batukamma Competitions
-
కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు
కెనడా ప్రముఖ నగరం టొరంటోలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడిన వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరై బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) కెనడా నేతృత్వంలో పనిచేసే తంగేడు సాంస్కృతిక సంస్థ ఈ వేడుకలను నిర్వహించింది.పుట్టి పెరిగిన తెలంగాణ నేలకు వేల మైళ్ల దూరంలో ఉన్నా, తమ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించాలని, కెనడాలో పుట్టిన పిల్లలకు పండగల ప్రాధాన్యతలను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ యేటా బతుకమ్మతో సహా బోనాలు, ఇతర పండగలను నిర్వహిస్తున్నామని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ తెలిపింది.ప్రకృతి, పర్యావరణంతో అలరారే కెనడాలో లభించే రంగురంగుల పూలతో పేర్చన బతుకమ్మలు పండగ సంబరాలకు మరింత వన్నె తెచ్చాయి. టొరంటోలో బ్రాంప్టన్ వేదికగా విశాలమైన సెకండరీ స్కూల్ ఈ వేడుకలకు వేదిక అయింది. సుష్మ సాయి, అమితా రెడ్డిలు సమన్యయం చేసి పెద్ద సంఖ్యలో మహిళలు కుటుంబాలతో సహా పాల్గొనేలా చేశారు.పండగలో పాల్గొన్న అందరికీ కమిటీ పసందైన తెలంగాణ వంటలతో విందును ఏర్పాటు చేసింది. కెనడాలో స్థిరపడినా తమ మూలాలు, అస్థిత్వం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో గత ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఉత్సవాలను, బతుకమ్మ పండగను ప్రతీ యేటా నిర్వహిస్తున్నామని టీడీఎఫ్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది అన్నారు. పండగ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ టీడీఎఫ్ (కెనడా) ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీకాంత్ నేరవేట్ల, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ ధర్మపురి, వెంకట రమణా రెడ్డి మేద, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!) -
అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!
తెలంగాణ సంస్కృతికి చిహ్నహైన బతుకమ్మ సంబరాలు దేశ విదేశాల్లోనూ అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడున్న వారి సంస్కృతి, నేపథ్యం మరువమని చెప్పేలా అంతా ఒకచోట చేరి పండుగలు చేసుకోవడం విశేషం. అమెరికాలో నార్త్ కరోలినా కాంకార్డ్ కానన్ రన్ ప్రన్థమ్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో ... బతుకమ్మ పాటలతో తెలంగాణ సంప్రదాయం మురుసింది.. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తళుక్కుమనారు. (చదవండి: అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు) -
అధికారిక..సంబురం
సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగను తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అవతరణ సందర్భంగా జిల్లా కేంద్రంలో తెలంగాణ సంబరాలు నిర్వహించి విజయవంతం చేసిన కలెక్టర్ ఇప్పుడు ‘బతుకమ్మ’ పండగకు కొత్త శోభ తీసుకువచ్చే పనిలో ఉన్నారు. బతుకమ్మ పండగ ఈసారి అత్యంత ఉత్సాహాల మధ్య జరిగేలా కార్యక్రమం రూపు దిద్దుకుం టోంది. జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఈ పండగను అద్భుతంగా నిర్వహించేందకు మహిళలకు బతుకమ్మ పోటీలను నిర్వహించనున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో బతుకమ్మ సంబరాలు జరుపుతారు. అక్టోబరు 1వ తేదీన జిల్లా స్థాయిలో పండగను జరపాలని నిర్ణయించారు. బతుకమ్మల నిమజ్జన కార్యక్రమానికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఇవీ...పోటీలు..! బతుకమ్మ పోటీలు, విజేతలకు బహుమతుల కోసమే కనీసం రూ.20లక్షల దాకా వెచ్చించనున్నారు. ఇదంతా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా జరిగే కార్యక్రమమే. 28వ తేదీన గ్రామస్థాయిలో జరిపే పోటీలు సర్పంచ్ నేతృత్వంలో జరుగుతాయి. గ్రామ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా, రూ.ఒక వెయ్యి, రూ.500, రూ.300 అందజేస్తారు. గ్రామస్థాయిలో ప్రథమ బహుమతులు వచ్చిన వారందరితో 29వ తేదీన మండల స్థాయిలో పోటీ నిర్వహించి మండల అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యుల ఆధ్వర్యంలో మూడు బహుమతులు ఇస్తారు. ప్రథమ -రూ.3వేలు, ద్వితీయ- రూ.2వేలు, తృతీ య - రూ.వెయ్యి బహుమతిగా అందజేస్తారు. 30వ తేదీన నియోజకవర్గ స్థాయిలో పోటీలు ఉంటాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయి. మండల స్థాయిలో మొదటి స్థానం దక్కించుకున్న వారితో నియోజకవర్గ స్థాయి పోటీలు ఉంటాయి. ఈ దశలోనూ మూడు బహుమతులు ఉంటాయి. ప్రథమ -రూ.5వేలు, ద్వి తీయ-రూ.3వేలు, తృతీయ-రూ.2వేల బహుమతి ఉంటుంది. ఇక, ఆఖరిరోజైన అక్టోబరు 1న జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయి. నియోజకవర్గస్థాయిలో ప్రథమ బహుమతి పొందినవారు ఇక్కడ పోటీలో పాల్గొంటారు. ప్రథమ-రూ.10వేలు, ద్వితీయ-రూ.5వేలు, తృతీయ - రూ.3వేలు బహుమతిగా అందజేస్తారు. జిల్లా పోటీలో పాల్గొనే మిగిలిన తొమ్మిదిమందికి పార్టిసిపేషన్ గిఫ్ట్‌గా రూ.వెయ్యి గిఫ్టు ఓచర్ ఇస్తారు. వీరందరికీ ప్రశంసపత్రాలు కూడా ఇస్తారు. ఇక, డివిజన్, జిల్లాస్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు బతుకమ్మ అంశంపైనే వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు.