అమ్మా.. సెలవ్!
నేను ఏ తప్పూ చేయలేదు
నాపై చాడీలు చెప్పారు
మీరంతా బాగుండాలంటూ..
హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య
పెద్దశంకరంపేటలో ఘటన
తల్లడిల్లిన తల్లిదండ్రులు
పెద్దశంకరంపేట: ‘అమ్మా.. సెలవ్. నేను ఏ తప్పూ చేయలేదు. ఓ ఇద్దరు నాపై కల్పించి చెప్పారు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మీరంతా బాగుండాలి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఎనిమిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. నారాయణఖేడ్ మండలం చల్లగిద్దతండాకు చెందిన కర్ర హరినాయక్, చావ్లీబాయి దంపతుల చిన్న కూతురు అరుణ (14) పెద్దశంకరం పేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ అక్కడే బాలికల హాస్టల్‌లో ఉంటుంది. ఆమె పిన్ని అనిత ఈ హాస్టల్‌లోనే ఆయాగా పనిచేస్తోంది. తనపై వచ్చిన అభాండాలపై మనస్తాపానికి లోనైన అరుణ శనివారం ఉదయం వార్డెన్ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కన్నీరు పెట్టించిన సూసైడ్ నోట్...
అరుణ రాసిన సూసైడ్ నోట్‌లోని అంశాలు అందరిని కన్నీరు పెట్టించాయి. ‘సెల్‌ఫోన్‌లో ఏదో ఫొటో ఉందని నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు... అలాంటి విషయం నాకేది తెలియదు.. మౌనిక, భూలక్ష్మి నాపై చాడీలు చెప్పారు. నేను ఏ తప్పూ చేయలేదు. అమ్మా, చివరిసారిగా నీతో మాట్లాడతానని చెప్పినా పిన్ని (ఆయా) ఫోన్ చేయలేదు. పిన్ని వాలింటికి వెళ్తే భరించలేని మాటలు, నానా బూతులు తిట్టారు. అమ్మా, హాస్టల్‌లో నా ఫ్రెండ్‌కు 10 రూపాయలు ఇవ్వాలి. తప్పకుండా ఇవ్వండి. వెళ్తానమ్మ.. అనితక్కను, సోను వాళ్లను అడిగానని చెప్పు. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించడమ్మా.... ఇక సెలవు.. అని రాసింది.
తల్లడిల్లిన తల్లిదండ్రులు...
కూతురు అరుణ మరణించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హరినాయక్, చావ్లీబాయితోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు తల్లడిల్లిపోయారు. బోరున విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. తమ కూతురు చదువుకొని ఉత్తమురాలు అవుతుందని ఆశిస్తే అంతలోనే జీవితం ముగిసి పోయిందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరుణ మృతికి కారకులను శిక్షించాలని, నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఖేడ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం
నారాయణఖేడ్: హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని అరుణ మృతదేహానికి నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం చల్లగిద్ద తండాలో అంత్యక్రియలు నిర్వహించారు.