అధికారిక..సంబురం | telangana samburalu for batulkamma festival | Sakshi
Sakshi News home page

అధికారిక..సంబురం

Published Sat, Sep 13 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

telangana samburalu for batulkamma festival

సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగను తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అవతరణ సందర్భంగా జిల్లా కేంద్రంలో తెలంగాణ సంబరాలు నిర్వహించి విజయవంతం చేసిన కలెక్టర్ ఇప్పుడు ‘బతుకమ్మ’ పండగకు కొత్త శోభ తీసుకువచ్చే పనిలో ఉన్నారు. బతుకమ్మ పండగ ఈసారి అత్యంత ఉత్సాహాల మధ్య జరిగేలా కార్యక్రమం రూపు దిద్దుకుం టోంది.
 
జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఈ పండగను అద్భుతంగా నిర్వహించేందకు మహిళలకు బతుకమ్మ పోటీలను నిర్వహించనున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో బతుకమ్మ సంబరాలు జరుపుతారు. అక్టోబరు 1వ తేదీన జిల్లా స్థాయిలో పండగను జరపాలని నిర్ణయించారు. బతుకమ్మల నిమజ్జన కార్యక్రమానికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు.
 
ఇవీ...పోటీలు..!
బతుకమ్మ పోటీలు, విజేతలకు బహుమతుల కోసమే కనీసం రూ.20లక్షల దాకా వెచ్చించనున్నారు. ఇదంతా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా జరిగే కార్యక్రమమే. 28వ తేదీన గ్రామస్థాయిలో జరిపే పోటీలు సర్పంచ్ నేతృత్వంలో జరుగుతాయి. గ్రామ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా, రూ.ఒక వెయ్యి, రూ.500, రూ.300 అందజేస్తారు. గ్రామస్థాయిలో ప్రథమ బహుమతులు వచ్చిన వారందరితో 29వ తేదీన మండల స్థాయిలో పోటీ నిర్వహించి మండల అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యుల ఆధ్వర్యంలో మూడు బహుమతులు ఇస్తారు. ప్రథమ -రూ.3వేలు, ద్వితీయ- రూ.2వేలు, తృతీ య - రూ.వెయ్యి బహుమతిగా అందజేస్తారు. 30వ తేదీన నియోజకవర్గ స్థాయిలో పోటీలు ఉంటాయి.
 
ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయి. మండల స్థాయిలో మొదటి స్థానం దక్కించుకున్న వారితో నియోజకవర్గ స్థాయి పోటీలు ఉంటాయి. ఈ దశలోనూ మూడు బహుమతులు ఉంటాయి. ప్రథమ -రూ.5వేలు, ద్వి తీయ-రూ.3వేలు, తృతీయ-రూ.2వేల బహుమతి ఉంటుంది. ఇక, ఆఖరిరోజైన అక్టోబరు 1న జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయి.

నియోజకవర్గస్థాయిలో ప్రథమ బహుమతి పొందినవారు ఇక్కడ పోటీలో పాల్గొంటారు. ప్రథమ-రూ.10వేలు, ద్వితీయ-రూ.5వేలు, తృతీయ - రూ.3వేలు బహుమతిగా అందజేస్తారు. జిల్లా పోటీలో పాల్గొనే మిగిలిన తొమ్మిదిమందికి పార్టిసిపేషన్ గిఫ్ట్‌గా రూ.వెయ్యి గిఫ్టు ఓచర్ ఇస్తారు. వీరందరికీ ప్రశంసపత్రాలు కూడా ఇస్తారు. ఇక, డివిజన్, జిల్లాస్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు బతుకమ్మ అంశంపైనే వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement