టెకీపై పోలీసుల జులుం
బెంగళూరు : బ్రిటీష్ నిరంకుశ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినా.. లంచం అనే మహమ్మారి నుంచి ఇంకా స్వేచ్ఛ రాలేదు. ఓ భారతీయుడిగా తానెందుకు లంచం ఇవ్వాలని ప్రశ్నించిన ఆంద్రప్రదేశ్ కు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి వెంకీకి స్వాతంత్ర్య దినోత్సవ రాత్రిపూటే పోలీసుల నుంచి ఊహించని ఘటన ఎదురైంది. పోలీసు స్టేషన్ లాక్కెళ్లి మరీ బాధితుడిని తీవ్రంగా హింసించారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
బాధితుడు అందించిన సమాచారం ప్రకారం... సిటీకి కొత్తగా వచ్చిన వెంకీ కజిన్, తెలియక నాన్-పార్కింక్ జోన్లో కారును నిలిపాడు. దీంతో కే.ఆర్ పురమ్ పోలీసు స్టేషన్ దగ్గర్లో వినాయక దేవాలయం వద్ద ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న వెంకీ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. స్పాట్‌కు వెళ్లిన వెంకీని పోలీసులు లెక్కచేయకపోయే సరికి, చలాన్ ఇవ్వకుండా ఫైన్ ఎలా చెల్లిస్తామని అతను ప్రశ్నించాడు.. దీంతో పోలీసుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మమల్ని ప్రశ్నిస్తావా అంటూ విరుచుకుపడ్డారు.
భారతీయుడిని ప్రశ్నించే హక్కు తనకు ఉందని ఎదురు తిరగడంతో పోలీసులు తమదైన శైలిలో రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. కేఆర్ పురమ్ పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లి మరీ క్రూరంగా హింసించారు. 40వేల విలువ చేసే గోల్డ్ చైన్, మూడు వేల రూపాయల నగదును లాగేసుకున్నారు. కేవలం లంచాన్ని డిమాండ్ చేస్తున్న పోలీసులను, చలాన్ ఇవ్వమని ప్రశ్నించినందుకే తనపై ఈ ఘటనకు పాల్పడారని ఆరోపించాడు.
అయితే ఈ విషయంపై బాధితుడి నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నామని, ఆ పరిధికి చెందిన ఏసీపీ, అతని ఫిర్యాదును విచారిస్తారని ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ చెప్పారు.