‘చంద్రబాబువి హత్యా రాజకీయాలు’
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని, సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని అన్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన అర గంటలోనే డీజీపీ, హోమ్ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అభిమాని దాడి అని చెప్పారు.. వాళ్లు కచ్చితంగా ఎలా చెప్పారు.. పథకం ప్రకారమే తెలిసి చేసినట్లు ఉందన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని, వివేకా హత్యపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆయనే రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవన్నారు
ప్రకాశం : రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఒప్పుకున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. సిట్ ద్వారా వైఎస్ వివేకా హత్యకుట్ర బయటకు రాదన్నారు. సీబీఐ విచారణ జరపాలన్నారు.
వివేకానంద రెడ్డి నాకు ఆప్తులు: రఘురామ కృష్టంరాజు
పశ్చిమ గోదావరి: వైఎస్ వివేకానందరెడ్డి తనకు చాలా ఆప్తులని వైఎస్సార్ సీపీ నాయకులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డిది హత్య అని తెలియగానే విస్మయానికి గురయ్యానన్నారు. చీమకు కూడా అపకారం చెయ్యని వివేకానందరెడ్డిని హత్య చేయడానికి దుర్మార్గులకు చేతులు ఎలా వచ్చాయ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్యను వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.