Basavatarakam Indo American Cancer Hospital & Research Institute
-
కన్న ఒడి.. కన్నీటి తడి!
సాక్షి, హైదరాబాద్: జీవన సంధ్యాసమయంలో పేగు బంధం తల్లడిల్లలేదు. వృద్ధాప్యంలో ఒంటరి బతుక్కు ఊతమవ్వలేదు. చిన్నప్పుడు చంటి పాపలను కంటిపాపలుగా చూసిన ఆ కళ్లు చెమ్మగిల్లితే తుడవనూలేదు. చేయి పట్టి నడిపించిన ఆ చేతులను చేరదీయలేదు. బుక్కెడు బువ్వ పెట్టి కడుపు నింపేవారే దూరంగా వెళ్లిపోయారు. బిడ్డలను నమ్ముకున్న ఆ తల్లులకు చివరికి కన్నీరే మిగిల్చారు. రెక్కలొచ్చి ఎక్కడికో వెళ్లిపోయారు. రెక్కలు అలసి ఆ మాతృమూర్తులు ఒంటరి వారయ్యారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్డునంబర్– 10లోని ఫుట్‌పాతే ఇద్దరు అమ్మలకు ఆశ్రయంగా మారిన వ్యథార్థ జీవన యథార్థ గాథ ఇది. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద కేబీఆర్ పార్కును ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌పై ఇద్దరు ‘అమ్మ’లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కష్టాల పాలవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దొడుకొండపల్లికి చెందిన కాశమ్మ (60)కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఆమె కుటుంబం 25 ఏళ్ల క్రితమే బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చింది. కూలిపనులు చేస్తుండేవారు. కొన్నేళ్ల కిందట కాశమ్మ భర్త చనిపోయరు. కుమారులు, కుమార్తెకు వివాహాలయ్యాయి. వేర్వేరుగా బతుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మొదటి దశ కరోనా సమయంలోనే పనులు లేక తలోదారి పట్టారు. కొడుకులిద్దరూ తల్లిని వదిలేసి వెళ్లిపోయా రు. కాశమ్మ ఒంటరిదైంది. కూతురు కూడా చూసే పరిస్థితి లేదు. ఒంటరిగా మారిన కాశమ్మ ఫుట్‌పాత్‌నే ఆశ్రయంగా చేసుకుంది. దారిన పోయేవారు ఇంత తిండిపెడితే కడుపు నింపుకొంటోంది. వెంకమ్మది మరో దీనగాథ.. నెల్లూరు జిల్లా మొల్కురుకు చెందిన వెంకమ్మ (60)కి ఓ కుమారుడున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నం.10లోని సింగాడికుంటలో ఉంటున్నాడు. కరోనా కష్టకాలంలో కొడుకును చూద్దామని వెంకమ్మ నగరానికి ఇటీవల వచ్చింది. తమకే కడుపుకింత తిండిలేక సతమతమవుతున్నామని నువ్వు మాకు భారమంటూ కొడుకు ముఖం మీదే చెప్పి పంపించాడు. వెళ్లడానికి దారి ఖర్చులు లేకపోవడంతో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద అన్నం పెడుతున్నారంటే వచ్చింది. ఇక ఇక్కడే ఆశ్రయం ఏర్పాటు చేసుకుంది. కాశమ్మతో పాటు తనూ ఉంటోంది. తమ కష్టాలు పంచుకుంటున్నారు. కాగా.. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై సుమారు 150 మంది వరకు నిరాశ్రయులు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరైనా ఇంత తిండిపెడితేనే వీరి కడుపు నింపుకొంటున్నారు. ఆదుకోని నైట్‌షెల్లర్లు జీహెచ్ఎంసీ సర్కిల్– 18 పరిధి కిందకు వచ్చే ఈ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ఫుట్‌పాత్‌లపై ఆశ్రయం పొందుతున్నారు. రాత్రిపూట వీటిపైనే నిద్రిస్తున్నారు. ఎవరైనా ఇంత అన్నం పెడితే తింటూ కాలం గడుపుతున్నారు. కనీసం వృద్ధులనైనా నైట్ షెల్టర్లలోకి చేర్చాల్సిన బాధ్యతను అధికారులు మర్చిపోయారు. – బంజారాహిల్స్ -
‘ఇద్దరు చంద్రులు ఎన్టీఆర్ శిష్యులే’
సాక్షి, హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరు చంద్రలు దివంగత నేత ఎన్టీఆర్ శిష్యులే అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ అన్నారు. కేన్సర్‌కు ఎవ్వరూ బయపడకండి.. అందరికి బసవతారం ఆస్పత్రి అండగా ఉంటుందని పేర్కొన్నారు. బసవతారం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ 18వ వారికోత్సవ వేడుకోలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ కవిత, ఆసుపత్రి చైర్మన్, హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రియ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు ఎంపీ కవిత, బాలయ్య బాబు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అంతేకాక బసవతారకం హాస్పిటల్లో చికిత్స పొంది క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డ రోగులకు బాలకృష్ణ, కవితలు సన్మాసం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. తాను ఏ పని చేయాలన్న నాన్నగారు ఆదర్శమన్నారు. ‘మా అమ్మ కేన్సర్ వ్యాధితో మరణించారు. ఆమె కోరిక మేరకు నాన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. 