అందంగా ఉంటే సరిపోదు!
కథానాయికగా చేసినా, ప్రత్యేక పాటకు కాలు కదిపినా.. ఏం చేసినా వంద శాతం బాగుండాలనుకుంటారు శ్రుతీహాసన్. ఎందుకంటే వృత్తిని దైవంగా భావిస్తారామె. ఎవరికైతే తాము చేసే వృత్తిపట్ల భక్తి, ప్రేమ ఉంటాయో వాళ్లు పైకొస్తారని కూడా అంటున్నారు ఈ బ్యూటీ. అది మాత్రమే కాదు... అందంగా ఉంటే సరిపోదు.. తెలివితేటలు కూడా ఉండాలని శ్రుతీహాసన్ చెబుతూ- ‘‘తెలివి తేటలు లేని అందం నా దృష్టిలో వేస్ట్. ఎందుకంటే మన జీవితం సరైన మార్గంలో వెళ్లాలంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. అవే మనల్ని కాపాడతాయి కానీ, అందం కాదు. సినిమాల్లో మమ్మల్ని చూసి, ‘ఎంత అందంగా ఉన్నారో’ అనుకుంటుంటారు.
అఫ్‌కోర్స్ మేం అందంగానే ఉంటాం. కాకపోతే, తెరపై మేం అంత అందంగా కనిపించడానికి కారణం మేకప్. మాకు మేకప్ చేయడానికి ఒకరు, హెయిర్ స్టయిల్ చేయడానికి మరొకరు ఉంటారు. వాళ్లు మా అందానికి మెరుగులు దిద్దుతారు. కానీ, తెలివితేటలకు మెరుగులు దిద్దడానికి ప్రత్యేకంగా ఎవరూ ఉండరు కదా. అందుకని మనం చేసే తప్పొప్పులే మనకు మంచి పాఠాలు. వాటి ద్వారా మనం తెలివితేటలు పెంచుకోవాలి’’ అన్నారు. ఇంత చెబుతోంది కదా.. మరి శ్రుతీహాసన్ తెలివితేటల సంగతేంటి అనుకుంటున్నారా? ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అంటారు కదా.. అందుకు ఓ ఉదాహరణ శ్రుతీహాసన్.