సాక్షి, అమరావతి: విద్యుత్ వాహనాలను (ఈ–వాహనాలను) వేధిస్తున్న బ్యాటరీ చార్జింగ్ సమస్యకు త్వరలో ముగింపు పడనుంది. బ్యాటరీ చార్జింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఇక ఉండదు. అందుకోసం దేశంలో ఈవీ స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రాజెక్టును కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదించింది. దేశంలో స్వర్ణ చతుర్భుజి వెంబడి తొలిదశలో 700 ఈవీ స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పాలని భావిస్తోంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ వాహనాల్లో ఇంధనం అయిపోతుంటే సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లి పెట్రోల్/ డీజిల్ వెంటనే నింపుకోవచ్చు. కానీ ఈ–వాహనాల బ్యాటరీ చార్జింగ్ అయిపోతే చాలా ఇబ్బంది. బ్యాటరీ చార్జింగ్‌కు కనీసం రెండు గంటలు పడుతుంది. దేశంలో అవసరమైనన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. దీంతోపాటు చార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతోంది.
ఈ ప్రతిబంధకాలతోనే ఈ–వాహనాలను కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీనికి పరిష్కారంగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 2050 నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందులో భాగంగా 2027 నాటికి ఈ–ద్విచక్ర వాహనాల మార్కెట్ ను 70 శాతం పెంచాలని భావిస్తోంది. అందుకుగాను జాతీయ రహదారుల వెంబడి ఈవీ చార్జింగ్ స్టేషన్లతోపాటు ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పాలని నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ నీతి ఆయోగ్‌కు చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్–అసెస్‌మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్‌ఏసీ)తో కలసి అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించింది.
ప్రతి 20 కిలోమీటర్లకు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్
ఈ–వాహనాల్లో బ్యాటరీ చార్జింగ్ అయిపోతోందంటే సమీపంలోని ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌కు వెళ్తే చాలు. చార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తీసుకుని అప్పటికే చార్జింగ్ చేసి ఉంచిన బ్యాటరీని ఇస్తారు. బ్యాటరీ చార్జింగ్ రుసుము మాత్రమే తీసుకుంటారు. దాంతో ఈ–వాహనదారులు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. 2030 నాటికి దేశంలో ఈ–వాహనాల మార్కెట్‌ను అంచనా వేస్తూ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారుల వెంబడి ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావిస్తోంది. తొలిదశలో 700 స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పాలని నిర్ణయించి, అందుకోసం స్థలాలను కూడా గుర్తించారు. వాటిలో ఇప్పటికే 100 స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. (క్లిక్: ఆర్బీకేలతో పీఏసీఏస్‌ల అనుసంధానం)
ఆంధ్రప్రదేశ్‌లోంచి వెళుతున్న స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు పరిధిలోని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపైన తొలిదశలో 50 ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. త్వరలో నిర్మాణం పూర్తి కానున్న చెన్నై– బెంగళూరు జాతీయ రహదారి మీద తొలిదశలో 20 ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2023 మార్చి 31 నాటికి తొలిదశ స్వాపింగ్ స్టేషన్లను నెలకొల్పాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం ఈవీ స్వాపింగ్ స్టేషన్ల అవసరాలను అధ్యయనం చేసి తరువాత దశల్లో నెలకొల్పాల్సిన స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటామని విజయవాడలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ కార్యాలయ అధికారులు తెలిపారు. (క్లిక్: సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల)
Comments
Please login to add a commentAdd a comment