సాక్షి, హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరు చంద్రలు దివంగత నేత ఎన్టీఆర్ శిష్యులే అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ అన్నారు. కేన్సర్‌కు ఎవ్వరూ బయపడకండి.. అందరికి బసవతారం ఆస్పత్రి అండగా ఉంటుందని పేర్కొన్నారు. బసవతారం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ 18వ వారికోత్సవ వేడుకోలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ కవిత, ఆసుపత్రి చైర్మన్, హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రియ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు ఎంపీ కవిత, బాలయ్య బాబు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అంతేకాక బసవతారకం హాస్పిటల్‌లో చికిత్స పొంది క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డ రోగులకు బాలకృష్ణ, కవితలు సన్మాసం చేశారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. తాను ఏ పని చేయాలన్న నాన్నగారు ఆదర్శమన్నారు. ‘మా అమ్మ కేన్సర్ వ్యాధితో మరణించారు. ఆమె కోరిక మేరకు నాన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. 40 పడకలతో మొదలైన హాస్పిటల్ నేడు 500 పడకలకు ఎదిగింది. క్యాన్సర్ వ్యాధితో కంటే.. వాళ్లు భయంతోనే సగం మంది మరణిస్తున్నారు. కానీ, వైద్యులు చూపే ప్రేమకే సగం క్యాన్సర్ పోతోంది. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్ ఒక విజన్‌తో ఆస్పత్రి స్థాపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రి ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. మహిళల కోసం హాస్పిటల్‌లో స్వీర్నింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. సమాజంలో క్యాన్సర్‌ని ఎదురించి గెలిచిన ప్రతి ఆడబిడ్డకు మా అమ్మ ఆశీర్వాదం ఉందని నేను అనుకుంటాను. కేన్సర్‌తో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ఆయన అన్నారు.
కేన్సర్‌ను ఎదుర్కొనడానికి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఎంపీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ‘బోధకాళ్ల వ్యాధులకు పెన్షన్స్, రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు ఏడున్నర లక్షలమంది క్యాన్సర్ బారిన పడటం బాధాకరం. కేన్సర్ కోసం హైదరాబాద్‌లో ఎంఎంజే ఆస్పత్రి మినహా జిల్లాలో అందుబాటులో లేవు. ప్రతి ఒక్కరు కేన్సర్‌పై పరీక్షలు చేయించుకోవాలి. కేన్సర్‌పై మెరుగైన వసతుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో అన్ని ట్రస్ట్ బోర్డులకు టాక్స్ మినహాయింపు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్టీఆర్ ప్రజల కోసం చిన్న ఆస్పత్రి ప్రారంభిస్తే.. బాలకృష్ణ దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా. బసవతారకం భవిష్యత్‌లో శాటిలైట్ సెంటర్స్ ప్రారంభిస్తే నిజామాబాద్‌కి రావాలని బాలకృష్ణను’ ఎంపీ కవిత కోరారు.
బసవతారకం ఆస్పత్రి వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని హీరోయిన్ శ్రియ అన్నారు. కేన్సర్ అనేది భయంకరమైన వ్యాధి. అంతేకాక ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంతో మందికి ఈ ఆస్పత్రి పునర్జన్మ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. భయంకరమైన వ్యాధిని ఎదుర్కొవాలంటే ఈ విధమైన ఆస్పత్రులు ఇంకా రావాలని నటి శ్రియ అన్నారు.
బసతారకం ఆస్పత్రి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. సంకల్ప బలం అద్భుతంగా ఉన్న ఒక శక్తి దివంగత నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయనకు ప్రజల పట్ల ఉన్న బాధ్యతనే ఈ బసవతారకం అని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను బాలకృష్ణ కాపాడుతున్నారని, ఆసియాలోనే నంబర్ వన్ ఆస్పత్రి బసవతారకమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment