సోషల్ మీడియాకు చంద్రబాబు భయపడుతున్నారు
విజయవాడ/ఒంగోలు: సోషల్ మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని వైఎస్‌ఆర్ సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. భావప్రకటన స్వేచ్ఛను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా సోషల్ మీడియా గొంతు నొక్కుతున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ అభిమానులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపులకు ఎవరూ భయపడరని, టీడీపీ పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని వెల్లంపల్లి హెచ్చరించారు.
వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. వాస్తవాలు వెల్లడి కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రతిపక్ష నేతను టీడీపీ సోషల్ మీడియా దూషిస్తే తప్పుకాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే జనం ప్రత్యక్షంగా తిరగబడతారని హెచ్చరించారు.