basket ball championship
-
తెలంగాణ నుంచి ముగ్గురు బాస్కెట్ బాల్ ప్లేయర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ముగ్గురు యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారులకు మంచి అవకాశం లభించింది. రాష్ట్రానికి చెందిన కె. గౌతమ్, కార్తీక్ చద్దా, జి. ప్రతీక్ జాతీయ బాస్కెట్‌బాల్ కోచింగ్ క్యాంపునకు ఎంపికయ్యారు. బెంగళూరులోని జయప్రకాశ్ నారాయణ్ జాతీయ యూత్ సెంటర్ బాస్కెట్‌బాల్ అకాడమీలో ఈనెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు జాతీయ బాస్కెట్‌బాల్ క్యాంపు జరుగుతుంది. ఏప్రిల్ 5 నుంచి 12 వరకు జరుగనున్న ‘ఫిబా’ అండర్–16 ఆసియా పురుషుల చాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా ఈ జాతీయ క్యాంపును నిర్వహిస్తున్నారు. -
బాస్కెట్‌బాల్ జాతీయ శిబిరానికి కార్తీక్
హైదరాబాద్: ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఖాజాగూడ) విద్యార్థి కార్తీక్ చద్దా జాతీయ బాస్కెట్‌బాల్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. గత నెలలో జరిగిన అండర్–16 బాస్కెట్‌బాల్ సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచిన కార్తీక్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. బెంగళూరులో జరుగనున్న ఈ శిబిరానికి కార్తీక్‌తో పాటు మరో 24 మంది ఎంపికయ్యారు. ఈ శిబిరంలో మెరుగైన ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులకు జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. బంగ్లాదేశ్‌లో జూలై 3 నుంచి 7 వరకు జరుగనున్న దక్షిణాసియా బాస్కెట్‌బాల్ అండర్–16 క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ జట్టు పాల్గొంటుంది. ప్రస్తుతం ఓక్రిడ్జ్ స్కూల్లో పదో తరగతి చదువుతోన్న కార్తీక్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ డేవిడ్ రాజ్‌కుమార్ పర్యవేక్షణలో కోచ్‌లు కిశోర్, శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో బాస్కెట్‌బాల్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా డేవిడ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ శిక్షణా శిబిరంలో రాణించి కార్తీక్ జాతీయ అండర్–16 జట్టుకు ఎంపికవుతాడని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. -
రాణించిన తెలంగాణ జట్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ లెవల్–1 స్థాయిలో ఆశించిన మేరకు రాణించలేకపోయిన తెలంగాణ బాలబాలికల జట్లు లెవల్–2 కేటగిరీలో ఫైనల్‌కు చేరుకున్నాయి. కోయంబత్తూర్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ఆదివారం ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ తెలంగాణ జట్లు విజయం సాధించి ముందంజ వేశాయి. 15, 16 స్థానాల కోసం జరిగే ఈ ఫైనల్లో విజయం సాధించిన జట్టు... వచ్చే ఏడాది జరుగనున్న ఇదే టోర్నీలో లెవల్–2 కేటగిరీ గ్రూప్ ‘సి’లో సీడెడ్ జట్టుగా బరిలోకి దిగుతుంది. మొదట బాలుర విభాగంలో జరిగిన లూజర్స్ నాకౌట్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ 66–38తో హిమాచల్‌ప్రదేశ్ జట్టుపై గెలుపొందింది. విజేత జట్టు తరఫున కార్తీక్ 12 పాయింట్లు, గౌతమ్ 10 పాయింట్లు, జాసిమ్ 8 పాయింట్లు సాధించారు. హిమాచల్‌ప్రదేశ్ జట్టులో శర్మ 18 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. నేగి 12 పాయింట్లతో శర్మకు చక్కని సహకారం అందించాడు. అనంతరం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ 62–41తో ఉత్తరాఖండ్‌ను ఓడించింది. ఖాజావలీ (24 పాయింట్లు), గౌతమ్ (12 పాయింట్లు) జాసిమ్ (11 పాయింట్లు) వేగంగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి తెలంగాణ 30–18 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం ఉత్తరాఖండ్ వ్యూహాత్మకంగా ఆడుతూ కొన్ని పాయింట్లు సంపాదించినా జట్టు గెలిచేందుకు అవి సరిపోలేదు. దీంతో తెలంగాణ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. ఉత్తరాఖండ్ తరఫున వినాయక్ (13), చనుహాన్ (13) మెరుగ్గా ఆడారు. బాలికల విభాగంలోనూ తెలంగాణ ఆధిపత్యం కొనసాగింది. మొదట క్వార్టర్స్ మ్యాచ్‌లో తెలంగాణ 61–56తో హిమాచల్‌ప్రదేశ్‌పై విజయం సాధించింది. ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా పోరాడటంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి స్కోరు 25–25తో సమమైంది. రెండో సగభాగంలోనూ హోరాహోరీగా ఇరుజట్లు తలపడ్డాయి. కీలక సమయంలో రాణించిన తెలంగాణ జట్టు స్వల్ప ఆధిక్యంతో గెలుపును అందుకుంది. విజేత జట్టులో సిద్ధిక (18) తన అద్భుత ప్రదర్శనను కొనసాగించగా... హర్షిత (14), మోహన (8), స్వాతి (7) దూకుడు కనబరిచారు. ప్రత్యర్థి జట్టులో కుమారి (19), ఆశ్రిత (14), నేగి (13) పోరాడారు. సెమీఫైనల్లో తెలంగాణ 53–50తో బిహార్‌పై నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తెలంగాణ ప్లేయర్లు ఓజస్వి (14), నిత్య (13), హర్షిత (13) సత్తా చాటారు. బిహార్ తరఫున ముస్కాన్ (26) చెలరేగింది. -
తెలంగాణ బాలికలు ముందంజ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో తెలంగాణ బాలికల జట్టు ముందంజ వేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో బుధవారం జరిగిన పోరులో తెలంగాణ 43–7తో ఉత్తరాఖండ్‌పై విజయం సాధించింది. చిరుజల్లుల వల్ల కాస్త ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తెలంగాణ బాలికల జట్టు ఆరంభం నుంచి ప్రత్యర్ధిపై ఆధిపత్యం చెలాయించింది. చివరిదాకా కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయం దక్కించుకుంది. తెలంగాణ తరఫున భువనేశ్వరి (9), రాగమయి (8), గౌతమి (6), జాయిసీ (6) మెరుగైన ప్రదర్శన కనబరిచారు. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సత్తా చాటిన తెలంగాణ బాలికల ప్రదర్శనపై రాష్ట్ర బాస్కెట్‌బాల్ సమాఖ్య కార్యదర్శి నార్మన్ ఐజాక్ హర్షం వ్యక్తం చేశారు. -
ఫైనల్లో హైదరాబాద్, రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్, రంగారెడ్డి బాలబాలికల జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. సికింద్రాబాద్‌లోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ వేదికగా ఆదివారం జరిగిన బాలుర సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 36–9తో మహబూబ్‌నగర్‌ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజేత జట్టులో రిత్విక్ (8), సంహిత్ (5), శ్రవణ్ (4) ఆకట్టుకున్నారు. మహబూబ్‌నగర్ తరఫున రోహిత్ (4), హేమంత్ (3) పాయింట్లు సాధించారు. మరో సెమీస్‌లో రంగారెడ్డి జట్టు 43–38తో కరీంనగర్‌పై గెలుపొందింది. తొలి అర్ధభాగంలో 16–20తో వెనుకబడిన రంగారెడ్డి రెండో అర్ధభాగంలో పుంజుకుంది. నాగార్జున (18), భరత్ (10), సుజిత్ (7)చెలరేగడంతో విజయాన్ని అందుకుంది. కరీంనగర్ తరఫున ప్రవీణ్ (15), పవన్ (10) సత్తా చాటారు. బాలికల విభాగంలోనూ హైదరాబాద్, రంగారెడ్డి జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. తొలి సెమీఫైనల్లో హైదరాబాద్ 57–32తో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించింది. రుచి (15), హిత (8), రాగమయి (6), గుణశ్రీ (6) రాణించడంతో తొలి అర్ధభాగాన్ని హైదరాబాద్ 25–14తో ముగించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి గెలిచింది. మహబూబ్‌నగర్ తరఫున తనూజ (10), భువనేశ్వరి (8), శ్రీవల్లిక (6) రాణించారు. రెండో సెమీఫైనల్లో రంగారెడ్డి 55–17తో కరీంనగర్‌ను ఓడించింది. విజేత జట్టు తరఫున లాస్య (16), జాహ్నవి (12) ఆకట్టు కోగా... కరీంనగర్ జట్టులో రేణుక (9) పోరాట పటిమ ప్రదర్శించింది. -
తెలంగాణ వారియర్స్‌కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆల్‌స్టార్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ వారియర్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సీనియర్ బాలికల విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన తుదిపోరులో తెలంగాణ వారియర్స్ 37–30తో చాలెంజర్స్ జట్టుపై గెలుపొందింది. సీనియర్ బాలుర విభాగంలో నవాబ్స్ జట్టు విజేతగా నిలిచింది. టైటిల్‌పోరులో నవాబ్స్ 65–42తో శాతవనస్పై నెగ్గింది. జూనియర్ బాలబాలికల విభాగాల్లో బుల్స్, హాక్స్ జట్లు టైటిళ్లను గెలుచుకున్నాయి. జూనియర్ బాలుర ఫైనల్లో బుల్స్ జట్టు 36–24తో వోల్వ్స్ జట్టుపై, బాలికల టైటిల్‌పోరులో హాక్స్ జట్టు 61–39తో లయన్స్ జట్టుపై అలవోకగా గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం కోశాధికారి ప్రేమ్ సోలోమన్ పాల్గొన్నారు. -
హాక్స్పై బుల్స్ గెలిచింది
సాక్షి, హైదరాబాద్: ఆల్‌స్టార్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బుల్స్ జట్టు సత్తా చాటింది. వైఎంసీఏ గ్రౌండ్లో బుధవారం జూనియర్ బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌లో 66–61 పాయింట్ల తేడాతో హాక్స్పై విజయం సాధించింది. బుల్స్ తరఫున విఘ్నేశ్ 33 పాయింట్లు, నితీశ్ 14 పాయింట్లు సాధించగా.. హాక్స్ జట్టు తరఫున రిత్విక్ 16 పాయింట్లు, అభినవ్ 10 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో లయన్స్‌పై 41–34 తేడాతో వోల్వ్స్ గెలుపొందింది. వోల్వ్స్ తరఫున అమన్ 17, సౌరవ్ 12 పాయింట్లు సాధించగా... లయన్స్ జట్టులో ఆయూష్ 10, మాజిద్ 8 పాయింట్లు చేశారు. -
తెలంగాణ విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టుకు ఊరట విజయం దక్కింది. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో లెవల్–2 ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ జట్టు 79–69తో అస్సాం జట్టుపై విజయం సాధించింది. తెలంగాణ తరఫున వినయ్ కొఠారి, రితిక్ చెరో 16 పాయింట్లతో చెలరేగగా అమన్, విఘ్నేశ్వర్ ఉపాధ్యాయ్ చెరో 13 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టులో సలేవ్ (21), సంజయ్ బాల్మీకి (19), శివమ్ సునర్ (12) రాణించారు. మెయిన్ డ్రా నుంచి ఎలిమినేట్ అయిన జట్లు లెవల్–2 విభాగంలో ఆడతాయి. -
రన్నరప్ తెలంగాణ
పుదుచ్చేరి: సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ రైల్వేస్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన తెలంగాణ మహిళల జట్టు తుది పోరులో మాత్రం తడబడింది. జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇక్కడ జరిగిన ఫైనల్లో తెలంగాణ 59-68తో కేరళ జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. తెలంగాణ తరఫున ఎం.గాయత్రి 16 పారుుంట్లు సాధించగా... విజేత జట్టు తరఫున పి.ఎస్. జీనా 20 పారుుంట్లు చేసింది. పురుషుల ఈవెంట్లో ఉత్తరాఖండ్ 68-60తో తమిళనాడుపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఇందులో పుదుచ్చేరి సీఎం వి. గవే పాల్గొన్నారు. -
విజేత సనత్‌నగర్ క్లబ్
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో సనత్‌నగర్ క్లబ్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో గురువారం జరిగిన ఫైనల్లో సనత్‌నగర్ క్లబ్ 91-76తో ఎన్పీఏ జట్టుపై విజయం సాధించింది. సికింద్రాబాద్ వైఎంసీఏ మైదానంలో ఫైనల్ పోరు ఆసక్తిక రంగా సాగింది. ప్రారంభంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ అర్ధభాగం ముగిసేసరికి 39-37తో సనత్‌నగర్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శివతేజ మరింత దూకుడు పెంచడంతో విజయం సనత్‌నగర్ వశమైంది. సనత్‌నగర్ తరఫున శివతేజ (40), నిఖిల్ (16), నవీద్ (13) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎన్పీఏ జట్టులో రాహుల్ (31), వాసు (16), రవీన్ (11) పోరాడారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించిన రాహుల్, నిఖిల్‌లకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ పురస్కారాలు దక్కాయి.