పురుగుల అన్నం మాకొద్దు | Rice mites in bc girls hostel | Sakshi
Sakshi News home page

పురుగుల అన్నం మాకొద్దు

Published Mon, Sep 8 2014 1:51 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Rice mites in bc girls hostel

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తమకు పెట్టాల్సిన సరుకులను వర్కర్లు కాజేస్తూ విద్యార్థినుల సంఖ్యకు సరిపోను వంట చేయకపోవడంతో రోజూ అర్థాకలితో అలమటిస్తున్నామని, పైగా పురుగుల అన్నం పెడుతున్నారని, దీనిపై వార్డెన్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని..వర్కర్లను నిలదీస్తే  తమనే దండిస్తున్నారని.. మీరైనా సమస్యలు పరిష్కరిచాలని స్థానిక బీసీ బాలికల   హాస్టల్ విద్యార్థినీలు ఆదివారం కలెక్టర్ ప్రియదర్శినిని వేడుకున్నారు. దాదాపు గంటపాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారితో రాతపూర్వకంగా ఫిర్యాదు  తీసుకున్నారు.  

అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.  సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారుు.. ఆదివారం తెల్లవారుజామున  బీసీ బాలికల హాస్టల్ నుంచి వర్కర్లు యాదమ్మ, జయమ్మ సరుకులు దొంగిలిస్తుండగా హాస్టల్ విద్యార్థిను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై వార్డెన్‌కు సమాచారం అందించినా ఆయన పట్టించుకోవడంతో వారు హాస్టల్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ కిచిడి చేస్తే చట్నీ చేయలేదని, అర్ధరాత్రి రెండు గంటలకు వండిన అన్నం మధ్యాహ్నం తినాల్సి వస్తుందన్నారు.

అన్నం సరిపోక ప్రతిరోజూ కొందరు విద్యారులు ఉపవాసం ఉండాల్సి వస్తోందన్నారు.అన్నంలో పురుగులు వస్తున్నాయని, భవనానికి కరెంట్ షాక్ వస్తుందని చెప్పినా వార్డెన్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ  సందర్భంగా అక్కడికి వచ్చిన వర్కర్ అలివేలు విద్యార్థినులతో వాగ్వాదానికి  దిగడంతో వర్కర్లను తొలగించాలని పట్టుబడుతూ వారు ఆందోళన ఉధృతం చేశారు. 9గంటల వరకు ఆందోళన చేసినా సంబంధిత అధికారులు హాస్టల్ వద్దకు రాక పోవడంతో పీడిఎస్‌యు ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు.  

ఈ సందర్భంగా పీడిఎస్‌యు జిల్లా నాయకురాలు గణిత మాట్లాడుతూ విద్యార్థినుల సమస్యలపై సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. నాణ్యమైన భోజనం పెట్టక పోవడంతో విద్యార్థినులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.   కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు రాము, వెంకట్, విద్యార్థినులు మమత, అరుణ, స్వప్న, షభానా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకురాలు విప్లవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement