Bathukamma flowers
-
సీతమ్మజెడల పూల.. సిరుల వర్షం: ఎకరాకు 80 వేల నుంచి లక్ష దాకా ఆదాయం
Bathukamma- Seethamma Jada Flowers- మంచిర్యాల అగ్రికల్చర్: జిల్లాలో సీతమ్మ జెడల పూల సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. బతుకమ్మ పండుగ సీజన్లో దిగుబడితో లాభం చేకూరుతోంది. పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటల సాగు తగ్గిస్తూ పూలసాగుపై దృష్టి సారించడంతో విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. బతుకమ్మ తయారీలో విని యోగించే తంగేడు పూలతోపాటు సీతమ్మ జెడ పూలకు మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బతుకమ్మ పేర్చడానికి ఆకర్షణీయంగా ఉంటుందని విని యోగిస్తారు. చూడడానికి గుబురుగా, దట్టంగా, ఆకట్టుకునే గులాబీ, నారింజ రంగుల్లో కనువిందు చేస్తాయి. సీజన్లో ధర ఎక్కువగా ఉన్నా బతుకమ్మను పేర్చడానికి వెనుకడుగు వేయరు. సద్దుల బతుకమ్మ ముందు నుంచి సీతమ్మ పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కిలోపూలకు రూ.100 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇవ్వడంతో మహిళలు అధిక సంఖ్యలో పేరుస్తున్నారు. దీంతో పూలకు డిమాండ్ ఏర్పడింది. పెరిగిన సాగు జిల్లాలో సీతమ్మ(సీతమ్మ జెడ) సాగు గతేడాది 60 ఎకరాల వరకు ఉండగా.. ఈ ఏడాది 120 ఎకరాల వరకు పెరిగింది. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వె ళ్లే దారి పక్కనే ఉన్న గ్రామాల్లో సీతమ్మ పూల సాగు కనిపిస్తోంది. లక్సెట్టిపేట, హాజీపూర్, కన్నెపల్లి, బె ల్లంపల్లి, భీమిని, జైపూర్, చెన్నూర్ మండలాల్లో సా గు చేస్తున్నారు. తులం విత్తనం రూ.500కు కొనుగోలు చేసి విత్తుకున్నారు. రెండుమార్లు ఎరువులతోపా టు చీడపీడలు వ్యాప్తి చెందకుండా క్రిమిసంహారక మందులు పిచికారీచేశారు. జూలైలో విత్తుకున్న పంట పూతకు వచ్చింది. రెండు నుంచి మూడు తడుల నీటితో 70 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెడుతుండగా.. 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. గత ఏడాది ఎకరం సాగు చేసిన రైతులు రూ.80 వేల నుంచి రూ. లక్ష రూపాయల వరకు ఆదాయం పొందారు. కొన్ని చోట్ల రైతులు పత్తిలో అంతరపంటగానూ సీతమ్మ జెడ పూల సాగు చేస్తున్నారు. చేను వద్దే విక్రయాలు.. కొందరు వ్యాపారులు ముందస్తుగానే సద్దుల బతుకమ్మ పండగ కోసం 20రోజుల ముందు నుంచే చేను వద్దకు వెళ్లి అడ్వాన్స్ ఇస్తున్నారు. గుత్త లెక్కన ఒ ప్పందం చేసుకుని డబ్బులు చెల్లిస్తున్నారు. ఒక్కో సా లుకు దూరాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.3,000 వేల వరకు రైతులు విక్రయిస్తున్నారు. పూలతోనే అందం బతకమ్మ పేర్చడానికి తంగెడుపూలు ఎంతో ప్రత్యేకం కాగా.. అలంకరణతో సీతమ్మజెడల పూలుకూడా ఎంతో అందాన్ని ఇస్తుంది. ఇతర పూలు ఎన్ని ఉన్నా సీతమ్మ పూలు ఆకర్శణీయంగా ఉంటాయి.పండుగ సమయంలో ధర ఎక్కువైనా సీతమ్మ పూలు తప్పనిసరి కొనుగోలు చేసి బతకమ్మను పేర్చుకుంటాం. – బీమరాజుల సరిత, మంచిర్యాల చదవండి: Sagubadi: కాసుల పంట డ్రాగన్! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా! బతుకమ్మ ప్రత్యేకం.. బంతి, చామంతి, గునుగు, లిల్లీ, పట్టుకుచ్చులకు భలే గిరాకీ... -
Bathukamma: పూలకి పండగ
బతుకమ్మ పండుగ పకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. బాలారిష్టాలు, కలరా, మలేరియా, ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను, కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మా అని ప్రజలు ప్రకృతి గౌరీని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ. తెలంగాణ పల్లెల్లోని ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఊరంతా ఒకటయ్యి తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది. అయితే నేటి కాలంలో బతుకమ్మ పండుగ గొప్పతనం ఎల్లలు దాటి దేశ విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మంచి వర్షాలతో వరుణ దేవుడు అనుగ్రహించి అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతు జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూనే యువతులు ముత్తైదువులు రంగు రంగు పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది అందులో గౌరమ్మను పెట్టి పూజించి ఊరంతా ఒక్క చోట గుమిగూడి పల్లె ప్రజల జీవితాలను కష్ట సుఖాలను పాటల రూపంలో ప్రకృతి గౌరికి విన్నవించుకుంటారు. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. -
బతుకమ్మ పూల కోసం వెళ్లిన మహిళ హత్య
భువనగిరి: బతుకమ్మ పూల కోసం గ్రామ శివారులో చేలలోకి వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురయింది. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల నరసమ్మ(66) శుక్రవారం మధ్యాహ్నం మరో మహిళతో కలసి గ్రామ శివారులోని చేలలోకి వెళ్లింది. రాత్రయినా ఆమె తిరిగి రాకపోయేసరికి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి వెతుకులాట ప్రారంభించారు. చివరికి గ్రామ శివారులోని కందిచేనులో ఆమె మృతదేహం కనుగొన్నారు. గుర్తు తెలియని దుండగులు ఆమె తలపై కొట్టి, మెడలోని మూడున్నర తులాల పుస్తెల తాడుతోపాటు 5 తులాల వెండి కడియాలను దోచుకున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. బాగా తెలిసిన వారే నరసమ్మను నగల కోసం దారుణంగా చంపారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.