న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో దేశీయ బ్యాంకులపై బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కు 3 లక్షల 70 వేల ఫిర్యాదులు అందినట్లు సమాచార హక్కు శాఖ(ఆర్టీఐ) తాజాగా వెల్లడించింది. ఇందులో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ)పై లక్షా రెండువేల ఫిర్యాదులు అందాయని తెలిపింది. 2009-2010 నుంచి 2013-2014 మధ్యకాలంలో బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ కు 15 బ్యాంకులనుంచి 3,70,543 ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వరంగ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులపై 2013-2014 మధ్యకాలంలో 76573 ఫిర్యాదులందాయి.
అంతేకాకుండా దేశంలోనే అతిపెద్దదైన ఎస్ బీఐపై 21,206 ఫిర్యాదులందాయని ఆర్టీఐ తెలిపింది. ఫిర్యాదుల రేసులో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వెనుకబడి ఉంది. ప్రైవేట్ బ్యాంకుల్లో స్టాండర్డ్ అండ్ ఛార్టర్డ్ బ్యాంక్ పై రికార్డు స్థాయిలో 3357 ఫిర్యాదులు నమోదయ్యాయి. అంతేకాకుండా అతితక్కువ ఫిర్యాదుల జాబితాలో బీఎన్ పీ పరిబాస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్, జేపీ మోర్గాన్ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల జాబితాలో ఐసీఐసీఐపై రికార్డు స్థాయిలో 2013-2014 సంవత్సరానికిగాను 5325 ఫిర్యాదులందాయి. నేషనల్ బ్యాంక్ పై అతితక్కువగా 15 ఫిర్యాదులందాయి.