ఆశపడ్డారో.. కొంప కొల్లేరే! కుక్కపిల్లని కూడా వదలరు
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఉన్నచోటనుంచే కడుపులో చల్ల కదలకుండా చాలా ఈజీగా చేసేస్తున్నాం. అంతేనా ఒక చిన్న క్లిక్‌తో ఇన్‌స్టంట్‌గా రుణాలు, యాప్ ద్వారా ఎక్కడినుంచి ఎక్కడికైనా క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలకసమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది.
మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచే స్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
కుక్క పిల్లనీ వదలరు..
హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు.
రాజస్తాన్‌లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్‌కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్‌గా ఉన్నాయి.
మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్‌కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్‌కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్‌ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్‌లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు.
దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు.
ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు.
నకిలీ రూపాలు..
రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు.
ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదోవిధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ 2 వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు.
ఏంటి మార్గం..?
రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్‌కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్‌కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్‌కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.
డబ్బులు కొట్టేశారా..!
ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్‌లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది.