BC Girls hostel
-
విద్యార్థినిపై మ్యాట్రిన్ దాష్టీకం
చిన్నారిని కొట్టి... తోటి విద్యార్థినులతో కొట్టించిన వైనం నేలకొండపల్లి(పాలేరు): మేడమ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నారంటూ తోటి విద్యార్థినులను అడిగిన పాపానికి వసతి గృహ సంక్షేమాధికారిణి(మ్యాట్రిన్) చిన్నారిని తొడ కందిపోయేలా పిండి, తీవ్రంగా కొట్టి, రెండు గంటలపాటు నిలబెట్టింది. అదీచాలక విద్యార్థినులతో కూడా చెంప దెబ్బలు కొట్టించింది. ఆమె దాష్టీకానికి తట్టుకోలేక చిన్నారి అల్లాడిపోయింది. ఆమె భర్త కూడా హాస్టల్‌కు వచ్చి అసభ్య పదజాలంతో తిట్ల దండకం అందుకున్న ఘటన శనివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో జరిగింది. నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి కొత్తూరు కు చెందిన కందగట్ల నందిని నేలకొండపల్లిలోని బీసీ బాలికల వసతి గృహంలో మూడో తరగతి చదువుతోంది. అయితే హాస్టల్లో ఉండే విద్యార్థినులు రోజూ మాట్రిన్ ఇంట్లో పని చేసేందుకు వెళ్తున్నారు. ‘రోజూ మేడమ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు’ అని నందిని అమాయకంగా వారిని అడిగింది. ఈ విషయాన్ని కొందరు విద్యార్థినులు మ్యాట్రిన్‌కు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆమె నందినిపై దాష్టీకానికి దిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్‌కు వచ్చి నందినిని ఇంటికి తీసుకెళ్లారు. చిన్నారిని హింసించిన సంక్షేమాధికారిణి, ఆమె భర్తపై చర్య తీసుకోవాలని రజక, బీసీ సంక్షేమ సంఘాలు డిమాండ్ చేశాయి. కాగా, ఈ ఘటనపై తమకు సమాచారం లేదని, హాస్టల్‌కి వెళ్లి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి హృషికేష్‌రెడ్డి తెలిపారు. -
అమ్మా.. సెలవ్!
నేను ఏ తప్పూ చేయలేదు నాపై చాడీలు చెప్పారు మీరంతా బాగుండాలంటూ.. హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య పెద్దశంకరంపేటలో ఘటన తల్లడిల్లిన తల్లిదండ్రులు పెద్దశంకరంపేట: ‘అమ్మా.. సెలవ్. నేను ఏ తప్పూ చేయలేదు. ఓ ఇద్దరు నాపై కల్పించి చెప్పారు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మీరంతా బాగుండాలి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఎనిమిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. నారాయణఖేడ్ మండలం చల్లగిద్దతండాకు చెందిన కర్ర హరినాయక్, చావ్లీబాయి దంపతుల చిన్న కూతురు అరుణ (14) పెద్దశంకరం పేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ అక్కడే బాలికల హాస్టల్లో ఉంటుంది. ఆమె పిన్ని అనిత ఈ హాస్టల్లోనే ఆయాగా పనిచేస్తోంది. తనపై వచ్చిన అభాండాలపై మనస్తాపానికి లోనైన అరుణ శనివారం ఉదయం వార్డెన్ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కన్నీరు పెట్టించిన సూసైడ్ నోట్... అరుణ రాసిన సూసైడ్ నోట్లోని అంశాలు అందరిని కన్నీరు పెట్టించాయి. ‘సెల్ఫోన్లో ఏదో ఫొటో ఉందని నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు... అలాంటి విషయం నాకేది తెలియదు.. మౌనిక, భూలక్ష్మి నాపై చాడీలు చెప్పారు. నేను ఏ తప్పూ చేయలేదు. అమ్మా, చివరిసారిగా నీతో మాట్లాడతానని చెప్పినా పిన్ని (ఆయా) ఫోన్ చేయలేదు. పిన్ని వాలింటికి వెళ్తే భరించలేని మాటలు, నానా బూతులు తిట్టారు. అమ్మా, హాస్టల్లో నా ఫ్రెండ్‌కు 10 రూపాయలు ఇవ్వాలి. తప్పకుండా ఇవ్వండి. వెళ్తానమ్మ.. అనితక్కను, సోను వాళ్లను అడిగానని చెప్పు. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించడమ్మా.... ఇక సెలవు.. అని రాసింది. తల్లడిల్లిన తల్లిదండ్రులు... కూతురు అరుణ మరణించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హరినాయక్, చావ్లీబాయితోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు తల్లడిల్లిపోయారు. బోరున విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. తమ కూతురు చదువుకొని ఉత్తమురాలు అవుతుందని ఆశిస్తే అంతలోనే జీవితం ముగిసి పోయిందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరుణ మృతికి కారకులను శిక్షించాలని, నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఖేడ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నారాయణఖేడ్: హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని అరుణ మృతదేహానికి నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం చల్లగిద్ద తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. -
పురుగుల అన్నం మాకొద్దు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తమకు పెట్టాల్సిన సరుకులను వర్కర్లు కాజేస్తూ విద్యార్థినుల సంఖ్యకు సరిపోను వంట చేయకపోవడంతో రోజూ అర్థాకలితో అలమటిస్తున్నామని, పైగా పురుగుల అన్నం పెడుతున్నారని, దీనిపై వార్డెన్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని..వర్కర్లను నిలదీస్తే తమనే దండిస్తున్నారని.. మీరైనా సమస్యలు పరిష్కరిచాలని స్థానిక బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినీలు ఆదివారం కలెక్టర్ ప్రియదర్శినిని వేడుకున్నారు. దాదాపు గంటపాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారితో రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారుు.. ఆదివారం తెల్లవారుజామున బీసీ బాలికల హాస్టల్ నుంచి వర్కర్లు యాదమ్మ, జయమ్మ సరుకులు దొంగిలిస్తుండగా హాస్టల్ విద్యార్థిను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై వార్డెన్‌కు సమాచారం అందించినా ఆయన పట్టించుకోవడంతో వారు హాస్టల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ కిచిడి చేస్తే చట్నీ చేయలేదని, అర్ధరాత్రి రెండు గంటలకు వండిన అన్నం మధ్యాహ్నం తినాల్సి వస్తుందన్నారు. అన్నం సరిపోక ప్రతిరోజూ కొందరు విద్యారులు ఉపవాసం ఉండాల్సి వస్తోందన్నారు.అన్నంలో పురుగులు వస్తున్నాయని, భవనానికి కరెంట్ షాక్ వస్తుందని చెప్పినా వార్డెన్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వర్కర్ అలివేలు విద్యార్థినులతో వాగ్వాదానికి దిగడంతో వర్కర్లను తొలగించాలని పట్టుబడుతూ వారు ఆందోళన ఉధృతం చేశారు. 9గంటల వరకు ఆందోళన చేసినా సంబంధిత అధికారులు హాస్టల్ వద్దకు రాక పోవడంతో పీడిఎస్యు ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా నాయకురాలు గణిత మాట్లాడుతూ విద్యార్థినుల సమస్యలపై సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. నాణ్యమైన భోజనం పెట్టక పోవడంతో విద్యార్థినులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు రాము, వెంకట్, విద్యార్థినులు మమత, అరుణ, స్వప్న, షభానా, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు విప్లవ తదితరులు పాల్గొన్నారు. -
కుళ్లిన కూరగాయలతో విందు
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో గురువారం విద్యార్థులకోసం కుళ్లిన వంకాయలతో చేసిన కూర, ఉడకని అన్నం సిద్ధం చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండాను సరిగా ఆవిష్కరించారో లేదో పరిశీలించడానికి విద్యార్థి సంఘాల నాయకులు బాలికల హాస్టల్ కు వచ్చారు. రంగు వెలసిన కాగితాలను అతికించడం, జెండా రెపరెపలాడకుండా కర్రకు అతుక్కుపోయి ఉండడంపై వారు హాస్టల్ సిబ్బందిని ప్రశ్నించారు. జెండాను ఆవిష్కరించిన వెంటనే వార్డెన్ విజయలక్ష్మి వెళ్లిపోయారని సిబ్బంది చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించి విస్మయం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు వెజ్‌బిర్యాని, పాయసం వడ్డించాల్సి ఉంది. అయితే ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో చేసిన కూరను గమనించి వెంటనే తహశీల్దార్‌కు సమాచారం అందించారు. ఆయన హాస్టల్‌కు వచ్చి సిబ్బంది వివరణ తీసుకున్నారు. కలెక్టర్‌కు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఆందోళనలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యాసాగర్, సంతోష్, మహేశ్, ప్రవీణ్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.