Beating Heart
-
వజ్రంలో వజ్రం..బీటింగ్ హార్ట్‌గా పేరు.. అమూల్యమైన విలువ!
సూరత్: వజ్రాన్ని చూస్తేనే కళ్లు చెదురుతాయి. ధగధగలాడుతూ చూపరుల్ని కట్టి పడేస్తుంది. అలాంటిది వజ్రంలో వజ్రం ఉంటే ఇంక వేరే చెప్పాలా. కళ్లు కూడా తిప్పుకోలేం. అలాంటి అరుదైన వజ్రం గుజరాత్లో సూరత్‌లో వి.డి. గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి లభించింది. ఆ వజ్రం లోపలున్న వజ్రం కూడా లోపల అటూఇటూ ఎంచక్కా కదులుతోందని ఆ కంపెనీ వెల్లడించింది. 0.329 క్యారట్ల ఈ వజ్రానికి బీటింగ్ హార్ట్ అని పేరు పెట్టారు. వజ్రాల గనుల తవ్వకాల్లో గత ఏడాది అక్టోబర్‌లో ఈ వజ్రం లభించింది. అరుదైన వజ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ది జెమ్ అండ్ జ్యుయెలరీ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) దానిపై మరింత అధ్యయనం చేసింది. ఆప్టికల్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ ద్వారా విశ్లేషించి 2019లో సైబీరియాలో లభించిన వజ్రం మాదిరిదే బీటింగ్ హార్ట్ కూడానని తేల్చింది. అప్పట్లో సైబీరియాలో లభించిన ఈ వజ్రంలో వజ్రం 80 కోట్ల ఏళ్ల కిందటిదని, విలువ అమూల్యమని చెప్పుకున్నారు. ఆ వజ్రానికి మత్రోష్కా అని పేరు పెట్టారు. రష్యాలో తయారు చేసే ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే చెక్క బొమ్మల్ని మత్రోష్కా అని పిలుస్తారు. ఇప్పుడు అచ్చంగా అదే మాదిరి వజ్రం మన దేశంలో కూడా లభించడం విశేషం. ఈ వజ్రం లోపలి వజ్రం కూడా అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. వజ్రాలపై అధ్యయనం చేసే ‘డి బీర్స్’గ్రూప్‌కు చెందిన నిపుణురాలు సమంతా సిబ్లీ గత 30 ఏళ్లలో బీటింగ్ హార్ట్‌లాంటి అరుదైన వజ్రాన్ని చూడలేదని చెప్పారు. ఈ వజ్రం ఎలా ఏర్పడిందో అధ్యయనం చేస్తామని తెలిపారు. -
‘బీటింగ్ హార్ట్’ను చిత్రించిన హబుల్
వాషింగ్టన్ : భూమికి 6523 కాంతి సంవత్సరాల దూరంలో ప్రజ్వరిల్లుతున్న నక్షత్రం ‘సూపర్నోవా క్రాబ్ నెబ్యులా’లోని కేంద్ర ప్రాంతం ‘బీటింగ్ హార్ట్’ను నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ ఫొటో తీసింది. సూర్యుడితో సమానమైన భారం, అంతకుమించిన సాంద్రత కలిగిన న్యూట్రాన్ స్టార్ క్రాబ్ నెబ్యులా.. బీటింగ్ హార్ట్ ప్రదేశం నుంచి అత్యంత వేగంతో రేడియోధార్మిక, విద్యుదీకృత పదార్ధాలను బయటకు వెదజల్లుతోంది. సెకనుకు 30 స్వయంప్రదిక్షణలతో సంకోచ, వ్యాకోచాలు చెందుతూ.. కాంతి కిరణాలను, మెరుస్తున్న వాయువులను ఉద్గారిస్తూ.. హృదయ స్పందన తరహాలో కనిపించే ఈ బీటింగ్ హార్ట్ భాగాన్ని.. అత్యంత స్పష్టతతో తాజాగా హబుల్ చిత్రించింది.