ఈ శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయ్
కొత్త కరెన్సీ నోట్లు నేటి నుంచే
నోట్ల మార్పిడికి మరిన్ని కేంద్రాలు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను మార్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పించింది. నోట్ల మార్పిడిలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా వచ్చే శని, ఆదివారాల్లోనూ (వాస్తవానికి రెండవ శనివారం బ్యాంకులకు సెలవు) బ్యాంకులు పనిచేసేలా ఆదేశాలు జారీచేసింది. ప్రజల తాకిడిని దృష్టిలో పెట్టుకొని వచ్చే శని, ఆదివారాల్లో బ్యాంకులు ఫుల్డే పనిచేసేలా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతోపాటు నేడు, రేపు (గురు, శుక్రవారాల్లోనూ) సాధారణం కంటే ఎక్కువ సమయం బ్యాంకులు పనిచేయాలని ఆదేశించింది.
అలాగే ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు రూ.500, రూ.వెయి నోట్లను మార్చుకునేందుకు మరికొన్ని ప్రాంతాలను పెంచింది. రైల్ టికెట్లు, హైవే - రోడ్ టోల్, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తో ప్రభుత్వ, ప్రైవేట్ ఫార్మసీలో మందులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, రైల్వే కేటరింగ్, పురావస్తు శాఖ చారిత్రక కట్టడాల ప్రవేశ టిక్కెట్ల కొనుగోలుకు కూడా పాత 500, వెయి నోట్లను వినియోగించవచ్చని తెలిపింది. తొలుత ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెట్లు, ప్రజా రవాణా, విమాన టికెట్ కౌంటర్లు, పాల కేంద్రాలు, శ్మశానాలు, పెట్రోల్ బంకుల వద్ద నోట్లను మార్చుకోవచ్చని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే.
బ్యాంకులకు కొత్త నోట్లు
పాత 500/1000 నోట్లను తొలగించి కొత్త నోట్లను పెట్టేందుకు బ్యాంకులు, ఏటీఎంలను బుధవారం మూసివేశారు. రిజర్వ్ బ్యాంక్ ట్రక్కుల కొద్దీ కొత్త నోట్లను దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు, పోస్టాఫీసులకు పంపిం దని, అన్ని బ్యాంకులు గురువారం పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. కొన్ని ఏటీఎంల నుంచి నగదును కూడా తీసుకోవచ్చన్నారు. పెద్ద నోట్లను పూర్తిస్థాయిలో మార్చేందుకు మరో 2-3 వారాల సమయం పడుతుందన్నారు. ‘ఏటీఎం కార్డు విత్‌డ్రాలపై రోజుకు రూ.2వేల పరిమితి ఉంటుంది.
అదే బ్యాంకు ఖాతా నుంచి అరుుతే రోజుకు రూ.10వేలు, వారానికి రూ.20 వేలు తీసుకోవచ్చు. ఈ పరిమితి కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. మరింత కరెన్సీ బ్యాంకింగ్ వ్యవస్థకు చేరితే అప్పుడు ఈ పరిమితిపై పునరాలోచన చేస్తాం’ అని చెప్పారు. నోట్ల మార్పిడి వల్ల దేశ ఎకానమీ విసృ్తతమవుతుందని, రెవెన్యూ మూలాలను కూడా పెంచుతుందన్నారు. నోట్ల మార్పిడి వల్ల తొలుత ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో భారీ ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు.