నా మరణసంతాపంలో ఈ ముక్క రాయొద్దు!
'నా మరణ సంతాపంలో ఇది మొదటి లైను కాకూడదు' అంటూ ఆన్లైన్లో అనుకోకుండా వచ్చిన పాపులారిటీతో ఇబ్బంది పడుతున్న ఓ విద్యావేత్త వాపోతున్నారు. బీబీసీ ఇంటర్వ్యూ లైవ్ ప్రసారంలో తన పిల్లలు చొరబడి ఆగమాగం చేయడంతో దక్షిణకొరియాకు చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ కెల్లీ ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయారు. పుసాన్ జాతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై గురించి బీబీసీ లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. ఆయన పిల్లలు మధ్యలోకి వచ్చి కొంత అల్లరి చేశారు. ఇంటిలోని కార్యాలయం నుంచి ఆయన ఈ ఇంటర్వ్యూ ఇస్తుండగా.. మొదట ఆయన పాప, ఆ వెంటనే వాకర్‌లో ఉన్న చిన్నారి కొడుకు లోపలికి చొరబడి.. ఇంటర్వ్యూలో దర్శనమిచ్చారు.
ఈ విషయాన్ని లైవ్ ప్రసారంలో చూసి బిత్తరపోయిన ఆయన భార్య వెంటనే లోపలికి వచ్చి ఆదరాబాదరాగా ఆ ఇద్దరు చిన్నారులను లాక్కెళ్లిపోయారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కన్నా ఆయన పిల్లలు చొరబడి చేసిన హంగామానే ఆన్లైన్లో బాగా పేలింది. ఏకంగా బీబీసీ యూట్యూబ్ పేజీలో ఈ వీడియోను 16 కోట్లమంది చూశారు. దీంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయిన రాబర్ట్ కెల్లీ తాజాగా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ఇలా ప్రపంచమంతటా ఫేమస్ అవుతానని అనుకోలేదని, తను మరణించిన తర్వాత కూడా తన సంతాప సందేశంలో మొదటిలైను ఇదే ఉంటుందని, ఇలాంటి గుర్తింపు తనకు వద్దని ఆయన వాపోయారు.