విద్యారంగం బలోపేతానికి కమిషన్ ఏర్పాటు చేయాలి
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ గేయానంద్ కోరారు. అదేవిధంగా ప్రతి మోడల్ పాఠశాలకు కోటి రుపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని డీసీఈబీ హాలులో శనివారం ఆంద్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బీరం సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నేటికీ చాలా పాఠశాలల్లో తగినన్ని మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మంచినీటికి ట్యాం కులు సరిగాలేవన్నారు. తొలగించిన కంప్యూటర్ ఉపాధ్యాయులను మళ్లీ తీసుకోవాలని కోరారు. భాషాపండితుల అప్గ్రేడేషన్, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించామన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు ఆమోదింప జేయడానికి కృషి చేశామన్నారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరెడ్డి మాట్లాడుతూ డైట్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టుల ప్రమోషన్లకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటి డీఈఓ, ఎంఈఓల పోస్టులను భర్తీ చేయక పోవటంవల్ల పర్యవేక్షణ కొరవడిందన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజా మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై జిల్లా విద్యాశాకా కార్యాలయం వద్ద ఈనెలలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.