40 పడకలతో మొదలైన హాస్పిటల్ నేడు 500 పడకలకు ఎదిగింది. క్యాన్సర్ వ్యాధితో కంటే.. వాళ్లు భయంతోనే సగం మంది మరణిస్తున్నారు. కానీ, వైద్యులు చూపే ప్రేమకే సగం క్యాన్సర్ పోతోంది. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్ ఒక విజన్‌తో ఆస్పత్రి స్థాపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రి ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. మహిళల కోసం హాస్పిటల్లో స్వీర్నింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. సమాజంలో క్యాన్సర్‌ని ఎదురించి గెలిచిన ప్రతి ఆడబిడ్డకు మా అమ్మ ఆశీర్వాదం ఉందని నేను అనుకుంటాను. కేన్సర్‌తో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ఆయన అన్నారు. కేన్సర్‌ను ఎదుర్కొనడానికి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఎంపీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ‘బోధకాళ్ల వ్యాధులకు పెన్షన్స్, రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు ఏడున్నర లక్షలమంది క్యాన్సర్ బారిన పడటం బాధాకరం. కేన్సర్ కోసం హైదరాబాద్‌లో ఎంఎంజే ఆస్పత్రి మినహా జిల్లాలో అందుబాటులో లేవు. ప్రతి ఒక్కరు కేన్సర్‌పై పరీక్షలు చేయించుకోవాలి. కేన్సర్‌పై మెరుగైన వసతుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో అన్ని ట్రస్ట్ బోర్డులకు టాక్స్ మినహాయింపు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్టీఆర్ ప్రజల కోసం చిన్న ఆస్పత్రి ప్రారంభిస్తే.. బాలకృష్ణ దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా. బసవతారకం భవిష్యత్‌లో శాటిలైట్ సెంటర్స్ ప్రారంభిస్తే నిజామాబాద్‌కి రావాలని బాలకృష్ణను’ ఎంపీ కవిత కోరారు. బసవతారకం ఆస్పత్రి వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని హీరోయిన్ శ్రియ అన్నారు. కేన్సర్ అనేది భయంకరమైన వ్యాధి. అంతేకాక ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంతో మందికి ఈ ఆస్పత్రి పునర్జన్మ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. భయంకరమైన వ్యాధిని ఎదుర్కొవాలంటే ఈ విధమైన ఆస్పత్రులు ఇంకా రావాలని నటి శ్రియ అన్నారు. బసతారకం ఆస్పత్రి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. సంకల్ప బలం అద్భుతంగా ఉన్న ఒక శక్తి దివంగత నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయనకు ప్రజల పట్ల ఉన్న బాధ్యతనే ఈ బసవతారకం అని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను బాలకృష్ణ కాపాడుతున్నారని, ఆసియాలోనే నంబర్ వన్ ఆస్పత్రి బసవతారకమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. -
'లెజెండ్' చిత్రంలోని హార్లే డెవిడ్సన్ బైక్ వేలం!
హైదరాబాద్: లెజెండ్ చిత్రంలో బాలకృష్ణ ఉపయోగించిన హార్లే డేవిడ్సన్ బైక్ ను వేలానికి పెట్టనున్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి వినియోగించనున్నారు. బైక్ వేలంలో వచ్చిన సొమ్ము పేదవారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేలాన్ని లెజెండ్ చిత్ర విడుదలకు ముందే నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో బాలకృష్ణ కోసం ఆరెంజ్ కలర్ హార్లే డేవిడ్సన్ బైక్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. జగపతిబాబు, రాధిక ఆంప్టే, సోనాల్ చౌహన్ లు నటించిన లెజెండ్ చిత్రం మార్చి 28 తేది శుక్రవారం విడుదలకు సిద్దమవుతోంది. బాలకృష్ణకు 'సింహ' లాంటి సూపర్ హిట్ అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు.