బీసీల హక్కులను దెబ్బతీస్తున్న మంజునాథ కమిషన్
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ బీసీల హక్కులను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని బీసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ శేషఫణి, కులాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పట్నం రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మంజునాథ కమిషన్ పర్యటించిన తీరు బీసీల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. కడప, అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో జరిగిన బహిరంగ విచారణలో తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరిని బీసీ–ఏ జాబితాలో ఉన్న ఓ సామాజికవర్గానికి, తాము ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో బీసీ రిజర్వేషన్ కోల్పోయామని చెప్పిన బీసీ విద్యార్థులకు ఈ అంశాలు తమ పరిధిలో లేవని కేవలం కాపులను బీసీ జాబితాలో చేర్చాలా వద్దా అనే అంశంపైనే మాట్లాడాలని చెప్పిన మంజునాథ కమిషన్ కర్నూలు బహిరంగ సభలో మాత్రం అన్ని సమస్యలను రెఫర్ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల పర్యటన గురించి కేవలం కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాలకు మాత్రమే సమాచారం అందించి విచారణ సజావుగా సాగుతుందని చెప్పడం తగదన్నారు. కొందరు బీసీ నాయకులు కూడా బీసీలకు నష్టం లేకుండా కాపు, బలిజలను బీసీలుగా గుర్తిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించడం బాధాకరమన్నారు. జిల్లాలో తప్పుడు బీసీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను కూడా త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి యాదవ్, విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వీ భరత్‌కుమార్ పాల్గొన్నారు.