Batting practise
-
కూకబురా బంతులతో బ్యాటింగ్ ప్రాక్టీస్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని ప్రాక్టీస్ భిన్నంగా సాగుతోంది. మంగళవారం జరిగిన నెట్ సెషన్లో మహీ... ఎర్రటి కూకబురా బంతులతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. మామూలుగా వన్డే మ్యాచ్‌లకు ఉపయోగించే తెల్ల బంతులతోనే ఎవరైనా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తారు. కానీ మహీ దీనికి భిన్నంగా చేశాడు. రెండో ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని... కొద్దిసేపు స్పిన్నర్లు, ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ వేసిన బంతులను ఎదుర్కొని సాధన చేశాడు. ఇక సెషన్ ముగిసిందనుకున్న దశలో మళ్లీ ప్యాడ్లు కట్టుకొని నెట్లోకి వచ్చాడు. నెట్ వెనకాల కోచ్ ఫ్లెచర్, జట్టు విశ్లేషకుడు ధనంజయ్‌లు కూర్చొని ఉండగా కూకబురా బంతులతో అరగంట పాటు ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ కొనసాగినంతసేపు ఫ్లెచర్.. మహీకి సూచనలు చేస్తూనే ఉన్నాడు. కవర్స్‌లో వేగంగా కదలడంపై ఎక్కువగా దృష్టిసారించినట్లు కనిపించింది. -
బ్రాత్‌వైట్ సెంచరీ
షిమోగా: భారత్ ‘ఎ’-వెస్టిండీస్ ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఎలాగూ ఫలితం డ్రా అని తెలిసిన తర్వాత వెస్టిండీస్ ‘ఎ’ జట్టు ఏ మాత్రం ప్రయోగాలకు పోకుండా మ్యాచ్‌ను బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ఉపయోగించుకుంది. ఓపెనర్ బ్రాత్‌వైట్ (247 బంతుల్లో 104; 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... దేవ్‌నారాయణ్ (142 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) ఏడు పరుగుల తేడాతో శతకాన్ని కోల్పోయాడు. ఈ ఇద్దరి రాణింపుతో నాలుగో రోజు శనివారం వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భార్గవ్ భట్ రెండు వికెట్లు తీసుకోగా... జహీర్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 406 పరుగులు చేయగా... భారత్ 359 పరుగులకే పరిమితమైంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్టు గెలిచిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఆఖరి టెస్టు 9 నుంచి హుబ్లీలో జరుగుతుంది.