BC welfare groups
-
ప్రత్యేక ప్రణాళికతోనే బీసీలకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న బీసీ కులాలు ఇప్పటికీ పలు రంగాల్లో ప్రాతినిథ్యం లేకుండా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. శుక్రవారం బీసీ భవన్లో వెనుకబడిన తరగతుల కుల సంఘాల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 18 సంఘాలు పాల్గొన్నాయి. కృష్ణయ్య మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే తమ డిమాండ్పై ప్రభుత్వం స్పందించాలన్నారు. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీల ఎంపికలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. కులాంతర వివాహాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.10వేల నుంచి రూ.2లక్షలకు పెంచాలన్నారు. కుల సంఘాల భవనాల నిర్మాణానికి రూ.10 ఎకరాల భూమి, రూ.10 కోట్లు కేటాయించాలన్నారు. బీసీ సంక్షేమ కమిషనర్గా బీసీ వ్యక్తిని, గురుకులాల కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిని నియమించాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన అన్నారు. బీసీలకు అమలు చేస్తున్న క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, ఐఐటీ, ఐఐఎంలలో చదివే విద్యార్థులకు ఫీజులివ్వాలని కోరారు. -
విద్యార్థినిపై మ్యాట్రిన్ దాష్టీకం
చిన్నారిని కొట్టి... తోటి విద్యార్థినులతో కొట్టించిన వైనం నేలకొండపల్లి(పాలేరు): మేడమ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నారంటూ తోటి విద్యార్థినులను అడిగిన పాపానికి వసతి గృహ సంక్షేమాధికారిణి(మ్యాట్రిన్) చిన్నారిని తొడ కందిపోయేలా పిండి, తీవ్రంగా కొట్టి, రెండు గంటలపాటు నిలబెట్టింది. అదీచాలక విద్యార్థినులతో కూడా చెంప దెబ్బలు కొట్టించింది. ఆమె దాష్టీకానికి తట్టుకోలేక చిన్నారి అల్లాడిపోయింది. ఆమె భర్త కూడా హాస్టల్కు వచ్చి అసభ్య పదజాలంతో తిట్ల దండకం అందుకున్న ఘటన శనివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో జరిగింది. నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి కొత్తూరు కు చెందిన కందగట్ల నందిని నేలకొండపల్లిలోని బీసీ బాలికల వసతి గృహంలో మూడో తరగతి చదువుతోంది. అయితే హాస్టల్లో ఉండే విద్యార్థినులు రోజూ మాట్రిన్ ఇంట్లో పని చేసేందుకు వెళ్తున్నారు. ‘రోజూ మేడమ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు’ అని నందిని అమాయకంగా వారిని అడిగింది. ఈ విషయాన్ని కొందరు విద్యార్థినులు మ్యాట్రిన్కు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆమె నందినిపై దాష్టీకానికి దిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్కు వచ్చి నందినిని ఇంటికి తీసుకెళ్లారు. చిన్నారిని హింసించిన సంక్షేమాధికారిణి, ఆమె భర్తపై చర్య తీసుకోవాలని రజక, బీసీ సంక్షేమ సంఘాలు డిమాండ్ చేశాయి. కాగా, ఈ ఘటనపై తమకు సమాచారం లేదని, హాస్టల్కి వెళ్లి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి హృషికేష్రెడ్డి తెలిపారు.