ఆర్‌బీఐ 1.25 శాతం తగ్గించింది. అయితే దీనితో దాదాపు సగం ప్రయోజనాన్నే బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాయి.
దేశంలో అందరికీ బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించడంపై ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ‘రెపో ప్రయోజనం బదలాయింపు’ అంశాన్ని ఖాన్ ప్రస్తావించారు. దీనికి మరికొంత సమయం పడుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. చిన్న పొదుపులపై వడ్డీరేట్ల సమీక్ష గురించి ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్థిక కార్యదర్శి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రెపో బదలా యింపునకు జరుగుతున్న ఆలస్యంలో చిన్న పొదుపు రేట్లు కూడా ఒకటని ఆయన అన్నారు.