banking ombudsman
-
బ్యాంకులపై పెరుగుతున్న ఫిర్యాదులు..!
న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంక్‌లపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆర్బీఐ నిర్వహిస్తున్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు బ్యాంకింగ్ సేవలపై ఈ ఏడాది వచ్చిన ఫిర్యాదులను బట్టి ఈ విషయం అర్థమవుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ... గతేడాదితో పోలిస్తే 2017-2018లో ఫిర్యాదుల్లో 25 శాతం పెరుగుదల ఉండవచ్చని ఆర్బీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లలో గుజరాత్ నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 93 శాతం పెరుగుదల నమోదైంది. 2014-2015లో 4,965 ఫిర్యాదులు రాగా, 2017-2018లో ఆ సంఖ్య 9,600కు చేరింది. కానీ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ నాలుగేళ్లలో పెరుగుదల కేవలం 7 శాతంగా ఉంది. వీటిలో ఏటీఎం కార్డుల సమస్యలపైనే ఎక్కువ మంది వినియోగదారులు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకులు విధిస్తున్న చార్జీలపై వస్తున్న ఫిర్యాదులు ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. అందులో ముఖ్యంగా మొబైల్, ఇంటర్నెట్ బ్యాకింగ్ వినియోగించేవారిపై చార్జీల బాదుడు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. -
బ్యాంకు లాకర్లు భద్రమేనా?
ఫైనాన్షియల్ బేసిక్స్ మీరు ఇంటికి సంబంధించిన విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర బాండ్లను బ్యాంకు లాకర్లలో దాచాలని నిర్ణయించుకున్నారా? అయితే కింది ఉదాహరణ ఒకసారి చూడండి. రవి చేసేది ప్రైవేట్ ఉద్యోగం. తను గతంలో దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను, ఇతర బాండ్లను, వస్తువులను ఒక బ్యాంకు లాకర్లో ఉంచాడు. ఒక రోజు ఉదయం అతనికి బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విషయం ఏంటంటే.. అతని లాకర్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోయాయి. రవి ఆదరాబాదరాగా బ్యాంకుకు వెళ్లాడు. ఎలా జరిగిందని బ్యాంకును అడిగితే తెలియలేదని సమాధానం. పైగా రవి లాకర్ ను సరిగా లాక్ చేయలేదని, అందువల్లే దొంగతనం జరిగి ఉండొచ్చని బ్యాంకు చెప్పింది. దీంతో రవి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ దగ్గరకు వెళ్లాడు. కస్టమర్ లాకర్‌ను సరిగా లాక్ చేసి వెళ్లాడా? లేదా? అనే విషయాన్నే సరిగా తెలుసుకోలేకపోయిందని, అది బ్యాంక్ తప్పేనని తేల్చింది. అలాగే రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. అక్కడ తీర్పు రవికి అనుకూలంగానే వచ్చినా.. దొంగతనం జరిగిన డబ్బులో కొంత మొత్తం మాత్రమే అతనికి తిరిగొచ్చింది. బ్యాంకు కర్తవ్య నిర్వహణ లోపం వల్ల రవి రూ.10 లక్షలు కోల్పోయాడు. ఈ ఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మీరు భవిష్యత్తులో లాకర్లను ఉపయోగించేటప్పుడు వాటిని సరిగా లాక్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. బ్యాంకు నుంచి తిరిగి వచ్చేటప్పుడు లాకర్ సరిగా లాక్ చేసి ఉందా? లేదా? అని సంబంధిత అధికారులను ఒకసారి చూడమని అడగండి. దీనికి బ్యాంకు అధికారులు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కానీ అడగడం వల్ల మనకు పోయేదేమీ లేదు కదా. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.. దొంగతనం కాకుండా బ్యాంకు లాకర్లలో అగ్నిప్రమాదం సంభవిస్తే.. లాకర్లోని వస్తువులకు డ్యామేజ్ జరిగితే.. అప్పుడు పరిస్థితేంటి? బ్యాంకు మీ సొమ్ముకు ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఎందుకంటే మీరు లాకర్లో ఏ వస్తువులు ఉంచారో బ్యాంకు తెలుసుకోదు. అంటే మీ వస్తువులకు బ్యాంకు హామీ ఇవ్వదు. -
బయటికి ‘అన్క్లెయిమ్లు’
ఖాతాలు వెల్లడించనున్న స్విస్ ప్రభుత్వం జ్యూరిచ్: నల్లధన ఖాతాలను వెల్లడిస్తున్న స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇక తమ దేశ బ్యాంకుల్లోని 60 ఏళ్లుగా క్లెయిమ్ చేయని విదేశీ ఖాతాల జాబితానూ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆ దేశ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ వెల్లడించింది. ఖాతా ప్రారంభించిన నాటినుంచి 10 ఏళ్లుగా బ్యాంకుతో సంబంధాలు నెరపక పోవడమే కాకుండా.. అరవై ఏళ్లుగా సంబంధిత మొత్తాలపై క్లెయిం చేయకుండా బ్యాంకులో మూలుగుతున్న నిధుల వివరాలు వెల్లడించేందుకు నిబంధనల ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు స్విస్‌బ్యాంకు అసోసియేషన్ (ఎస్బీఏ) తెలిపింది. ఇక భారత్ విషయానికి వస్తే 1955 నుంచీ ఇలాంటి ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాదారుల్లో అత్యధికులు అప్పటి రాజులు, రాజకుటుంబీకులు, సంస్థానాలకు చెందిన ధనవంతులకు చెందినవిగా చెప్తున్నారు. వ్యక్తిగతంగా ఆ ఖాతాదారు గానీ, వారి వారసులుగానీ వాటిపై హక్కులను, సాక్ష్యాలను చూపకపోవడంతో ఆ నిధులు బ్యాంకులో మూలుగుతున్నాయి. స్విస్‌లో రూపొందించిన కొత్త బ్యాంకింగు చట్టాల ప్రకారం కనీసం 500 స్విస్ ఫ్రాంకులతో మొదలైన ఖాతాపై ఎవరూ 10 ఏళ్లపాటు లావాదేవీలు జరపకుండా ఉంచినప్పుడు దాన్ని ‘అన్‌క్లెయిమ్’ ఖాతాగా గుర్తిస్తారు. అటువంటి జాబితాలను 50 ఏళ్లపాటు వేచి చూశాక విడుదల చేయాలి. న్యాయబద్ధ వారసులు వస్తే పరిశీలిస్తారు, లేకుంటే ఆ సంపదను స్విస్ కాన్ఫడరేషన్‌కు బదిలీ చేయడమో, లేక విలీనం చేయడమో తప్పనిసరి. ఇలా 2015 చివరికల్లా ఇలాంటి ఖాతాలను గుర్తించి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని అంబుడ్స్‌మన్ పేర్కొన్నారు. అయితే ఈ ఖాతాలను అక్రమ ఖాతాల కోణాల్లో పరిగణించాల్సిన అవసరం ఉండదు. హక్కుదారుగా రాకపోవడమో, వివాదాలు తేలకపోవడమో, లేకుంటే ఆ సమాచారం ఖాతాదారు నుంచి తమవారికి లేకపోవడం కారణం కావచ్చని స్విస్ బ్యాంకర్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
దేశీయ బ్యాంకులపై 3.70 లక్షల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో దేశీయ బ్యాంకులపై బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కు 3 లక్షల 70 వేల ఫిర్యాదులు అందినట్లు సమాచార హక్కు శాఖ(ఆర్టీఐ) తాజాగా వెల్లడించింది. ఇందులో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ)పై లక్షా రెండువేల ఫిర్యాదులు అందాయని తెలిపింది. 2009-2010 నుంచి 2013-2014 మధ్యకాలంలో బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కు 15 బ్యాంకులనుంచి 3,70,543 ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వరంగ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులపై 2013-2014 మధ్యకాలంలో 76573 ఫిర్యాదులందాయి. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్దదైన ఎస్ బీఐపై 21,206 ఫిర్యాదులందాయని ఆర్టీఐ తెలిపింది. ఫిర్యాదుల రేసులో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వెనుకబడి ఉంది. ప్రైవేట్ బ్యాంకుల్లో స్టాండర్డ్ అండ్ ఛార్టర్డ్ బ్యాంక్ పై రికార్డు స్థాయిలో 3357 ఫిర్యాదులు నమోదయ్యాయి. అంతేకాకుండా అతితక్కువ ఫిర్యాదుల జాబితాలో బీఎన్ పీ పరిబాస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్, జేపీ మోర్గాన్ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల జాబితాలో ఐసీఐసీఐపై రికార్డు స్థాయిలో 2013-2014 సంవత్సరానికిగాను 5325 ఫిర్యాదులందాయి. నేషనల్ బ్యాంక్ పై అతితక్కువగా 15 ఫిర్యాదులందాయి.