మారేడుపల్లి దాడి ఘటనపై.. సీసీఎస్ పోలీసుల విచారణ
మారేడుపల్లి : పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఆ సమయంలో మారేడుపల్లి స్టేషన్లో ఉన్న ఎస్ఐలు రవి, మధులను ఆరుగురు ఇన్స్పెక్టర్ల బృందం శనివారం పోలీస్‌స్టేషన్‌లో విచారించింది. గొడవకు ముందు, అనంతరం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనలో తన పొరపాటు లేదని, బన్నప్పపై తాము చేయిచేసుకోలేదని ఎస్సైలు వివరించారు.
ఇదిలాఉండగా దాడికి ముందు పోలీసులతో వివాదాలు ఉన్న వారి ఫొటోలతో పాటు, రాజీ కుదిర్చేందుకు వచ్చిన వారి ఫొటోలను, సీపీ కెమెరాల ఫుటేజ్‌తో అనుసంధానించి చూస్తున్నారు. దాడి సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎమ్మార్పీఎస్ డివిజన్ నేత సాయితో పాటు పలువురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. రాత్రి సమయంలో మరో పది మందిని పోలీసులు తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతుండగా, పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.
బలప్రయోగంతోనే మృతి.. మానవ హక్కుల వేదిక
సాక్షి,సిటీబ్యూరో : పోలీసుల బలప్రయోగంతోనే బన్నప్ప మృతిచెందినట్లు తమ నిజనిర్ధారణలో వెల్లడైందని మావన హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల ఆధీనంలో ఒక రాత్రి ఉండి అనుమానాస్పద స్థితిలో బన్నప్ప మృతి ఘటనపై జిల్లా జడ్డితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, గృహవసతి కల్పించాలని కోరారు.
పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారనే నెపంతో యువకులను, స్థానికులను అరెస్టు చేసి వేధింపులకు గురి చేయవద్దని వివరించారు. బోనాల సందర్భంగా మద్యం సేవించిన బన్నప్ప ఒక కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడనే చిన్న కారణంతో అదుపులోకి తీసుకొని పోలీసులు అతనిపై బలప్రయోగం చేయడం దారుణమని ఆరోపించారు. ఈ నిజనిర్ధారణ కమిటీలో హెచ్ఆర్ఎఫ్ సభ్యులు ఎ.కిషన్, రాజశేఖర్,గౌతం, సూర్యం ఉన్నారు.