Battery Swapping Station
-
చార్జింగ్ టెన్షన్ లేదిక.. ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఒప్పందం
హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ క్వాంటమ్ ఎనర్జీ తాజాగా బ్యాటరీ స్మార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీల మార్పిడి (స్వాపింగ్) కోసం 25 పైచిలుకు నగరాల్లో 900 పైగా ఉన్న బ్యాటరీ స్మార్ట్ స్వాప్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని క్వాంటమ్ ఈ–స్కూటర్స్ డైరెక్టర్ సి. చేతన తెలిపారు. చార్జింగ్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా యూజర్లు రెండు నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో చార్జ్ అయిన బ్యాటరీలను పొందవచ్చని వివరించారు. ఈ తరహా బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ విధానం వల్ల జీవితకాలం పూర్తయిన బ్యాటరీలను రీప్లేస్ చేసుకునే వ్యయాలు తగ్గుతాయని తెలిపారు. బ్యాటరీ స్మార్ట్ స్వాపింగ్ స్టేషన్లు వ్యూహాత్మకంగా అధిక జన సాంద్రత, ట్రాఫిక్ ప్రాంతాలకు సమీపంలో ఉంటాయి. దీంతో క్వాంటం ఎనర్జీ స్కూటర్లకు అందుబాటులో ఉంటాయని, తద్వారా వాహనదారులకు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని కంపెనీ చెబుతోంది. -
ఈ–టూవీలర్ల కోసం రేస్‌ఎనర్జీ, హాలా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ సంస్థ రేస్‌ఎనర్జీ, రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ హాలా మొబిలిటీ తాజాగా జట్టు కట్టాయి. దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు ఎలక్ట్రిక్ టూ–వీలర్లను డెలివరీ సర్వీసుల కోసం వినియోగంలోకి తేనున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి తొలి దశ కింద కొన్ని వాహనాలు వినియోగంలోకి రానున్నట్లు సంస్థలు తెలిపాయి. విస్తృతమైన రేస్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ .. తమ మార్కెట్, కస్టమర్ల బేస్‌ను మరింతగా పెంచుకునేందుకు సహాయకరంగా ఉండగలదని హాలా మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఈ–ఆటో మార్కెట్లో తాము పటిష్టంగా ఉన్నామని, హాలాతో జట్టు కట్టడం ద్వారా మిగతా విభాగాల్లోకి కూడా గణనీయంగా విస్తరించగలమని రేస్‌ఎనర్జీ సహవ్యవస్థాపకుడు, సీఈవో అరుణ్ శ్రేయాస్ పేర్కొన్నారు. -
ఈవీ బ్యాటరీ చార్జింగ్ నిరీక్షణకు త్వరలో చెల్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ వాహనాలను (ఈ–వాహనాలను) వేధిస్తున్న బ్యాటరీ చార్జింగ్ సమస్యకు త్వరలో ముగింపు పడనుంది. బ్యాటరీ చార్జింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఇక ఉండదు. అందుకోసం దేశంలో ఈవీ స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రాజెక్టును కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదించింది. దేశంలో స్వర్ణ చతుర్భుజి వెంబడి తొలిదశలో 700 ఈవీ స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పాలని భావిస్తోంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ వాహనాల్లో ఇంధనం అయిపోతుంటే సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లి పెట్రోల్/ డీజిల్ వెంటనే నింపుకోవచ్చు. కానీ ఈ–వాహనాల బ్యాటరీ చార్జింగ్ అయిపోతే చాలా ఇబ్బంది. బ్యాటరీ చార్జింగ్కు కనీసం రెండు గంటలు పడుతుంది. దేశంలో అవసరమైనన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. దీంతోపాటు చార్జింగ్కు ఎక్కువ సమయం పడుతోంది. ఈ ప్రతిబంధకాలతోనే ఈ–వాహనాలను కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీనికి పరిష్కారంగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 2050 నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందులో భాగంగా 2027 నాటికి ఈ–ద్విచక్ర వాహనాల మార్కెట్ ను 70 శాతం పెంచాలని భావిస్తోంది. అందుకుగాను జాతీయ రహదారుల వెంబడి ఈవీ చార్జింగ్ స్టేషన్లతోపాటు ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పాలని నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ నీతి ఆయోగ్‌కు చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్–అసెస్మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్ఏసీ)తో కలసి అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించింది. ప్రతి 20 కిలోమీటర్లకు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఈ–వాహనాల్లో బ్యాటరీ చార్జింగ్ అయిపోతోందంటే సమీపంలోని ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌కు వెళ్తే చాలు. చార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తీసుకుని అప్పటికే చార్జింగ్ చేసి ఉంచిన బ్యాటరీని ఇస్తారు. బ్యాటరీ చార్జింగ్ రుసుము మాత్రమే తీసుకుంటారు. దాంతో ఈ–వాహనదారులు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. 2030 నాటికి దేశంలో ఈ–వాహనాల మార్కెట్‌ను అంచనా వేస్తూ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారుల వెంబడి ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) భావిస్తోంది. తొలిదశలో 700 స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పాలని నిర్ణయించి, అందుకోసం స్థలాలను కూడా గుర్తించారు. వాటిలో ఇప్పటికే 100 స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. (క్లిక్: ఆర్బీకేలతో పీఏసీఏస్‌ల అనుసంధానం) ఆంధ్రప్రదేశ్‌లోంచి వెళుతున్న స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు పరిధిలోని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపైన తొలిదశలో 50 ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. త్వరలో నిర్మాణం పూర్తి కానున్న చెన్నై– బెంగళూరు జాతీయ రహదారి మీద తొలిదశలో 20 ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2023 మార్చి 31 నాటికి తొలిదశ స్వాపింగ్ స్టేషన్లను నెలకొల్పాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం ఈవీ స్వాపింగ్ స్టేషన్ల అవసరాలను అధ్యయనం చేసి తరువాత దశల్లో నెలకొల్పాల్సిన స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటామని విజయవాడలోని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ కార్యాలయ అధికారులు తెలిపారు. (క్లిక్: సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల)