విజయ్‌మాల్యా దేశం విడిచి వెళ్లిపోయారు!
న్యూఢిల్లీ: బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. మాల్యా పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దివాళా తీసిన మాల్యా కంపెనీ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఈ బ్యాంకుల నుంచి రూ. 7,800 కోట్లు రుణాలు తీసుకొని.. వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టింది.
ఈ నేపథ్యంలో మాల్యా ఈ నెల 2న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. మాల్యా తీసుకున్న రుణాల కన్నా ఎక్కువ ఆస్తులే ఆయనకు విదేశాల్లో ఉన్నాయని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. బ్యాంకుల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు మాల్యాకు నోటీసులు జారీచేసేందుకు అనుమతి ఇచ్చింది. రాజ్యసభకు చెందిన అతని అధికారి ఈయిల్ ఐడీ, లండన్‌లోని భారత హైకమిషన్, అతని న్యాయవాదుల ద్వారా ఈ నోటీసుల పంపనున్నారు. మాల్యా పాస్‌పోర్ట్‌ను స్తంభింపజేయాలని, ఆయన స్వయంగా సుప్రీంకోర్టులో హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని బ్యాంకులు అభ్యర్థించాయి. వాదనల సందర్భంగా దివాళాదారుడైన మాల్యాకు ఎందుకు రుణాలు ఇచ్చారంటూ సుప్రీంకోర్టు బ్యాంకులను ప్రశ్నించిది. కాగా, ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వారినుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.