కరీనా.. మీరే కరెక్ట్
ఎంత కాదన్నా కరీనా ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’. సెటైరిస్టుల బ్రెయిన్‌లే కాస్త అందంగా ఆలోచించడం నేర్చుకోవాలి.
రేపు ‘వీరె ది వెడ్డింగ్’ రిలీజ్ అవుతోంది. మూవీ ట్రైలర్లో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరాభాస్కర్, శిఖా తల్సానియా.. ఈ నలుగురు అమ్మాయిలూ మగాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఫెమినిస్టులేమో అనుకుంటాం.. ‘ఫెమినిజం’ అంటే మనకు అర్థమయ్యేదాన్ని బట్టి! బోల్ట్‌గా ఉంటారు. బోల్ట్‌గా మాట్లాడేస్తుంటారు. నలుగురూ చిన్ననాటి స్నేహితులు. కరీనా పెళ్లికి మిగతా ముగ్గురూ వస్తారు. మగాళ్ల గురించి కబుర్లే కబుర్లు. వీళ్ల చుట్టూ పెళ్లికథ ప్రదక్షిణలు చేస్తుంటుంది. ‘వీరె ది వెడ్డింగ్’ అంటే ‘నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి’ అని అర్థమట! ఈ అర్థం పంజాబీలోనా, హిందీలోనా, మరింకేదైనా భాషలోనా తెలీదు. సినిమా సంగతటుంచితే, బయట ఈ నలుగురమ్మాయిలూ ఎవరికి వాళ్లు ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’. అంటే ఇంటెలిజెంట్లు. అయితే కరీనా ఇంటెలిజెన్స్ మీద కొత్తగా సందేహాలొస్తున్నాయి సెటైరిస్టులకి! ‘వీరె ది వెడ్డింగ్’ చిత్రం ప్రమోషన్ ఈవెంట్లో కరీనా మాట్లాడింది ఏమీ అర్థం కాలేదట. అందుకే ఈ సందేహాలు. ‘‘స్త్రీ,పురుష సమానత్వాన్ని నమ్ముతాను. అలాగని ఫెమినిస్టునని చెప్పను. నేను మహిళను. అంతకన్నా కూడా మనిషిని. నేను కరీనా అని చెప్పుకోడానికి ఎంత గర్వపడతానో, సైఫ్ అలీఖాన్ భార్యను అని చెప్పుకోడానికి అంతే గర్వపడతాను’’ అన్నారు ఆ ఈవెంట్లో కరీనా. ఆ మాటల్ని పట్టుకున్నారు సోషల్ మీడియా సెటైరిస్టులు!
‘ఫెమినిజం అంటే సమానత్వమే కదా. సమానత్వాన్ని నమ్ముతాను అంటోంది, ఫెమినిస్టును కాదని అంటోంది. కరీనా ఒకసారి డిక్షనరీ చూస్తే బాగుంటుంది. ఫెమినిజం అంటే ‘పురుష ద్వేషం’ అని ఆమె అనుకుంటున్నట్లుంది’ అని సెటైర్లు మొదలయ్యాయి. అవి అక్కడితో ఆగలేదు. గతంలో ఆమె వేర్వేరు సందర్భాలలో ఇచ్చిన వేర్వేరు స్టేట్మెంట్లలోకి కూడా వెళ్లిపోయి వాటిల్లో ఇంటెలిజెన్స్ పాళ్లు ఏమాత్రం లేవని ఆమె అజ్ఞానాన్ని తవ్వి పోస్తున్నారు! గతంలో ఒక ఈవెంట్లో కరీనాను ఎవరో.. ‘మీరు వాడే ల్యాప్‌టాప్ ఏంటి? మీ హార్డ్‌వేర్ ఏంటి? అని అడిగారు. ఆ సమయంలో ‘సోనీ వాయో’ ల్యాప్‌టాప్ ప్రమోషన్లో ఉన్నారు కరీనా. ‘ఏ హార్డ్వేరో నాకు తెలీదు. అయితే నా దగ్గరున్నది మాత్రం గ్రీన్ వన్’ అని చెప్పారు. అంటే ఆకుపచ్చ రంగుదని. దాన్ని బయటికి తీశారు! ఇంకోసారి.. ‘నేను అనుకోవడం గత పదీ పదిహేనేళ్లలో ఇంత లోతైన పాత్రను ఏ నటీ వేసి ఉండదు’ అని అన్నారు కరీనా. ఆమె అన్నది ‘మై ప్రేమ్ కి దీవానీ హూ’ చిత్రం గురించి. దాన్ని బయటికి తీశారు! ‘చాలామంది నటులు స్క్రిప్టు చదువుతారు. నేనూ చదవడానికి ప్రయత్నిస్తాను. కానీ నిద్రపట్టేస్తుంది’ అని ఐదేళ్ల క్రితం పీటీఐ ఇంటర్వ్యూలో అన్నారు కరీనా. దాన్నీ బయటికి తీశారు! ‘రా.వన్’ ప్రాజెక్ట్‌లోకి తనెందుకు వచ్చిందీ చెబుతూ, ‘నేను అందంగా కనిపించడానికి మాత్రమే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను. ఈ స్టంట్లూ అవీ నాకు కష్టమైన పనులు. పాటల్లో నటించడం, చక్కగా కనిపించడం ఎంజాయ్ చేస్తాను. అందుకే షారుక్‌తో.. పాటలు నాకిచ్చి, మీ స్టంట్లు మీరు చేసుకుంటానంటేనే సినిమాలో నేనుంటాను అన్నాను’ అని ఇంకో ఇంటర్వ్యూలో చెప్పారు కరీనా. దాన్నీ బయటికి తీశారు! ‘పెళ్లిరోజుకి సైఫ్‌కి మీరు.. మీరు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సోనీ వాయో ల్యాప్‌టాప్‌ని గిఫ్టుగా ఇస్తారా?’ అని అడిగితే ‘సైఫ్ దగ్గర ఆల్రెడీ సోనీ వాయో ఉంది. కానీ ఆయన మ్యాక్ వాడతారు’ అన్నారు కరీనా. దాన్నీ బయటికి తీశారు. తీసి, ఆమె తెలివితేటల్ని సందేహించారు.
కరీనా తెలివితేటల మీద ఉన్న ఈ సందేహాలు ఆమె అందం మీద, ఆమె నటన మీద మాత్రం నిస్సందేహంగా ఉండవు. కాటుక ఎక్కువ తక్కువ పెట్టుకున్నా, లిప్‌స్టిక్ షేడ్స్ ఈవెన్‌గా లేకున్నా ఆమె ఒరిజినల్ అందం ఆమెదే. అదెక్కడికీ పోదు. కరీనా ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా ఇలాగే.. కుదరని కాటుకలా, సమంగా లేని షేడ్లుగా ఎందుకు చూడకూడదు? ఫెమినిజం అంటే డిక్షనరీలోని అర్థం ఏమిటో ఆమెకు తెలియకున్నా, ఫెమినిజాన్ని ఆమె ‘పురుషద్వేషం’గా పొరపడుతున్నా, ఆమె వ్యక్తం చేసిన భావాలను డిక్షనరీ మీనింగ్కి ఎలాబరేషన్గా చూసే ప్రయత్నాన్ని మనం ఎందుకు చెయ్యకూడదు! అలా చేస్తే కరీనా ఇచ్చిన మిగతా స్టేట్మెంట్లలో కూడా తవ్వి తియ్యడానికి ఏమీ ఉండదు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నంత మాత్రాన హార్డ్‌వేర్ గురించి, సాఫ్ట్వేర్ గురించి తెలిసుండాలా?! అలాగైతే ఏం సంబం«దం ఉంటుందని ఏళ్లుగా మేల్ ప్రోడక్ట్స్‌కి ఫిమేల్ మోడలింగ్‌ని ఇప్పించుకుంటున్నాం. సెలబ్రిటీలను.. సంబంధం లేకుండా, సందర్భం లేకుండా, వాళ్ల సమ్మతి లేకుండా, వాళ్లేదో టాపిక్‌లో ఉన్నప్పుడు, మనం ఏవో ప్రశ్నలు వేస్తుంటాం. ఆ ప్రశ్నల కన్నా, వాటికి కరీనా చెప్పిన సమాధానాలు తెలివైనవి కావా?! సెటైరిస్టులు ఎన్ని సెటైర్లు వేసినా, కరీనా ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’. సెటైరిస్టుల బ్రెయిన్‌లే కాస్త అందంగా ఆలోచించడం నేర్చుకోవాలి.
– మాధవ్ శింగరాజు