ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటా విక్రయం!
న్యూఢిల్లీ: బారతీ ఎయిర్టెల్ కంపెనీ తన టవర్ల విభాగమైన భారతీ ఇన్ ఫ్రాటెల్లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ వాటా విక్రయంతో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్టెల్ యోచిస్తోందని సమాచారం. ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్కు 71.7 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో రుణ భారాన్ని తగ్గించుకోవాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాటా విక్రయ వార్తలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్రతినిధి నిరాకరించారు. కాగా గత ఏడాది డిసెంబర్ నాటికి ఎయిర్టెల్ నికర రుణభారం రూ.78,816 కోట్లుగా ఉంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రంగంలోకి వస్తుండటంతో ఎయిర్టెల్ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది.