Bathukamma Saree
-
సంక్షేమ బాట వదిలేది లేదు
సాక్షి, గజ్వేల్/సిద్దిపేట : ఆర్థిక మాంద్యం కారణంగా చూపి కేంద్రం రాష్ట్రానికిచ్చే నిధుల్లో కోతల మీద కోతలు పెడుతున్నా... రాష్ట్ర బడ్జెట్ గతంతో పోలిస్తే లోటు ఏర్పడినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సంక్షేమానికి నిధులు తగ్గించవద్దనే స్పష్టమైన వైఖరితో ఉన్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, మర్కూక్ మండలాల మహిళలకు, సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ పేదల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాల నిధుల విడుదలలో ఢోకా ఉండదన్నారు. ‘రైతుబంధు’కు సంబంధించిన డబ్బులు పూర్తిగా విడుదల చేస్తామన్నారు. సీఎం దూరదృష్టి కారణంగా రాష్ట్రంలో ‘మిషన్ భగీరథ’ పథకం పూర్తయి మంచి ఫలితాలనిస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు టీఆర్ఎస్ పథకాలతో మనసున పడ్తలేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆదరణ కరువై కేసీఆర్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. చెరువుల్లో నీళ్లు లేక బతుకమ్మను జరుపుకోవడం ఇదే చివరిదని... వచ్చే ఏడాది కాళేశ్వరం జలాలతో నిరంతరం కళకళలాడుతూ ఉంటాయని చెప్పారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంలో మహిళల ముఖాల్లో వెలుగులు నింపడానికి చీరెల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం నీళ్లు వస్తే రైతుల జీవితాల్లో గొప్ప మార్పు రానుందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రోజారాధాకృష్ణశర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలపై అభిమానంతో ఏటా బతుకమ్మ సందర్భంగా చీరలు పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమమని అభివర్ణించారు. పండుగ సందర్భంలో మహిళలకు కొత్త చీరలు ఆనందాన్నిస్తాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ దాసరి అమరావతి, పంగ మల్లేశం ఎంపీపీలు, జెడ్పీటీసీ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే: హరీష్
సాక్షి, సిద్దిపేట : ఎన్ని జన్మలెత్తినా సిద్దిపేట ప్రజల రుణం తీర్చుకోలేనిదని, తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తన జన్మ ఉన్నంత వరకు ప్రజల కోసమే పని చేస్తానని హమీ ఇచ్చారు. బుధవారం సిద్దిపేటలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి స్థానంలో లక్ష మెజారిటీతో గెలిపించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘనత సిద్దిపేట ప్రజలది, కార్యకర్తలదని అన్నారు. ‘ఎవరైనా మంచి నాయకుడు ఉన్నారనుకుంటారు, కానీ నాకు మంచి ప్రజలు దొరికారనిపిస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రజలు తమ మీద నమ్మకం ఉంచి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అంతే నమ్మకంతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తన మీద అభిమానం ఉన్న వాళ్లు బొకేలు, శాలువాలు తేకుండా చెట్టును పెంచాలని సూచించారు. నాడు ఎన్నికల వల్ల ఆగిపోయిన బతుకమ్మ చీరలు ఇప్పుడు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బాబును తెలంగాణ ప్రజలు విశ్వసించలేరు నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తెలంగాణ ప్రజలు విశ్వసించలేరని, కాంగ్రెస్ పార్టీని సైతం తిరస్కరించారని మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరులో బతుకమ్మ చీరలు పంపీణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ పథకాలకే ప్రజలు జై కొట్టారన్నారు. ప్రజలకు ఐదేళ్లు సేవ చేసుకుంటామని, రైతు బంధు పథకం ద్వారా రైతులకు 10 వేలు అందిస్తామని తెలిపారు. -
‘ఇవాంకాకు సిరిసిల్ల చీరను ఇవ్వండి’
సాక్షి, వేములవాడ: అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకాకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బతుకమ్మ చీరను బహుమతిగా ఇవ్వాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ చీరను కానుకగా ఇవ్వకుంటే నేత కార్మికులను అవమాన పరిచినట్లేనని ఆయన తెలిపారు. చీరను కానుకగా ఇవ్వకపోతే తామే మెండితో బాక్స్ తయారు చేసి, అందులో చీరను ప్రభుత్వానికి అందజేస్తామని పొన్నం అన్నారు. అమెరికా- భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ఈ సదస్సు కోసం నగరానికి నవంబర్ 28న విచ్చేయనున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 28న జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు హజరవనున్న ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండు పోచంపల్లి పట్టుచీరలు, డైమండ్ నెక్లెస్ బహూకరించనున్నట్లు తెలిసింది. -
చీర కోసం క్యూలో నిల్చున్న మహిళ మృతి
కౌడిపల్లి (నర్సాపూర్): బతుకమ్మ చీర కోసం క్యూలో నిల్చున్న ఓ మహిళ కిందపడి అక్కడికక్క డే మృతి చెందింది. ఈ ఘటన కౌడిపల్లి మండలం కొట్టాల పంచాయతీ కార్యాలయం వద్ద మంగళ వారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చౌదరిపేట బంజ విజయమ్మ (55) చీర కోసం వచ్చి వరుసలో నిలబడిన కాసేపటికే కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, విజయమ్మకు అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేదని గ్రామస్తులు తెలిపారు.