న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారులు పెరుగుతున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) 2019 మార్చి 31 నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 2,017 అని తెలిపారు. 2020 మార్చి 31 నాటికి ఈ సంఖ్య 2,208కి చేరినట్లు పేర్కొన్నారు. 2021 మార్చి 31నాటికి వీరి సంఖ్య మరింత పెరిగి 2,494కు చేరిందని తెలిపారు. ఎగవేతలకు సంబంధించి రుణ గ్రహీతలపైనే కాకుండా, గ్యారెంటార్లపై సైతం బ్యాంకింగ్ తగిన క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
2019–20లో రూ.1,75,876 కోట్ల రుణాలను ప్రభుత్వ బ్యాంకింగ్ రద్దు చేస్తే, 2020–21లో ఈ విలువ రూ.1,31,894 కోట్లకు తగ్గిందన్నారు. ఇక మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏ) 2021 మార్చి 31 నాటికి 9.11 శాతానికి తగ్గినట్లు తెలిపారు. 2015 మార్చి 31న ఈ రేటు 11.97 శాతంగా తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు మొండిబకాయిల తీవ్రత తగ్గడానికి కారణమన్నారు. బ్యాంకింగ్‌లో మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం 2021 మార్చి చివరి నాటికి వార్షికంగా రూ.61,180 కోట్లు తగ్గి రూ.8.34 లక్షల కోట్లకు దిగివచ్చినట్లు వివరించారు. 2020 మార్చి ముగింపునకు ఎన్‌పీఏల భారం రూ.8.96 లక్షల కోట్లని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment