అందంగా లేననే అనుమానం..!?
అంజలి సింగ్.. ఢిల్లీకి చెందిన విద్యార్థి. 21 ఏళ్లు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి తెలుగు, తండ్రి పంజాబీ. ఆమెకు తన బాడీ ఇమేజ్ గురించి అసంతృప్తి. అదెంతవరకు వెళ్లిందంటే.. 24 గంటలూ దాని గురించే ఆలోచించేంతగా. తను అట్రాక్టివ్‌గా లేననే మాట మనసులో తిరుగుతూనే ఉంటుంది. దాంతో ఒకటికి పదిసార్లు అద్దంలో చూసుకోవడం, కనిపించిన లోపాలను సరిచేసుకోవడానికి గంటలు గంటలు వెచ్చించడం ఆమెకు అలవాటుగా మారిపోయింది.సోషల్ మీడియా ప్రభావం..తన డిజైనర్ పనికోసం ప్రేరణ పొందేందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను స్క్రోల్ చేయడం ఆమె ఆందోళనకు మూలంగా మారింది. పూర్తిగా మేకప్ వేసుకున్న, భారీగా ఎడిట్ చేసిన మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల పిక్స్ చూసి, వాళ్లతో పోల్చుకుంటుంది. తను వాళ్లలా స్లిమ్‌గా లేనని, అందుకే తాను ఆకర్షణీయంగా లేనని బాధపడుతుంది.కేలరీల కొలత..స్లిమ్ అవ్వడం కోసం కేలరీలను నిశితంగా ట్రాక్ చేస్తుంది. ఏది తిన్నా, తాగినా కేలరీలు లెక్కేసుకుంటుంది. త్వరగా బరువు తగ్గుతారని ట్రెండ్ అయిన కీటో డైట్ కూడా పాటించింది. యాంగ్జయిటీ ఎక్కువైనప్పుడు విపరీతంగా తినేసి, ఆ వెంటనే గిల్టీగా ఫీలై కొన్ని రోజులపాటు భోజనం పూర్తిగా మానేస్తోంది. ఇవన్నీ కలసి తనకు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టాయి.సామాజిక ఒత్తిడి..అంజలి నాన్న తరఫు బంధువులందరూ తెల్లగా, ఫిట్‌గా ఉంటారు. దాంతో వాళ్లు అంజలిని కలసినప్పుడల్లా ‘కొంచెం స్లిమ్‌గా, కాస్త ఛాయ మెరుగ్గా ఉంటే అందంగా ఉండేదానివి’ అని కామెంట్ చేస్తుంటారట. వాస్తవానికి అంజలి అందంగానే ఉంటుంది. కానీ బంధువుల మాటలు, సోషల్ మీడియాలో కనిపించే జీరోసైజ్ మోడల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పోల్చుకోవడం ఆమె అభద్రతాభావానికి కారణమయ్యాయి. వాటికి తోడు ఫ్రెండ్స్ కూడా బరువు తగ్గడం గురించి, డైటింగ్ గురించి తరచూ మాట్లాడటం తన ఆందోళనను మరింత తీవ్రం చేసింది. తాను అట్రాక్టివ్‌గా లేననే ఆలోచనతో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లడం మానేసింది. ఎలాగైనా స్లిమ్‌గా, ఫిట్‌గా కావాలనే కోరిక తనపై ఒత్తిడిని పెంచుతోంది. అన్నీ కలసి ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నతస్థాయికి చేరాలనే కోరికను అడ్డుకుంటున్నాయి.థెరపీతో పరిష్కారం..అంజలిలాగే చాలామంది యువతులు జీరోసైజ్ కోసం కష్టపడుతుంటే, యువకులు సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్‌లలో చెమటోడుస్తున్నారు. ఇలాంటివారు ముందుగా చేయాల్సింది అమితాభ్బచ్చన్, రజనీకాంత్లకు సిక్స్ ప్యాక్‌లు లేవని.. అందరూ ఐశ్వర్యారాయ్‌లా ఉండలేరని గుర్తించాలి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ ద్వారా బాడీ ఇమేజ్ పట్ల అంజలి.. తనకున్న నెగెటివ్ భావనలను, వాటికి మూలకారణాలను అర్థం చేసుకుంది. ఐదు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది.పాజిటివ్ బాడీ ఇమేజ్ కోసం..మీ బాడీ ఇమేజ్ పట్ల మీకున్న ప్రతికూల, విమర్శనాత్మక ఆలోచనలను గుర్తించండి. అవి వాస్తవికతపై ఆధారపడి ఉన్నాయా లేక సోషల్ స్టాండర్డ్స్ ద్వారా వక్రీకరించబడ్డాయా? అనేది గమనించండి.– మీ ప్రతికూల ఆలోచనలను గుర్తించాక, ‘నా ఫ్రెండ్‌తో నేనిలాగే మాట్లాడతానా? ఇలాగే విమర్శిస్తానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.– అవాస్తవికమైన బాడీ ఇమేజ్ ప్రమాణాలను ప్రోత్సహించే సోషల్ మీడియా అకౌంట్స్‌కు దూరంగా ఉండండి.– ఆకారం కంటే ఆరోగ్యం ముఖ్యమని గ్రహించండి. డా¯Œ ్స, యోగా లేదా ఈత వంటి వాటిని రోజూ ప్రాక్టీస్ చేయండి.– అద్దం ముందు నిలబడి మీ సానుకూల లక్షణాలపై దృష్టి పెట్టండి. ‘ఎవరి అందం వారిదే’, ‘నేను ప్రత్యేకం’, ‘నేను అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాను’ అని చెప్పుకోండి.– బాడీ ఇమేజ్‌తో కాకుండా టాలెంట్‌తో స్ఫూర్తి పంచే కళాకారులు, డిజైనర్లు, క్రియేటర్లను అనుసరించండి. మీరు ఎలా ఉన్నారనేది కాకుండా, మిమ్మల్ని మీరుగా అంగీకరించే స్నేహితులతో కనెక్ట్ అవ్వండి.– ఈ సెల్ఫ్–హెల్ప్ టిప్స్ సరిపోవనిపిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. – డా. సైకాలజిస్ట్ విశేష్